Best Thriller Movies On OTT: పెళ్లయిన వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకొని దాని వల్ల చిక్కుల్లో పడే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన సినిమా ఇది. తన బెస్ట్ ఫ్రెండ్, తను ఎంతగానో ప్రేమించిన భర్త ఒకేసారి మోసం చేశారని తెలిసి ఆ భార్య ఏం చేస్తుంది అనే కథతో తెరకెక్కిన సినిమానే ‘ది వీకెండ్ ఎవే’ (The Weekend Away). ఇందులో దిమ్మదిరిగే ట్విస్టులు లాంటివి పెద్దగా లేకపోయినా.. ఆసక్తికగా సాగే ఒక థ్రిల్లర్ మూవీగా మాత్రం ‘ది వీకెండ్ ఎవే’ ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తుంది.


కథ..


‘ది వీకెండ్ ఎవే’ కథ విషయానికొస్తే.. బెథ్ (లైటన్ మీస్టర్).. తన బెస్ట్ ఫ్రెండ్ అయిన కేట్ (క్రిస్టినా వాల్ఫ్)ను కలవడానికి అమెరికా నుండి క్రాషియా వెళ్తుంది. బెథ్ అక్కడ దిగగానే తను వచ్చిన క్యాబ్ డ్రైవర్ జైన్ (జైద్ బక్రీ).. తనకు ఏమైనా హెల్ప్ కావాలంటే చేస్తానని విజిటింగ్ కార్డ్ ఇస్తాడు. చాలారోజుల తర్వాత కలిశారు కాబట్టి కేట్.. తమకోసం ఒక హోటల్‌ను బుక్ చేస్తుంది. బెథ్ కూడా కేట్ కోసం ఒక గిఫ్ట్ తీసుకొస్తుంది. అప్పుడే బెథ్‌కు తన భర్త రాబ్ (లూక్ నారిస్) ఫోన్ చేస్తాడు. బెథ్‌కు పెళ్లయ్యి ఒక పాప కూడా ఉంటుంది. ఇక అదేరోజు సాయంత్రం బెథ్, కేట్ కలిసి ఒక రెస్టారెంట్‌కు వెళ్తారు. అదే సమయంలో కేట్‌కు ఫోన్ వస్తుంది. ఫోన్‌లో తను గట్టిగా గొడవపడుతూ మాట్లాడుతుంది. అది ఎవరు అని బెథ్ అడగగా.. తన మాజీ భర్త జై (పార్థ్ థాక్రేకర్) అని చెప్తుంది. తన మూడ్ బాలేదని అక్కడి నుండి బార్‌కు వెళ్దామని బెథ్‌తో అంటుంది. మరుసటి రోజు బెథ్.. హోటల్ రూమ్‌లో నిద్రలేస్తుంది. అసలు తనకు రాత్రి ఏం జరిగిందో అస్సలు గుర్తుండదు. పైగా కేట్ కూడా ఎక్కడా కనిపించదు. 


అప్పుడే హోటల్ మ్యనేజర్ సెబాస్టియన్ (అడ్రియన్ పెజ్డ్రిక్).. ముందు రోజు రాత్రి తను, కేట్.. ఇద్దరు అబ్బాయిలను హోటల్ రూమ్‌కు తీసుకొచ్చారని, అలా చేయడం కరెక్ట్ కాదని చెప్తాడు. అప్పుడే బెథ్‌కు విషయం అర్థమవుతుంది. ఇక కనిపించని కేట్ కోసం జైన్‌తో కలిసి వెతకడం మొదలుపెడుతుంది. ముందుగా ఆ ఇద్దరు అబ్బాయిలు ఎవరు అని తెలుసుకోవడానికి ఇన్‌స్టాగ్రామ్‌లో సెర్చింగ్ మొదలుపెడుతుంది బెథ్. వారి అకౌంట్‌కు మెసేజ్ చేసి ఒక చోటుకి రమ్మంటుంది. మెసేజ్ చేసింది బెథ్ అని తెలియక వాళ్లిద్దరూ అక్కడికి వస్తారు. వాళ్లు దొంగతనాలు చేస్తూ బ్రతుకుతామని, ఆరోజు కూడా కేట్ హ్యాండ్‌బ్యాగ్ తీసుకొని హోటల్ రూమ్ నుండి వచ్చేశామని ఆ బ్యాగ్‌ను బెథ్‌కు ఇస్తారు. కేట్ బ్యాగ్‌లో తన ఫోన్ కూడా ఉంటుంది. అవన్నీ తీసుకొని పోలీస్ స్టేషన్‌కు వెళ్తుంది బెథ్. ఒక లేడీ ఆఫీసర్‌ తన కంప్లైంట్ తీసుకొని కేట్ కోసం వెతుకుతామని చెప్తుంది. తిరిగి హోటల్‌కు వచ్చేసరికి తమ బుకింగ్ టైమ్ అయిపోయిందని, మరొక ఖాళీ రూమ్‌ను బెథ్‌కు ఇస్తాడు సెబాస్టియన్. కానీ ఆ రూమ్ పక్కనే మరో రూమ్‌పై బెథ్ కన్నుపడుతుంది. అప్పుడే పోలీస్ స్టేషన్ నుండి తనకు కాల్ వస్తుంది. 


పోలీసులకు కేట్ శవం సముద్రంలో దొరుకుతుంది. అది చూసి బెథ్ చాలా బాధపడుతుంది. తన ఫేస్‌తో ఫోన్‌ను అన్‌లాక్ చేస్తుంది. అప్పుడే తను ఊహించని విషయం ఒకటి బయటపడుతుంది. రాబ్‌కు, కేట్‌కు ఎప్పటినుండి వివాహేతర సంబంధం నడుస్తుందని తను తెలుసుకుంటుంది. వెంటనే ఈ విషయం పోలీసులకు కూడా తెలుస్తుంది. అసలు ఆ విషయం పోలీసులకు ఎలా తెలిసిందని హోటల్ రూమ్‌కు వెళ్లి చూస్తుంది. అప్పుడే తనకు అద్దం దగ్గర ఒక మైక్ దొరుకుతుంది. దీంతో తమ పక్క రూమ్‌లో కూడా ఏదో తప్పు జరుగుతుందని బెథ్ అనుమానిస్తుంది. సెబాస్టియన్‌కు తెలియకుండా ఆ రూమ్ తాళం తీసుకుంటుంది. అందులోకి వెళ్లి చూస్తే తమ హోటల్‌లోని ప్రతీ రూమ్‌లో కెమెరాలు ఉన్నాయని బెథ్‌కు తెలుస్తుంది. అసలు కేట్ మిస్ అయిన రోజు ఏం జరిగిందో ఆ కెమెరాల్లో చూస్తుంది. చివరికి ఏం జరిగింది? బెథ్ ఏం చేస్తుంది అన్నది తెరపై చూడాల్సిన కథ.



పాత కథ..


‘ది వీకెండ్ ఎవే’ సినిమా విషయానికొస్తే.. ఇందులో రొటీన్ ట్విస్టులే పెద్ద డ్రాబ్యాక్. ఆల్రెడీ ఈ కథ ఎక్కడో చూశామే అని ప్రేక్షకులకు అనిపిస్తుంది. కానీ కేట్‌ను వెతకడం కోసం బెథ్ ప్రయత్నిస్తున్నంతసేపు సినిమా చాలా ఇంట్రెస్టింగ్‌గా సాగుతుంది. క్లైమాక్స్‌లో ట్విస్ట్ ఉన్నా కూడా ఆ ట్విస్ట్‌ను చాలామంది ఆడియన్స్ ముందే ఊహించి ఉండవచ్చు. ఇక ఒక మామూలు థ్రిల్లింగ్ సినిమాను చూడాలనుకునే నెట్‌ఫ్లిక్స్‌లో ఉన్న ‘ది వీకెండ్ ఎవే’ను ట్రై చేయవచ్చు.


Also Read: దెయ్యాలకు క్లాస్ చెప్పే టీచర్, కోపంతో చచ్చినవారిని మళ్లీ చంపేస్తుంది - ఈ సినిమాలో క్లైమాక్స్ ట్విస్ట్ అసలు ఊహించలేరు