Squid Game 2 : 'స్క్విడ్ గేమ్ 2' అనే కొరియన్ సర్వైవల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ గురించి తెలియని ఓటీటీ ఆడియన్స్ ఉండరేమో బహుశా. ఎందుకంటే ఈ సిరీస్ నెట్ ఫ్లిక్స్ చరిత్రలోనే అత్యధిక వ్యూస్ తో ప్రపంచవ్యాప్తంగా టాప్ ట్రెండింగ్ లో నిలిచింది. భాషతో, ప్రాంతంతో సంబంధం లేకుండా ఈ సిరీస్ కి అన్ని వర్గాల ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అలాగే ఇందులో నటించిన మెయిన్ యాక్టర్స్ కూడా ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. ఇక ఈ సిరీస్ లో వచ్చే సీక్వెల్స్ ని వదలకుండా చూస్తున్నారు. అలా 'స్క్విడ్ గేమ్ 2' అంటే పడి చచ్చే మూవీ లవర్స్ కి తాజాగా ఓ బ్యాడ్ న్యూస్. 'స్క్విడ్ గేమ్ 2'లో నటించిన బామ్మ తాజాగా క్యాన్సర్ తో కన్నుమూసినట్టు సమాచారం.
కబళించిన క్యాన్సర్
దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ సీనియర్ నటి, వాయిస్ ఆర్టిస్ట్ లీ జూ షిల్ 80 ఏళ్ల వయసులో మరణించారు. 2025 ఫిబ్రవరి 2న ఆమె చనిపోయిందని సమాచారం. గత మూడు నెలల నుంచి ఆమె స్టమక్ క్యాన్సర్ తో పోరాడుతున్నట్టు దక్షిణ కొరియాకు చెందిన ఓ ఏజెన్సీ పేర్కొంది. లీ సుమారు ఉదయం 10:20 గంటల టైంలో సీయోల్ లోని తన రెండవ కుమార్తె ఇంట్లో చనిపోయినట్టు తెలుస్తోంది. ఆమె తీవ్ర అనారోగ్యానికి గురి కావడంతో కుటుంబ సభ్యులు దగ్గర్లోని హాస్పిటల్ కు తరలించినప్పటికీ, వైద్యులు బ్రతికించలేకపోయారని సమాచారం. ఈ క్రమంలోనే ఆమె మృతదేహాన్ని సియోల్‌లోని సించోన్‌లోని సెవెరెన్స్ ఆసుపత్రికి ట్రాన్స్ఫర్ చేశారు. అక్కడ అభిమానుల సందర్శనార్థం ఫిబ్రవరి 4 వరకు ఉంచి, ఫిబ్రవరి 5న ఉదయం అంత్యక్రియలు చేయబోతున్నట్టు సమాచారం.
క్యాన్సర్ ఇదే మొదటిసారి కాదు
లీకి క్యాన్సర్ రావడం ఇదే మొదటిసారి కాదని సమాచారం. 50 ఏళ్ల వయసులో కూడా ఆమెకు మూడవ స్టేజ్ రొమ్ము క్యాన్సర్ ఉన్నట్టుగా డాక్టర్లు నిర్ధారించారు. అయితే అప్పట్లో ఆమె దానిని సక్సెస్ ఫుల్ గా అధిగమించింది. కానీ సెకండ్ టైం మాత్రం ఆ క్యాన్సర్ మహమ్మారి ఆమెను కబళించింది. ఈ విషయం తెలిసిన మూవీ లవర్స్ ఆమె ఆత్మ శాంతించాలని కోరుకుంటున్నారు.
'స్క్విడ్ గేమ్ 2'లో తల్లిగా...
ఇక 'స్క్విడ్ గేమ్ 2'లో లీ జూ షిల్ 'పార్క్ మాల్ సూన్' అనే పాత్రతో పాపులర్ అయ్యింది. అందులో ఆమె హ్వాంగ్ జున్ హో (వై హా జూన్), లీ బైయుంగ్ హున్ (ఫ్రంట్ మ్యాన్)ల తల్లిగా నటించింది. పైగా ప్రతి క్షణం బ్రతికి ఉండాలని, ఆ వయసులో కూడా తన కొడుకుని కాపాడుకోవాలని తపన పడే తల్లిగా ఆమె యాక్టింగ్, ఎమోషన్స్ తో సీక్వెల్ లో హైలెట్ గా నిలిచింది. 'స్క్విడ్ గేమ్ 2' మాత్రమే కాకుండా ఆమె దశాబ్దాల పాటు కొరియన్ సినీ ఇండస్ట్రీలో పలు సినిమాల్లో నటించింది.
లీజూ నటించిన పాపులర్ సినిమాలు...
స్క్విడ్ గేమ్ 2, తో పాటు ది అన్‌వైటెడ్ హోమేజ్ (2003), ది సిటీ ఆఫ్ వయొలెన్స్ (2006), కమిట్‌మెంట్ (2013), నోట్‌బుక్ ఫ్రమ్ మై మదర్ (2017), క్లౌన్ ఆఫ్ ఎ సేల్స్‌మాన్ (2015) తదితర సినిమాలలో లీ నటించింది.