#90s Web Series: బిగ్ బాస్ సీజన్ 7లో టాప్ 3వ కంటెస్టెంట్‌గా శివాజీ బయటికొచ్చాడు. అదే సమయానికి తను లీడ్ రోల్‌లో నటించిన ‘#90స్’ అనే వెబ్ సిరీస్ విడుదలకు సిద్ధంగా ఉంది. తాజాగా విడుదలయ్యి విపరీతమైన పాపులారిటీ సంపాదించుకుంటుంది కూడా. ఇక ఆ సిరీస్ గురించి చాలా ఆసక్తికర విషయాలు బయటపెట్టారు శివాజీ. అంతే కాకుండా దర్శకుడు ఆదిత్య హాసన్‌ను ప్రశంసల్లో ముంచేశారు. 


ఓపెనింగ్ వచ్చేది కాదు


‘‘#90స్ అనేది అందరి కథ. ప్రతీ ఒక్కరి జీవితం అందులో కనిపిస్తుంది. రెండు రాష్ట్రాల్లోని టీచర్స్‌ను ఈ సిరీస్ చూడమని ఫోర్స్ చేస్తున్నారు. ఈరోజుల్లో డబ్బు అనేది ముఖ్యం అన్నట్టు అయిపోయింది. కానీ ఒక్కసారి ఈ సిరీస్ చూస్తే మళ్లీ బంధువులను ఎలా కలుపుకోవాలి అని తెలుస్తుంది. అన్ని అద్భుతంగా ఉంటాయి. ఆ అబ్బాయి చాలా బాగా రాసుకున్నాడు’’ అంటూ సిరీస్ గురించి గొప్పగా చెప్పారు శివాజీ. ఇక ఇలాంటి ఒక మంచి సబ్జెక్ట్‌ను థియేటర్లలో ఎందుకు విడుదల చేయలేదు అని తనకు ప్రశ్న ఎదురయ్యింది. ‘‘#90స్ అని పెడితే ఓపెనింగ్ ఎంత వచ్చేది? శివాజీ పదేళ్ల గ్యాప్ తర్వాత వస్తే థియేటర్‌కు ఎవడు వస్తాడు? బిగ్ బాస్‌కంటే ముందే షూటింగ్ చేశాం. ఇప్పుడు దీనిని సినిమా చేస్తే స్టూడెంట్స్ గ్యారెంటీగా వస్తారు. చేస్తారేమో. ఈటీవీ వాళ్లకు అన్నీ తెలుసు. మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు’’ అంటూ ఈ సిరీస్ సినిమా రూపంలో వస్తుందేమో అని చెప్తూ ప్రేక్షకుల్లో ఆశలు పెంచారు శివాజీ.


దేవుడిని మొక్కుకున్నా..


ఇక సిరీస్‌లో చూపించినట్టుగా ప్రభుత్వ పాఠశాలలు చాలా గొప్పవని, వాటి స్టాండర్డ్ వేరని అన్నారు శివాజీ. సిస్టమ్‌లో జరుగుతున్న తప్పుల వల్లే ప్రైవేట్ స్కూల్స్ లక్షల్లో ఫీజులు అడుగుతున్నారని ఆరోపించారు. ఇక ‘#90స్’ కథ వినే సమయానికి బిగ్ బాస్ అవకాశమే తనకు రాలేదని బయటపెట్టారు. ‘‘ఆ అబ్బాయి ఒక్కొక్క ఎపిసోడ్ చెప్తూ వెళ్తుంటే.. ఎక్కడైనా దారితప్పుతాడేమో అని దేవుడిని మొక్కుకున్నాను. ఎక్కడా లేదు. ఒక్కటే సిట్టింగ్, ఒక్క కరెక్షన్ లేదు. నా పరిస్థితి ఇలా ఉంటే.. ఈటీవీ విన్ అయితే వారి జీవితంలో ఈనాడు కంపౌండ్‌లో సింగిల్ సిట్టింగ్‌లో ఓకే చేసిన కథ ఇది అని వాళ్లే చెప్పారు. మనం మామూలుగా మాట్లాడుకునే విషయాలే ఉంటాయి సిరీస్‌లో. అదే విజువల్‌గా వస్తే #90స్’’ అని సిరీస్ తనకు ఎంత నచ్చిందో తెలిపారు శివాజీ.


వనపర్తి కుర్రాడు..


ఆదిత్య హాసన్ దర్శకుడిగా తెరకెక్కిన ఈ సిరీస్‌లో శివాజీ లీడ్ రోల్‌లో నటించగా.. తన భార్యగా వాసుకీ, పిల్లలుగా వాసంతిక, మౌళి, రోహన్ నటించారు. ‘#90స్’ ఒక మిడిల్ క్లాస్ బయోపిక్ అనే పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈటీవీ విన్‌లో అందుబాటులో ఉన్న ఈ సిరీస్‌కు ప్రేక్షకులు ఫ్యాన్ అయిపోతున్నారు. వెబ్ సిరీస్ విడుదల అవ్వకముందు టీమ్ చేసిన ప్రమోషన్‌ను చాలావరకు ప్రేక్షకులు పట్టించుకోలేదు. కానీ ఒక్కసారి విడుదలయ్యి ప్రేక్షకుల ముందుకు వచ్చిన తర్వాత ఆదిత్య హాసన్ ఎవరు అని తెలుసుకోవడం మొదలుపెట్టారు. తెలంగాణలోని వనపర్తికి చెందిన ఒక యంగ్ కుర్రాడు.. ఇలాంటి ఒక కనెక్టెడ్ వెబ్ సిరీస్‌ను తెరకెక్కించాడా అని చాలామంది ఆశ్చర్యపోతున్నారు.


Also Read: బిగ్ బాస్‌లో శివ్ చెప్పాలనుకున్న బ్యాడ్ న్యూస్ ఇదేనా? ఇక ప్రియాంకకు దూరంగా ప్రియుడు, కారణం ఇదే