Tillu Square OTT: ఈరోజుల్లో థియేటర్లలో సినిమా ఎంత పెద్ద బ్లాక్‌బస్టర్ హిట్ అయినా నెలరోజులు పూర్తవ్వక ముందే లేదా పూర్తయిన వెంటనే ఓటీటీలోకి వచ్చేస్తోంది. ప్రస్తుతం ‘టిల్లు స్క్వేర్’ సినిమాకు కూడా అదే జరిగింది. యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డను స్టార్‌ను చేసింది ‘డీజే టిల్లు’. ఆ మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కిందే ‘టిల్లు స్క్వేర్’. మామూలుగా ఒక సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ చేసి ఆడియన్స్‌ను మెప్పించడం అంత ఈజీ కాదని అంటుంటారు. కానీ ‘టిల్లు స్క్వేర్’ మాత్రం పెద్ద సక్సెస్ సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. థియేటర్లలో విడుదలయ్యి నెలరోజులు అవ్వక ముందే ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ ప్రారంభించుకుంది.


టిల్లన్న మ్యాడ్‌నెస్..


‘డిజే టిల్లు’ ఎంత సక్సెస్ అయ్యిందో.. ‘టిల్లు స్క్వేర్’ అంతకంటే పెద్ద హిట్‌ను అందుకుంది. ఈ మూవీ సిద్ధు జొన్నలగడ్డను రూ.100 కోట్ల హీరోను చేసింది. థియేటర్లలో విడుదలయిన 9 రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లో చేరింది ‘టిల్లు స్క్వేర్’. అంతే కాకుండా మొదటి వారంలోనే బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల్లోకి అడుగుపెట్టింది. ఇప్పటికీ కొన్ని థియేటర్లలో ‘టిల్లు స్క్వేర్’ రన్ అవుతునే ఉండగా.. అప్పుడే ఓటీటీలో కూడా స్ట్రీమింగ్ ప్రారంభించుకుంది ఈ సినిమా. ఈ విషయాన్ని స్వయంగా సితార ఎంటర్‌టైన్మెంట్స్ ప్రకటించింది. ‘ఇప్పుడు మీ హోమ్ స్క్రీన్స్‌లోనే టిల్లన్న మ్యాడ్‌నెస్‌ను చూసేయండి’ అంటూ పోస్ట్‌ను షేర్ చేసింది.






అంతే ఇంపాక్ట్..


ఏప్రిల్ 25 అర్థరాత్రి నుండే ‘టిల్లు స్క్వేర్’ మూవీ నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రైబర్లకు అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయిన ప్రేక్షకులు.. ఓటీటీలో దీనిని చూడడం ప్రారంభించారు. చూస్తుంటే థియేటర్లలో లాగానే ఓటీటీలో కూడా ఈ మూవీ రికార్డులు సృష్టించేలా అనిపిస్తోంది. రెండేళ్ల క్రితం విడుదలయిన ‘డీజే టిల్లు’లో రాధిక అనే క్యారెక్టర్‌తో నేహా శెట్టి ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో.. ఇప్పుడు ‘టిల్లు స్క్వేర్’లో లిల్లీగా అనుపమ పరమేశ్వరన్ కూడా అంతకంటే ఎక్కువ ఇంపాక్టే క్రియేట్ చేసింది. ఈ మూవీ సూపర్ హిట్ అవ్వడంలో అనుపమ పాత్ర చాలా ఉంటుంది. చాలామంది ఇందులో కొత్త అనుపమను చూడడానికి థియేటర్లకు వెళ్లారు.


నెగిటివ్ కామెంట్స్..


సితార ఎంటర్‌టైన్‍మెంట్, ఫార్చ్యూన్ ఫోర్ పతాకాలపై నిర్మాత సూర్య దేవర నాగవంశీ, సాయి సౌజన్య.. ‘టిల్లు స్క్వేర్’ను సంయుక్తంగా నిర్మించారు. మొదటి భాగంలాగానే సీక్వెల్‌లోని పాటలు కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ పాటలకు రామ్ మిర్యాల, అచ్చు రాజమణి సంగీతం అందించగా భీమ్స్ సిసిరోలియో బ్యాక్‍గ్రౌండ్ స్కోర్‌ ఇచ్చాడు. సినిమాలో సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్‌ రొమాన్స్‌ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇలాంటి క్యారెక్టర్‌ను ఎంచుకున్నందుకు అనుపమపై నెగిటివ్ కామెంట్స్ వచ్చినా ‘టిల్లు స్క్వేర్’ హిట్ మాత్రం తన కెరీర్‌కు ఓ రేంజ్‌లో ప్లస్ అవుతుందని ఇండస్ట్రీ నిపుణులు భావిస్తున్నారు.



Also Read: ఫోటోగ్రాఫర్లపై మండిపడ్డ ఎన్‌టీఆర్, వీడియో వైరల్ - అసలు ఏమైంది?