Anandhi's Shivangi Movie OTT Streaming On Aha: ప్రముఖ హీరోయిన్ ఆనంది (Anandhi), వరలక్ష్మి శరత్ కుమార్ (Varalaxmi Sarath Kumar) ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ మూవీ 'శివంగి'. క్రైమ్ థ్రిల్లర్ జానర్‌లో తెరకెక్కిన ఈ మూవీ మార్చి 7న ప్రేక్షకుల ముందుకు వచ్చి.. బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. తాజాగా.. ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా సడెన్‌గా ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది.
ఆ ఓటీటీలో స్ట్రీమింగ్
'శివంగి' (Shinvangi) మూవీ గురువారం నుంచి ప్రముఖ తెలుగు ఓటీటీ 'ఆహా'లో (Aha) స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు ఆహా తమిళ్ ఓటీటీలోనూ అందుబాటులోకి వచ్చింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా సదరు ఓటీటీ సంస్థ వెల్లడించింది. 'ఒకరోజు. జీవితాంతం పోరాటం. సత్యభామ కథ మిమ్మల్ని ప్రతిదానినీ ప్రశ్నించేలా చేస్తుంది. అది హత్యా లేక ఆత్మహత్యా?' అంటూ క్యాప్షన్ ఇచ్చింది.
ఈ మూవీని దేవ్‌రాజ్ భరణి ధరణ్ దర్శకత్వం వహించగా.. ఫస్ట్ కాపీ మూవీస్ బ్యానర్‌పై పి.నరేష్‌బాబు నిర్మించారు. పవర్ ఫుల్ వుమెన్ సెంట్రిక్ మూవీగా రూపొందించారు. సినిమాలో తమిళ నటుడు జాన్ విజయ్, డాక్టర్ కోయకిషోర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సత్యభామ రోల్‌లో ఆనంది తన పవర్ ఫుల్ యాక్షన్‌తో మెప్పించారు. వరలక్ష్మి శరత్ కుమార్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో తన నటనతో ఆకట్టుకున్నారు. లిమిటెడ్ బడ్జెట్, ఆర్టిస్టులతో మూవీ తెరకెక్కగా.. స్టోరీ మొత్తం సింగిల్ లొకేషన్‌లోనే సాగుతుంది. టీజర్, ట్రైలర్‌లో బోల్డ్ డైలాగ్స్ హైప్ క్రియేట్ చేయగా.. బాక్సాఫీస్ వద్ద మాత్రం మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది.
స్టోరీ ఏంటంటే?
సత్యభామ ఓ సాధారణ గృహిణి. పెళ్లైన మొదటి రాత్రే భర్తకు ప్రమాదం జరిగి మంచాన పడతాడు. భర్త ఆరోగ్యం కోసం ఆమె నానా కష్టాలు పడుతుంది. మరోవైపు ఆమెను అత్త సూటి పోటి మాటలతో ఇబ్బందులు పెడుతుంటుంది. అటు, ఆమె తల్లిదండ్రులు సైతం వరదల్లో చిక్కుకోవడంతో మరింత వేదనకు గురవుతుంది. ఆఫీస్‌లో బాస్ వేధింపులకు గురి చేయాలని యత్నించగా తెలివిగా అతన్ని తప్పించుకుంటుంది. మొదటి వివాహ వార్షికోత్సవం రోజున భర్తకు ఆపరేషన్ చేయించేందుకు ఏర్పాట్లు చేస్తుంది.
అనుకోకుండా ఓ కేసు విషయంలో సత్యభామను విచారించేందుకు వస్తారు పోలీసులు. అసలు హత్యకు గురైంది ఎవరు?, సత్యభామకు పోలీసుల విచారణకు ఏంటి సంబంధం? అన్ని కష్టాలను సత్యభామ ఎలా ఎదుర్కొంది.? పోలీస్ ఆఫీసర్ వరలక్ష్మి శరత్ కుమార్ తెలుసుకున్న నిజాలేంటి? అసలు సత్యభామ భర్తకు నయం అయ్యిందా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
వరంగల్ జిల్లాకు చెందిన ఆనంది.. 'బస్ స్టాప్' మూవీ ద్వారా టాలీవుడ్‌కు పరిచయమయ్యారు. ‘జాంబిరెడ్డి’, ‘శ్రీదేవి సోడా సెంటర్’, ‘ఇట్లు మారేడుపల్లి ప్రజానీకం’ లాంటి సినిమాలతో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. అటు, తమిళంలోనూ పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.