దక్షిణాది అగ్ర కథానాయికల్లో ఒకరైన సమంత రుతు ప్రభు.. గత ఏడాదిన్నరగా ఎన్నో ఆటు పోట్లను ఎదుర్కొంటోంది. ఇప్పుడిప్పుడే మయోసైటిస్ వ్యాధి నుంచి కోలుకుంటున్న సామ్.. ఇటీవలే తిరిగి షూటింగ్ లలో పాల్గొంటోంది. ముందుగా 'సిటాడెల్' అనే వెబ్ సిరీస్ సెట్ లో అడుగుపెట్టింది. 'ఫ్యామిలీ మ్యాన్' మేకర్స్ రాజ్ & డీకే దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సిరీస్ లో బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్ మేల్ లీడ్ రోల్ ప్లే చేస్తున్నారు. పలు యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్న సమయంలో సమంతకు గాయాలైనట్లు తెలిసింది. ఈ విషయాన్ని నేరుగా చెప్పకపోయినా.. సమంత తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో ఆ ఫొటోలను షేర్ చేసుకుంది. 


గూఢచర్యం నేపథ్యంలో సాగే ఈ థ్రిల్లర్ వెబ్ సిరీస్ లో సమంత పూర్తిగా యాక్షన్ రోల్ లో కనిపించనుంది. ఆమె ఒక స్పై గా నటిస్తున్నారని సమాచారం. దీని కోసం ఆమె చాలా హోం వర్క్ చేయడమే కాకుండా, స్టంట్స్ కోసం ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకున్నారు. తాజాగా ఆమెపై కొన్ని యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సందర్భంగా సమంతా గాయపడింది. ఆమె చేతులకు దెబ్బలు తగిలాయి.


సమంత ఇన్‌స్టా స్టోరీ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. దెబ్బలు తగిలిన తన చేతుల ఫోటోలను షేర్ చేసి అందరికీ షాక్ ఇచ్చింది. ‘‘ఇవి పోరాటానికి లభించిన గుర్తులు’’ అనేలా ఓ క్యాప్షన్ పెట్టింది. దీనిపై స్పందించిన జునాయిడ్ షేక్ అనే ఫిట్‌నెస్ ట్రైనర్ స్పందిస్తూ..  ‘‘ప్రపంచం దానిని భయానకంగా పిలుస్తుంది, మేము మాత్రం వాటిని ఆభరణాలు’’ అని పిలుస్తామని పేర్కొన్నారు. ఆ కామెంట్‌ను కూడా సమంతా మరో స్లైడ్‌లో షేర్ చేసింది. ఈ ఫొటోలో సమంత చేతులకు స్వల్ప గాయాలు.. రక్తపు మరకలతో ఉన్న దెబ్బలను చూడొచ్చు. అయితే, ఇప్పుడిప్పుడు వ్యాధి నుంచి బయటపడుతున్న సమంత మళ్లీ గాయాలకు గురికావడం అభిమానులను కలవరపరుస్తోంది. రిస్కీ యాక్షన్ సీన్స్ చేసేప్పుడు దెబ్బలు తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.


 'ది ఫ్యామిలీ మ్యాన్ 2' వెబ్ సిరీస్ తో ఓటీటీ రంగంలో అడుగుపెట్టిన సమంత.. తొలి ప్రయత్నంలోనే జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. బోల్డ్ గా కనిపించడమే కాకుండా.. యాక్షన్ సీన్స్ లోనూ అదరగొట్టింది. ఈ క్రమంలో ఇప్పుడు తన రెండవ సిరీస్ షూటింగ్ లో పాల్గొంటోంది. ఇది పాపులర్ ఇంటర్నేషనల్ సిరీస్ 'సిటాడెల్' యొక్క ఇండియన్ వెర్షన్ అని తెలుస్తోంది. అక్కడ ప్రియాంక చోప్రా పోషించిన పాత్రలో ఇక్కడ సామ్ నటిస్తున్నట్లు నివేదికలు వెల్లడించాయి. ఇందుకోసం హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ దగ్గర మార్షల్ ఆర్ట్స్ శిక్షణ తీసుకుంటోంది. అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ కోసం చేస్తున్న ఈ సిరీస్ ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే సంవత్సరం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. 


విడాకులు ప్రకటన అనంతరం సమంత తన కెరీర్ మీద ఫుల్ ఫోకస్ పెట్టింది. వరుసగా సినిమాలకు సైన్ చేస్తూ బిజీగా మారింది. అయితే అదే సమయంలో ఆమె ప్రాణాంతకమైన 'మయోసైటిస్' వ్యాధి బారిన పడటంతో అంతా తలక్రిందులైంది. కొన్ని సినిమాల షూటింగులు నిలిచిపోయాయి. చివరగా 'యశోద' అనే పాన్ ఇండియా మూవీతో పలరించిన సామ్.. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో కలిసి 'ఖుషి' సినిమా చేస్తోంది. 'శాకుంతలం' అనే మూవీ రిలీజ్ కు రెడీగా ఉంది. అలానే ఓ స్ట్రెయిట్ హిందీ సినిమాతో పాటుగా 'ది అరేంజ్మెంట్స్ ఆఫ్ లవ్' అనే హాలీవుడ్ మూవీ కూడా ఆమె చేతిలోఉన్నాయి. 




Read Also: 'మామా మశ్చీంద్ర' మూవీ వీడియో లీక్, సుధీర్ బాబు లుక్ చూసి ఆడియన్స్ షాక్!