Tiktok Ban Russia | ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రపంచ దేశాలను ఆగ్రహానికి గురిచేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ విషయంలో ఇండియా, పాకిస్థాన్, చైనాలు మాత్రం తటస్థంగా ఉన్న సంగతి తెలిసిందే. రష్యాపై ఆగ్రహంతో ఇప్పటికే కొన్ని ఐరోపా, అమెరికా దేశాలు రష్యాపై వివిధ ఆంక్షలు విధించాయి. ఆయా సంస్థల సేవలను రష్యాలో నిలిపేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నాయి. 


తాజాగా చైనాకు చెందిన బైట్‌డ్యాన్స్(ByteDance) కూడా షాకింగ్ విషయం చెప్పింది. రష్యాలో ‘టిక్ టాక్’ (TikTok) సేవలను నిలిపేస్తున్నట్లు ప్రకటించింది. బైట్‌డ్యాన్స్ చైనాలో పుట్టిన సంస్థే. కానీ, చట్టబద్దంగా బ్రిటన్‌లోని కేమాన్ దీవుల నుంచి పనిచేస్తోంది. ఈ నేపథ్యంలో చైనా వైఖరితో సంబంధం లేకుండా బైట్‌డ్యాన్స్ ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చని తెలుస్తోంది. అయితే, యుద్ధంపై వస్తున్న ఫేక్ న్యూస్, ఆందోళనకర సమాచారానికి తమ యాప్ వేదిక కాకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ సంస్థ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. 


‘‘TikTok అనేది సృజనాత్మక, వినోదం కోసమే. ఇది ఈయుద్ధ సమయంలో ఒంటరిగా ఉన్న వ్యక్తులకు ఉపశమనాన్ని, మానవ సంబంధాలను పెంపొందించగలదు. మా ఉద్యోగులు, వినియోగదారుల భద్రతకి ప్రాధాన్యమిస్తూ.. రష్యాలోని కొత్త ‘నకిలీ వార్తలు’ చట్టం ప్రకారం ఏర్పడే చిక్కులను ఇటీవల సమీక్షించాం. భవిష్యత్తులో సమస్యలు ఏర్పడకూడదనే ఉద్దేశంతో కంటెంట్‌ను నిలిపివేయడం మినహా మాకు వేరే మార్గం లేదు. రష్యాలోని పరిస్థితులను పరిశీలించిన తర్వాత మా సేవలను పూర్తిగా ఎప్పుడు పునఃప్రారంభిస్తామనేది వెల్లడిస్తాం’’ అని వెల్లడించింది. 






అదే బాటలో నెట్‌ఫ్లిక్స్: ఉక్రేయిన్‌లో రష్యా విధ్వంసాన్ని నిరసిస్తూ ఇప్పటికే ఐకియా(Ikea), డీస్నీ(Disney), వార్నర్ బ్రదర్స్ (Warner Bros), మాస్టర్ కార్డ్ (Mastercard), విసా(Visa) తదితర సంస్థలు ఇప్పటికే తమ సేవలను నిలిపేసినట్లు సమాచారం. తాజాగా ప్రముఖ ఓటీటీ సంస్థ ‘నెట్‌ఫ్లిక్స్’(Netflix) కూడా ఇదే నిర్ణయం తీసుకుంది. ఇకపై తమ ఓటీటీ సేవలు రష్యాలో అందుబాటులో ఉండవని ప్రకటించింది. అంతేగాక, రష్యాలో చేపటనున్న పలు ఫ్యూచర్ ప్రాజెక్టులు, వివిధ చిత్రాలు, వెబ్‌సీరిస్‌ల కొనుగోళ్లను సైతం నిలిపేస్తున్నట్లు వెల్లడించింది. ‘నెట్‌ఫ్లిక్స్’ ప్రభావం ఇండియాపై ఉండదు. అయితే, రష్యాకు చెందిన వెబ్‌సీరిస్‌లు, సినిమాలు ప్రసారమయ్యే అవకాశాలు లేవు. దీనిపై ఆ సంస్థ ఇంకా తగిన స్పష్టత ఇవ్వాల్సి ఉంది. 






ఇటీవల పుతిన్ రష్యాపై వస్తున్న ఫేక్ న్యూస్‌‌కు కళ్లెం వేయడానికి కొత్త చట్టాన్ని ప్రవేశపెట్టారు. ఇకపై రష్యాపై వ్యతిరేకంగా తప్పుడు కథనాలను ప్రసారం చేసే టీవీ మీడియాపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే 15 ఏళ్లు జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు. దీంతో పశ్చిమ దేశాలకు చెందిన CNN, CBC News, Boomberg, ABC News, BBC, CBC వంటి ప్రముఖ మీడియా సంస్థలు రష్యాలో తమ సేవలను రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించాయి.


Also Read: ఈ వారం థియేటర్ - ఓటీటీలో విడుదల కాబోయే సినిమాలు ఇవే