ప్రముఖ తమిళ హీరో మాధవన్ ప్రస్తుతం హిందీలో పలు సినిమాలు, వెబ్ సిరీస్ లతో బిజీబిజీగా ఉంటున్నారు. గత ఏడాది 'సైతాన్' అనే హిందీ సినిమాతో తన కెరీర్ లోనే బెస్ట్ రోల్ చేసిన మాధవన్, ఇప్పుడు తన కొత్త సినిమాతో డైరెక్ట్ గా ఓటీటీలోకి రాబోతున్నారు. భారీ ఆర్థిక కుంభకోణం నేపథ్యంలో రూపొందిన 'హిసాబ్ బరాబర్' సినిమా డిజిటల్ ప్రీమియర్ కి సిద్ధమైంది.
ఓటీటీలోకి 'హిసాబ్ బరాబర్'
మాధవన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'హిసాబా బరాబర్'. ఈ మూవీ థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలో విడుదల కానుంది. జనవరి 24 నుంచి ఈ మూవీ డిజిటల్ ప్లాట్‌ఫామ్ జీ5 లో ప్రీమియర్ కానుంది. ఈ మేరకు స్పెషల్ పోస్టర్ ద్వారా ఇప్పటికే మేకర్స్ అఫిషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు. తమిళం, తెలుగు భాషలతో పాటు హిందీలోనూ ఈ చిత్రాన్ని ఓటీటీలో చూడొచ్చు.
పోస్టర్‌ను షేర్ చేస్తూ మేకర్స్ 'ఒక సామాన్యుడు లేచి నిలబడితే, వ్యవస్థ కదిలింది. మోసగాళ్ల పట్ల జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు మాధవన్ స్కోర్‌ను సెటిల్ చేస్తాడు" అని రాశారు. అశ్వనీ ధీర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఒక పెద్ద కార్పొరేట్ బ్యాంక్ చేసిన బిలియన్ డాలర్ల ఆర్థిక కుంభకోణాన్ని వెలికితీసేందుకు ప్రయత్నించే ఒక సామాన్యుడి కష్టతరమైన ప్రయాణం ఆధారంగా ఈ సినిమా కథ రూపొందింది. ఈ చిత్రంలో ఆర్ మాధవన్ రైల్వే టిక్కెట్ ఇన్‌స్పెక్టర్ రాధే మోహన్ శర్మగా నటిస్తున్నారు.
'హిసాబా బరాబర్' మూవీ స్టోరీ ఏంటంటే... రైల్వే టిక్కెట్ ఇన్‌స్పెక్టర్ రాధే మోహన్ శర్మ (మాధవన్) తన బ్యాంక్ ఖాతాలో ఒక చిన్న మిస్టేక్ ను కనుక్కుంటాడు. మొదట ఇది చిన్న విషయంగానే అన్పిస్తుంది. కానీ తరువాత అసలు ఆ తప్పు ఎందుకు జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటాడు. అందులో జోక్యం చేసుకుని, ఇంటరాగేషన్ మొదలు పెట్టగా ఓ భారీ కుంభకోణం వెలుగులోకి వస్తుంది. చివరికి మిక్కీ మెహతా (నీల్ నితిన్ ముఖేష్) అనే శక్తివంతమైన బ్యాంకర్ ఈ భారీ ఆర్థిక కుంభకోణం వెనుక ఉన్నాడని తెలుసుకుంటాడు. ఈ వ్యవస్థాగత అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని నిర్ణయించుకుంటాడు శర్మ. మరి శర్మ ఈ కుంభకోణాన్ని ఎలా బయట పెట్టాడు? అతనికి ఈ పోరాటంలో ఎదురైన సమస్యలు ఏంటి? అనే విషయాలు తెలియాలంటే మూవీని ఓటీటీలో చూడాల్సిందే. మరోవైపు మాధవన్ 'ధురంధర్' అనే మూవీ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది.
జీ5లోకి మరో కొత్త మూవీ
సానియా మల్హోత్రా లీడ్ రోల్ చేస్తున్న 'మిసెస్' కూడా ఇదే ఓటీటీలో రిలీజ్ కానుంది. 'మిసెస్' ఎమోషన్ నిండిన డ్రామా చిత్రం. సాంప్రదాయ కుటుంబ వ్యవస్థలో స్వాతంత్ర్యం కోసం వెతుకుతున్న ఒక గృహిణి జీవితంలోని పోరాటాల స్టోరీనే ఈ చిత్రం. ఇందులో సామాజిక అంశాలతో పాటు హ్యూమన్ ఎమోషన్స్ డెప్త్ కూడా కనిపిస్తుంది. ఈ మూవీ రిలీజ్ డేట్ ను ఇంకా మేకర్స్ అనౌన్స్ చేయలేదు. ఇక సన్యా మల్హోత్రా త్వరలో 'సన్నీ సంస్కారీ కి తులసి కుమారి', 'థగ్ లైఫ్' సినిమాలలో కనిపించనుంది.