Panchayat Season 3 Trailer Is Out Now: గత కొంతకాలంగా హిందీ వెబ్ సిరీస్‌లు ఓటీటీ వరల్డ్‌లో హాట్ టాపిక్‌గా మారుతున్నాయి. ఈ మధ్య కాలంలోనే దాదాపుగా విడుదలయిన ప్రతీ హిందీ వెబ్ సిరీస్... ఓ రేంజ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. అలాంటి సిరీస్‌లో ‘పంచాయత్’ కూడా ఒకటి. ఇప్పటికే ఈ వెబ్ సిరీస్ రెండు సీజన్స్ పూర్తి చేసుకుంది. ఓటీటీ ప్రేక్షకులను అలరించింది. అందుకే ఈసారి ఎక్కువగా గ్యాప్ తీసుకోకుండా మూడో సీజన్‌ను విడుదల చేస్తున్నట్టుగా మేకర్స్ ప్రకటించారు. దాంతో పాటు ‘పంచాయత్ 3’ వెబ్ సిరీస్‌కు సంబంధించిన ట్రైలర్ కూడా విడుదల చేశారు. ఆ ట్రైలర్ చూస్తే సీజన్ 3 అంతకు మించి ఉండబోతుందని ఆశిస్తున్నారు ఫ్యాన్స్.
ట్రాన్స్‌ఫర్ క్యాన్సల్...
అభిషేక్ త్రిపాఠి (జితేంద్ర కుమార్) గ్రామ పంచాయతీ సెక్రటరీగా ట్రాన్స్‌ఫర్ ఆర్డర్ అందుకోవడంతో ‘పంచాయత్ 2’ ముగుస్తుంది. ఇక సీజన్ 2 ఎక్కడ ముగిసిందో సీజన్ 3 అక్కడే ప్రారంభమవుతుందని ట్రైలర్‌లోనే స్పష్టం చేశారు మేకర్స్. అభిషేక్ త్రిపాఠి స్థానంలోకి వచ్చిన కొత్త సెక్రటరీ ఎంట్రీతో ‘పంచాయత్ 3’ ట్రైలర్ మొదలవుతుంది. కానీ ఆ సెక్రటరీని ఫులేరా ఊరి ప్రజలు ఎవరూ పట్టించుకోరు. దీంతో అభిషేక్ ట్రాన్స్‌ఫర్ ఆర్డర్ క్యాన్సల్ అయ్యి మళ్లీ ముందు ఉన్న స్థానంలోకి రావాలని ఆర్డర్ వస్తుంది. వేరే దారి లేక తనకు ఇష్టం లేకపోయినా మళ్లీ అదే ఊరికి పంచాయతీ సెక్రటరీగా బాధ్యతలు స్వీకరిస్తాడు అభిషేక్. కానీ ఈసారి అనవసరమైన గొడవల్లో జోక్యం చేసుకోనని ముందే నిర్ణయించుకుంటాడు.
గ్రామంలో తిరుగుబాటు..
అప్పుడే ప్రధాన మంత్రి గరీబ్ అవాస్ యోజన స్కీమ్‌ను పొందడానికి ఫులేరా గ్రామంలో ఎవరు అర్హులో పంచాయతీ సెక్రటరీగా బయటపెడతాడు అభిషేక్. అందులో అర్హులు కాని కొందరు గ్రామ ప్రజలు తిరుగుబాటు మొదలుపెడతారు. రాజకీయ నాయకులు తమను పట్టించుకోవడం లేదని, ఈసారి ఎన్నికల్లో తాము కూడా నిలబడతామని నిర్ణయించుకుంటారు. అలా కథ మళ్లీ మొదటికి వస్తుంది. ‘పంచాయత్ 3’ ట్రైలర్ చూస్తుంటే ముందు రెండు సీజన్స్‌లోని ఒరిజినాలిటీని ఏ మాత్రం పక్కన పెట్టకుండా సీజన్ 3ను కూడా తెరకెక్కించారని అర్థమవుతుంది. ముందు విడుదలయిన 2 సీజన్స్‌లాగానే 3వ సీజన్‌ను కూడా దీపక్ కుమార్ మిష్రానే డైరెక్ట్ చేశారు.
జితేంద్ర కుమార్ నటనే హైలెట్..
జితేంద్ర కుమార్ లేకపోతే ‘పంచాయత్’ వెబ్ సిరీస్ లేదు అని చాలామంది ప్రేక్షకులు ప్రశంసించారు. తాజాగా విడుదలయిన సీజన్ 3 ట్రైలర్ చూసిన తర్వాత మరోసారి ఆ విషయం స్పష్టమవుతోంది. ఇందులో మరోసారి తనకు ఇష్టం లేని పంచాయతీ సెక్రటరీ పాత్రలో జితేంద్ర కుమార్ అద్భుతంగా నటించాడని అర్థమవుతోంది. ఇక ‘పంచాయత్ 3’లో జితేంద్ర కుమార్‌తో పాటు నీనా గుప్తా, రఘుబీర్ యాదవ్ కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. అమెజాన్ ప్రైమ్ ఒరిజినల్‌గా తెరకెక్కిన ‘పంచాయత్ 3’.. మే 28న ప్రైమ్ సబ్‌స్క్రైబర్ల ముందుకు రానుంది. తాజాగా విడుదలయిన ఈ సీజన్ ట్రైలర్‌కు యూట్యూబ్‌లో తెగ లైకులు వచ్చేస్తున్నాయి.
Also Read: నా వ్యక్తిత్వాన్ని రక్షించండి, కోర్టును ఆశ్రయించిన జాకీ ష్రాఫ్ - ఆ సంస్థలకు హైకోర్టు నోటీసులు