Best Thriller Movies On OTT: ఏ జోనర్ సినిమా అయినా.. ఆసక్తికరంగా తెరకెక్కించడం కొరియన్ మేకర్స్ తర్వాతే ఎవరైనా. ముఖ్యంగా కొరియన్‌లో తెరకెక్కే థ్రిల్లర్ సినిమాలు ఎన్నో భాషల్లో రీమేక్ కూడా అవుతుంటాయి. అలాంటి ఒక థ్రిల్లర్ చిత్రమే ‘ఫర్గాటెన్’ (Forgotten). ‘ఫర్గాటెన్’ చూసిన చాలావరకు ప్రేక్షకులు.. ట్విస్టుల మధ్య కథ ఉందా? కథలో ట్విస్టులు ఉన్నాయా? అనడం ఖాయం. అంతే కాకుండా కొరియన్ చిత్రాలను ఫాలో అయ్యే చాలామందికి ఈ మూవీ ఎప్పటికీ ఫేవరెట్‌గా నిలిచిపోతుంది. థ్రిల్లర్ మాత్రమే కాదు.. ఈ మూవీలో ఎమోషనల్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి.


కథ..


‘ఫర్గాటెన్’ కథ విషయానికొస్తే.. ఒక కారులో సినిమా మొదలవుతుంది. జిన్ సోక్ (కాంగ్ హా న్యుల్).. తన అమ్మ, నాన్న, అన్నయ్యతో కారులో ప్రయాణిస్తూ ఉంటాడు. అదే సమయంలో తనకు పీడకల రావడంతో ఉలిక్కిపడి లేస్తాడు. ఈ కుటుంబం అంతా ఒక కొత్త ఇంటికి షిఫ్ట్ అవ్వడానికి వెళ్తుంటారు. జిన్ అన్న అయిన యో సూక్ (కిమ్ మ్యు యోల్)కు కొన్నాళ్ల క్రితమే యాక్సిడెంట్ అవ్వడంతో తను సరిగా నడవలేకపోతుంటాడు. జిన్ సోక్ కుటుంబమంతా ఆ కొత్త ఇంట్లో సెటిల్ అయిపోతారు. కానీ జిన్ సోక్‌కు మొత్తం ఆ ఇంట్లో వింత వింత శబ్దాలు వినిపించడంతో పాటు పీడకలలు కూడా వస్తుంటాయి. దీంతో ఒక రాత్రి యో సూక్.. తన తమ్ముడిని అలా బయటికి తీసుకెళ్తాడు. అదే సమయంలో యో సూక్‌ను కొందరు కిడ్నాప్ చేస్తారు.


జిన్ సోక్.. పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చి తన అన్నయ్యను ఎవరో కిడ్నాప్ చేసిన విషయం తల్లిదండ్రులకు చెప్తాడు. ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేయడానికి ఇద్దరు డిటెక్టివ్స్ వస్తారు. కానీ వారికి ఏ ఆధారాలు దొరకవు. 19 రోజుల తర్వాత యో సూక్.. తానే స్వయంగా ఇంటికి వచ్చేస్తాడు. కిడ్నాపర్ల దగ్గర నుండి తప్పించుకొని వచ్చానని డిటెక్టివ్స్‌కు చెప్తాడు. కానీ అలా తిరిగొచ్చిన అన్నయ్యలో జిన్ సోక్.. కొన్ని మార్పులు గమనిస్తాడు. అదే విషయాన్ని తన తల్లికి వెళ్లి చెప్తాడు. కానీ తన తల్లి కూడా అన్నయ్యలాగా వింతగా ప్రవర్తించడాన్ని జిన్ సోక్ గమనిస్తాడు. దీంతో ఆ ఇంట్లో నుండి వెంటనే తప్పించుకోవాలని పారిపోతుంటే ఒక పోలీస్ కారుకు ఎదురుగా పడిపోతాడు. పోలీసులు అతడిని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి విచారణ మొదలుపెడతారు. అక్కడే ప్రేక్షకులు ఊహించని ట్విస్టులు బయటపడతాయి.


జిన్ సోక్.. తన వయసు 20 ఏళ్లు అని, తాము 1997లో ఉన్నామని చెప్తాడు. అది విని ఆశ్చర్యపోయిన పోలీసులు.. జిన్ సోక్ వయసు 40 ఏళ్లు అని, అది 2017 సంవత్సరమని క్లారిటీ ఇస్తారు. దీంతో జిన్ సోక్‌కు ఒక్కసారిగా ఏం అర్థం కాదు. ఫ్లాష్‌బ్లాక్‌లోకి వెళ్తే.. 20 ఏళ్ల క్రితం జిన్ సోక్.. 2 హత్యలు చేస్తాడు. ఆ హత్యలు జిన్ సోక్ చేశాడని పోలీసులకు తెలిసినా అప్పటికే ఒక సంఘటన వల్ల తన గతాన్ని మర్చిపోవడంతో జిన్ సోక్‌ను పోలీసులు అరెస్ట్ చేయలేకపోతారు. అందుకే తన జీవితంలో గుర్తున్న విషయాలను రీక్రియేట్ చేయగలిగితే తాను హత్యలు ఎందుకు చేశాడో గుర్తొస్తుందేమో అన్న ఆలోచనతో తనకు ఒక నకిలీ అమ్మ, నాన్న, అన్నయ్య పాత్రలను క్రియేట్ చేస్తారు. ఇదంతా తెలిసిన జిన్ సోక్ ఏం చేస్తాడు? తనకు గతం గుర్తొస్తుందా? అసలు ఆ హత్యలు ఎందుకు చేశాడు? అన్నది తెరపై చూడాల్సిన కథ.



అదొక్కటే మైనస్..


కొరియన్ మేకర్స్.. థ్రిల్లర్ సినిమాలు తెరకెక్కించడంలో ఏ స్థాయికి చేరుకున్నారో ‘ఫర్గాటెన్’ మరోసారి నిరూపించింది. ముఖ్యంగా ఈ సినిమాలో మేజర్ హైలెట్‌గా నిలిచింది దర్శకుడు జంగ్ హంగ్ యున్ టేకింగ్. కానీ ఈ సినిమాలో కూడా ఒక మైనస్ ఉంది. ‘ఫర్గాటెన్’ ఫస్ట్ హాఫ్ అంతా మామూలుగా సాగిపోయినా.. సెకండ్ హాఫ్‌కు వచ్చేసరికి ఎక్కువగా ట్విస్టులతో నిండిపోవడం వల్ల ప్రేక్షకులు కన్‌ఫ్యూజ్ అయ్యే ఛాన్సులు ఎక్కువగా ఉన్నాయి. ఒక ఫ్యామిలీ కథగా మొదలయిన ఈ సినిమా.. మెల్లగా థ్రిల్లర్‌గా మారుతుంది. ఇక క్లైమాక్స్‌కు వచ్చేసరికి మొదలయిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడంతో పాటు మంచి ఎమోషనల్ నోట్‌పై సినిమాను ముగించాడు దర్శకుడు. థ్రిల్లర్‌తో పాటు ఎమెషనల్ కంటెంట్ కావాలి అనుకునే ప్రేక్షకులు.. నెట్‌ఫ్లిక్స్‌లో ఉన్న ‘ఫర్గాటెన్’ను చూసేయవచ్చు.



Also Read: కూతురిని చంపాలనుకునే తల్లి కథ, మాస్క్ వేసుకొని మరీ వెంటాడుతుంది - అసలు ఇలా ఎవరైనా ఉంటారా?