Breathe OTT Streaming: నందమూరి చైతన్యకృష్ణ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘బ్రీత్‌’. 'వైద్యో నారాయణో హరి' అనేది దీనికి ట్యాగ్ లైన్. వంశీ కృష్ణ ఆకెళ్ళ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో వైదిక సెంజిలియా హీరోయిన్ గా నటించింది. గతేడాది డిసెంబర్‌ 2న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులని తీవ్ర నిరాశ పరిచింది. జీరో క‌లెక్ష‌న్స్‌తో డిజాస్ట‌ర్ కా బాప్‌ అనిపించుకుంది. బాక్సాఫీస్ బోల్తా కొట్టిన ఈ సినిమా, ఇప్పుడు డిజిటల్ వేదిక మీదకి రాబోతోంది. తాజాగా ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ కు సంబంధించిన అఫిషియల్ అనౌన్స్ మెంట్ వచ్చింది.


బ్లాక్ బస్టర్ సినిమాలే థియేటర్లలో విడుదలైన మూడు నాలుగు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తున్న రోజుల్లో.. బాక్సాఫీసు దగ్గర దారుణమైన ఫలితాన్ని అందుకున్న 'బ్రీత్' మూవీ ఇంకా త్వరగా డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ లోకి వచ్చేస్తుందని అందరూ అనుకున్నారు. కానీ మూడు నెలలు దాటిపోయినా ఇంతవరకు ఈ సినిమా ఓటీటీలో అందుబాటులోకి రాలేదు. అయితే ఎట్టకేలకు థియేట్రికల్ రిలీజైన 100 రోజుల తర్వాత ఈ మూవీ వరల్డ్ డిజిటల్ ప్రీమియర్ గా రాబోతోంది. తెలుగు ఓటీటీ ఆహా వేదికగా స్ట్రీమింగ్ కు రెడీ అయింది. 


ఇంటెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన 'బ్రీత్' చిత్రాన్ని మార్చి 8వ తేదీ నుంచి అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు ఆహా ఓటీటీ ప్రకటించింది. ఈ సందర్భంగా సినిమాలోని నందమూరి చైతన్య కృష్ణ పోస్టర్ ను సోషల్ మీడియాలో పంచుకున్నారు. మహా శివరాత్రి స్పెషల్ గా డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్ధమైన ఈ సినిమాకి స్మాల్ స్క్రీన్ మీద ఎలాంటి ఆదరణ లభిస్తుందో చూడాలి.






నందమూరి ఫ్యామిలీ మూడో తరం నట వారసుల్లో చైత‌న్య కృష్ణ ఒకరు. విశ్వ విఖ్యాత నటసార్వభౌమా ఎన్టీఆర్ మనవడిగా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన చైతన్య.. 2003లో ‘ధమ్‌’ చిత్రంలో కీలక పాత్రలో నటించారు. 20 ఏళ్ల తర్వాత ఇప్పుడు ‘బ్రీత్‌’ మూవీతో హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. బసవతారక రామ క్రియేషన్స్ బ్యానర్ పై చైత‌న్య కృష్ణ తండ్రి నందమూరి జయకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించారు. మార్క్ కె రాబిన్ సంగీతం సమకూర్చారు. రాకేష్ హోసమని సినిమాటోగ్రఫీ, బి. నాగేశ్వర రెడ్డి ఎడిటింగ్ వర్క్ చేశారు.
 
‘బ్రీత్‌’ కథేంటంటే..
రాష్ట్ర ముఖ్యమంత్రి కొన్ని అనారోగ్య కారణాల వల్ల ఆసుపత్రిలో అడ్మిట్ అవుతారు. ఆయన్ని చంపడానికి కొందరు వ్యక్తులు ప్రయత్నిస్తుండగా.. ఒక సామాన్య యువకుడు ఆయన ప్రాణాలను కాపాడతాడు. సీఏంను చంపడానికి ప్లాన్ చేసింది ఎవరు? ఆయన్ని ఎందుకు హత్య చేయాలని అనుకుంటున్నారు? ముఖ్యమంత్రికి ప్రాణాలు కాపాడిన వ్యక్తికి మధ్య ఉన్న సంబంధం ఏంటి? అనేది ‘బ్రీత్‌’ మిగతా కథ. 


నందమూరి బాలకృష్ణ, కల్యాణ్ రామ్ 'బ్రీత్' మూవీ ప్రమోషన్స్ లో పాల్గొని, తమ వంతుగా చైతన్య కృష్ణకు సపోర్ట్ అందించారు. అయితే ఇవేవీ సినిమా విజయానికి దోహదం చెయ్యలేదు. ఆన్ లైన్ టికెట్ బుకింగ్స్ యాప్ ద్వారా ఈ మెడికో థ్రిల్ల‌ర్‌ కి ఒక్కటంటే ఒక్క టికెట్ కూడా అమ్ముడుపోని సినిమాగా చెత్త రికార్డును మూట‌గ‌ట్టుకున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. దాదాపు నాలుగు కోట్ల బ‌డ్జెట్‌తో ఈ మూవీ తీసినట్లు ప్రచారం జరిగింది.


Also Read: క్రాక్స్ వేసుకొని మిడిల్ క్లాస్ ఏంటి? - నెటిజన్ ప్రశ్నకు విజయ్ దేవరకొండ ఆన్సర్ ఇదే!