My Dear Donga Teaser: ‘ఈ నగరానికి ఏమైంది’ 'మ‌ళ్లీరావా' లాంటి సినిమాతో కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న అభినవ్ గోమఠం.. హాస్య నటుడిగా టాలీవుడ్ లో త‌న‌కంటూ ఓ మార్క్ క్రియేట్ చేసుకున్నారు. 'సేవ్ ది టైగర్స్' వెబ్ సిరీస్ తో ఓటీటీలోనూ సత్తా చాటాడు. ఈ క్రమంలో ఇటీవల 'మ‌స్తు షేడ్స్ ఉన్నాయ్ రా' సినిమాతో పూర్తిస్థాయి హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఫిబ్రవరి 23న రిలీజైన ఈ చిత్రం ఫర్వాలేదనిపించుకుంది. ఓ మోస్తరు వసూళ్లు రాబట్టగలిగింది. అయితే అభినవ్ హీరోగా వచ్చి పది రోజులు కూడా గడవకముందే, మనోడు 'మై డియర్ దొంగ' అంటూ ఆడియన్స్ ను అలరించడానికి రెడీ అయ్యారు. 


అభిన‌వ్ గోమటం, శాలిని కొండెపూడి హీరోహీరోయిన్లుగా న‌టిస్తున్న లేటెస్ట్ మూవీ 'మై డియ‌ర్ దొంగ'. స‌ర్వ‌జ్ఞ కుమార్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఆహా ఓటీటీ కోసం రూపొందించిన ఈ రొమాంటిక్ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్ ఫస్ట్ లుక్ ఇటీవలే రిలీజయింది. 'అడ‌వి దొంగ విన్నారు. ట‌క్క‌రి దొంగ విన్నారు. జేబు దొంగ విన్నారు. కానీ మై డియ‌ర్ దొంగ ఎవ‌రో తెలియాలంటే త్వ‌ర‌లో ఆహా ఓటీటీలో చూడాల్సిందే' అంటూ వచ్చిన ఈ పోస్ట‌ర్ సినిమాపై ఆసక్తిని కలిగింది. ఈ నేపథ్యంలో మేకర్స్ తాజాగా రిలీజ్ చేసిన ఈ మూవీ టీజర్ చాలా ఎంటర్టైనింగ్ గా ఉంది.


అభినవ్ ను ఒక దొంగగా పరిచయం చేయడంతో 'మై డియ‌ర్ దొంగ' సినిమా టీజర్ ప్రారంభం అవుతుంది. అతను దొంగతనంగా హీరోయిన్ షాలిని ఇంట్లోకి ప్రవేశించగా.. ఆమె హెల్ప్ కోసం దొంగా దొంగా అని గట్టిగా అరుస్తుంది. అయితే దొంగ అనే మాట అంటేనే తనకు చిరాకు అని అభినవ్ అంటుండగా.. 'దొంగని దొంగ అనక, సందీప్ రెడ్డి వంగా అనాలా?' అని షాలిని అనడం నవ్వు తెప్పిస్తుంది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, తనకు డబ్బు వద్దని ఫ్రెండ్ షిప్ కావాలని హీరో చెబుతాడు. ఈ క్రమంలో ఆమె అతన్ని తన ఫ్రెండ్స్ కి ఇంట్రడ్యూస్ చెయ్యడం, అభినవ్ వాళ్ళ దగ్గర గుడ్ ఇంప్రెషన్ కొట్టేయడం.. పోలీసులు చేజ్ చేయడం చూసి అతను ఉలిక్కి పడటం వంటి సీన్స్ ఫన్నీగా ఉన్నాయి.


'దొంగగా మారడానికి ఒక బలమైన కారణం ఉంది' అని అభినవ్ చెప్పగా.. ''మీ అమ్మకి క్యాన్సర్. మీ నాన్న గుడ్డోడు. మీ చెల్లికి పెళ్లి చెయ్యాలి అంతేనా?'' అని షాలిని అడుగుతుంది. దానికి వెంటనే ''లేదు..  మా నాన్నకి క్యాన్సర్. మా చెల్లి గుడ్డిది. మా అమ్మకి పెళ్లి చెయ్యాలి'' అని అతను సీరియస్ టోన్ లో రివర్స్ గా చెప్పడం నవ్వులు పూయిస్తుంది. ఇక చివర్లో 'దొంగా.. కింగా.. రూపు చూసి మోసపోతరయ్యో..' అంటూ వచ్చే నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. 



ఓవరాల్ గా కథేంటనేది ఈ వీడియోలో పెద్దగా రిలీజ్ చెయ్యనప్పటికీ.. 'మై డియ‌ర్ దొంగ' కథంతా దాదాపు ఒక ఇంట్లో, ఒకే రాత్రిలో జరుగుతుందని తెలుస్తోంది. అంతేకాదు దీంట్లో ఏదో కంఫ్యూజింగ్ లవ్ స్టోరీ కూడా ఉన్నట్లు హింట్ ఇచ్చారు. శాలిని కొండెపూడి హీరోయిన్‌గా న‌టిస్తూనే ఈ సినిమాకు రైట‌ర్‌గానూ వ్య‌వ‌హ‌రించడం విశేషం. అన్న‌పూర్ణ స్టూడియోస్ సంస్థ సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని మ‌హేశ్వ‌ర్ రెడ్డి నిర్మించారు. దీనికి అజ‌య్ అర‌సాడా మ్యూజిక్ కంపోజ్ చేసారు. ఈ చిత్రం నేరుగా ఆహా ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. మేకర్స్ త్వరలోనే రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయనున్నారు.


Also Read: ఒకేసారి నాలుగు క్రేజీ చిత్రాలు, ఈసారి విజయ దశమికి దబిడి దిబిడే!