Vijay Deverakonda: సెన్సేషనల్ స్టార్ విజయ్‌ దేవరకొండ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'ఫ్యామిలీ స్టార్‌'. పరశురామ్‌ పెట్లా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మృణాల్‌ ఠాకూర్‌ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే రిలీజైన ప్రమోషనల్ కంటెంట్ కు ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలో నిన్న సోమవారం సాయంత్రం టీజర్ ను లాంచ్ చేసారు. ఇందులో రౌడీ బాయ్ ని ఒక మిడిల్ క్లాస్ అబ్బాయిగా చూపించారు. అయితే మన వీడీ టీజర్ లో ప్రీమియం బ్రాండ్ చెప్పులు వేసుకొని కనిపించడంపై కొందరు నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. 


'ఫ్యామిలీ స్టార్‌' టీజర్ లో విజయ్ దేవరకొండ కొన్ని సన్నివేశాల్లో తన కాళ్ళకు క్రాక్స్ బ్రాండెడ్ ఫ్లిప్ ఫ్లాప్స్ వేసుకొని ఉన్నాడు. క్రాక్స్ ఎలాంటి ఫుట్ వేర్ బ్రాండ్ అనేది నేటి యూత్ కి పరిచయం చేయాల్సిన పనిలేదు. ఈ కంపెనీలో నార్మల్ గా రూ. 1500 - 7000 రేంజ్ లో ఫ్లిప్ ఫ్లాప్స్ దొరుకుతాయి. మహేశ్ బాబు, రామ్ పోతినేని లాంటి సెలబ్రిటీలు సైతం తమ ఇళ్లల్లో ఇదే బ్రాండ్ స్లిప్పర్స్ తో తిరుగుతూ కనిపిస్తారు. ఇప్పుడు విజయ్ సైతం తన కొత్త సినిమాలో అలాంటి క్రాక్స్ తొడుక్కునే కనిపించారు. వీటి ధర 2 వేల రూపాయలకుపైగానే ఉంటుంది. 


అయితే సినిమాలో హీరోని మిడిల్ క్లాస్ అబ్బాయిగా పరిచయం చేస్తూ, ప్రీమియం బ్రాండ్ స్లిప్పర్స్ వేసుకోవడంపై ఓ నెటిజన్ ట్వీట్ చేస్తూ.. "క్రాక్స్ వేసుకొని మిడిల్ క్లాస్ అంట. సూపర్ అన్నా" అని వ్యగ్యంగా కామెంట్ చేసాడు. దీనికి విజయ్ దేవరకొండ స్పందించారు. "సేల్ లో కొన్నాను. 70% ఆఫర్ లో" అని తనదైన శైలిలో సమాధానమిచ్చారు. ఈ ట్వీట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. దీనికి నెటిజన్ల నుంచి వీడీకి మద్దతు లభిస్తోంది. మిడిల్ క్లాస్ వాళ్ళు 2 వేల రూపాయలు పెట్టి చెప్పులు కొనుక్కోకూడదా? అని ఒకరు కామెంట్ చేస్తే.. ఈరోజుల్లో క్రాక్స్ ధరిస్తే డబ్బున్న వాడని అనుకోవడం పొరపాటు అని ఇంకొకరు వ్యాఖ్యానించారు. హీరోని మిడిల్ క్లాస్ మ్యాన్ గా ప్రెజెంట్ చేయడానికి పాత సినిమాల్లో మాదిరిగా పారాగాన్ స్లిప్పర్స్ తో చూపించాలా ఏంటి? అని మరికొందరు ప్రశ్నిస్తున్నారు.






ఇక 'ఫ్యామిలీ స్టార్' టీజర్ విషయానికొస్తే.. ఓ క్యాచీ సాంగ్ తో విజయ్ దేవరకొండ క్యారెక్టర్ ను వివరించారు. కలియుగ రాముడిగా అభివర్ణిస్తూనే, ఫ్యామిలీ విషయంలో వీక్ అంటూ చెప్పుకొచ్చారు. ''దేఖోరే డేఖోరే దేఖో.. కలియుగ రాముడు అచ్చిండు కాకో.. ఫ్యామిలీ విషయంలో వీడు కొంచెం వీకో.. ధర్మానికే కొత్త దర్వాజారా వీడు.. వీడి వాళ్ల జోలికే రాకుండా దాక్కో.. మడతపెట్టి కొడితే ముడుసులు బ్రేకో.. తెలుసుకో'' అంటూ ఓ పాట రూపంలో ఈ టీజర్‌ ను ఆవిష్కరించారు. చివర్లో ''నేను కాలేజీకి వెళ్లాలి.. కొంచెం దించేస్తారా'' అని మృణాల్‌ అడగ్గా.. ''ఓ లీటర్‌ పెట్రోల్‌ కొట్టిస్తే దించేస్తా'' అంటూ విజయ్‌ బదులివ్వడం నవ్వు తెప్పిస్తుంది.
 
'గీత గోవిందం' తర్వాత విజయ్ దేవరకొండ, పరశురామ్ కాంబోలో రాబోతున్న 'ఫ్యామిలీ స్టార్' సినిమాపై అందరిలో మంచి అంచనాలే ఉన్నాయి. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో దిల్ రాజు, శిరీష్, వాసు వర్మ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. గోపీ సుందర్ ఈ సినిమాకు సంగీతం సమకూర్చగా.. కేయూ మోహనన్ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. ఏఎస్ ప్రకాశ్ ఆర్ట్ డైరెక్టర్ గా, మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్ గా వర్క్ చేస్తున్నారు. ఈ మూవీని సమ్మర్ స్పెషల్ గా ఏప్రిల్ 5న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు.


Also Read: దొంగని దొంగ అనక, సందీప్ రెడ్డి వంగా అనాలా? - ‘మై డియర్ దొంగ’ టీజర్ చూశారా?