Naa Saami Ranga OTT Release: 2024 సంక్రాంతికి ఎన్నో సినిమాలు విడుదల అవ్వగా.. అందులో కింగ్ నాగార్జున నటించిన ‘నా సామిరంగ’ కూడా ఒకటి. మామూలుగా సీనియర్ హీరో నాగార్జునకు సంక్రాంతి అంటే సెంటిమెంట్ ఉంది. సంక్రాంతి పండగకు విడుదలయ్యే తన సినిమా కచ్చితంగా హిట్ అవుతుందని నాగ్ ఫిక్స్ అయ్యారు. అందుకే మూడు సినిమాలు పోటీ ఉన్నా.. ‘నా సామిరంగ’ను కూడా విడుదల చేయడానికి సిద్ధమయ్యారు. థియేటర్లలో ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకున్న నాగ్.. ఇప్పుడు ఓటీటీలోకి రావడానికి సిద్ధమయ్యారు. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుందని ఈ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ అప్డేట్ ఇచ్చింది.


క్లారిటీ లేదు..


ముందుగా నాగార్జున మొహాన్ని చూపించకుండా ‘నా సామిరంగ’లోని ఒక ఫైట్ సీన్‌ను అప్లోడ్ చేసి.. ఎవరో గెస్ చేయండి అంటూ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ పోస్ట్ చేసింది. ఆ తర్వాత కొన్ని గంటలకే ‘కింగ్ వచ్చేస్తున్నాడు’ అంటూ ‘నా సామిరంగ’ స్ట్రీమింగ్‌పై క్లారిటీ ఇచ్చింది. విజయ్ బిన్నీ దర్శకత్వం వహించిన ఈ మూవీ జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అందుకే థియేటర్లలో విడుదలయిన సరిగ్గా నెలరోజుల తర్వాత అంటే ఫిబ్రవరీ 15న ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ ప్రారంభించుకుంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతుందని క్లారిటీ వచ్చినా.. స్ట్రీమింగ్ డేట్‌పై మాత్రం క్లారిటీ లేదు.






మరోసారి ప్రూవ్ అయ్యింది..


‘నా సామిరంగ’లో నాగార్జునకు జోడీగా అషికా రంగనాథ్ నటించింది. అల్లరి నరేశ్‌, రాజ్‌తరుణ్‌ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించారు. ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందించారు. ఇక గత కొంతకాలంగా సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్న నాగార్జునకు సంక్రాంతి సెంటిమెంట్ కలిసి వచ్చింది. ‘నా సామిరంగ' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. మామూలుగా ఏ సంక్రాంతికి అయినా నాగార్జున సినిమా విడుదల అయ్యిందంటే పక్కా సక్సెస్ అవుతుందనే టాక్ ఉంది. ఆ సెంటిమెంట్ ఈ సినిమాతో మరోసారి ‘నా సామిరంగ’తో ప్రూవ్ అయ్యింది. మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఎక్కువగా మాట్లాడానని, సక్సెస్ మీట్‌లోనే మాట్లాడతానని ఈ మూవీ హిట్‌పై ముందు నుండే ధీమా వ్యక్తం చేశారు నాగ్.


అక్కినేని ఫ్యాన్స్ హ్యాపీ..


‘నా సామిరంగ’లో నాగార్జున గెటప్ చూసి ‘దసరా బుల్లోడు’లో తన తండ్రిని గుర్తుచేసుకున్నారు అక్కినేని ఫ్యాన్స్. మామూలుగా సంక్రాంతికి ఫ్యామిలీ ఆడియన్స్ అంతా కలిసి సినిమాలకు వెళ్లడానికి ఆసక్తి చూపిస్తారు. ‘నా సామిరంగ’.. అలాంటి ఆడియన్స్‌ను బాగా ఆకట్టుకుంది. అందుకే విడుదలయిన వారం రోజుల్లోనే ఈ మూవీ బ్రేక్ ఈవెన్‌ను సాధించింది. ఒక మలయాళ మూవీకి రీమేక్‌గా తెరకెక్కిన ‘నా సామిరంగ’ను తెలుగులో దర్శకుడిగా బాగా హ్యాండిల్ చేశాడని విజయ్ బిన్నీపై ప్రశంసలు కురిపించారు ప్రేక్షకులు. టాలీవుడ్‌లో ఎన్నో ఏళ్లుగా సక్సెస్‌ఫుల్‌ కొరియోగ్రాఫర్‌గా కొనసాగుతున్న విజయ్ బిన్నీ.. ‘నా సామిరంగ’తో మొదటిసారి దర్శకుడిగా మారాడు.


Also Read: పెళ్లి పేరుతో టాలీవుడ్‌ మహిళా నిర్మాత మోసం - పోలీసులను ఆశ్రయించిన కెమెరామెన్‌