Mirzapur Season 3: ప్రేక్షకులను ఓ రేంజిలో ఆకట్టుకున్న క్రైమ్ యాక్షన్ వెబ్ సిరీస్ ‘మీర్జాపూర్‌’. అమెజాన్ ప్రైమ్ ఓటీటీ వేగికగా ఇప్పటి వరకు విడుదలైన రెండు సీజన్లను యువతను ఓ రేంజిలో ఆకట్టుకున్నాయి. ఈ సిరీస్ లోని నటీనటుల అసలు పేర్ల కంటే క్యారెక్టర్ల పేర్లే అభిమానుల మదిలో నిలిచిపోయాయి. త్వరలో మూడో సీజన్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ ఈ సిరీస్ పై భారీగా అంచనాలు పెంచాయి. మూడో సీజన్ లో రెండు సీజన్లకు మించి రక్తపాతం చెలరేగే అవకాశం కనిపిస్తోంది. జులై 5 నుంచి అమెజాన్ ప్రైమ్ వేదికగా ‘మీర్జాపూర్’ సీజన్ 3 స్ట్రీమింగ్ కు రెడీ అవుతోంది. జులై 4 అర్థరాత్రి తర్వాతి నుంచే హిందీతోపాటు తెలుగు ఇతర భాషల్లో ఈ సీరిస్ స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం.


‘మీర్జాపూర్’ కథ ఏంటంటే?


‘మీర్జాపూర్’ తొలి సీజన్ లో అఖండానంద అలియాస్ కాలీన్ భయ్యా(పంకజ్ త్రిపాఠి)ను మాఫియా సామ్రాజ్యానికి అధినేతగా చూపిస్తారు. ఓ పెళ్లిలో కాలీన్ భయ్యా కొడుకు మున్నా(దివ్యేందు) గన్ పేల్చడంతో పెళ్లికొడుకు చనిపోతాడు. ఆ పెళ్లి కొడుకు కుటుంబం న్యాయవాది రమాకాంత్ పండిత్ (రాజేష్ తలాంగ్) దగ్గరికి వెళ్లి తమ కేసు వాదించాలని కోరుతారు. ఆ లాయర్‌కు ముగ్గురు పిల్లలుంటారు. బబ్లూ పండిత్‌ (విక్రాంత్‌ మస్సే), గుడ్డు పండిత్‌ (అలీ ఫజల్‌), కూతురు డింపీ (హర్షిత). కొడుకు మున్నా చేసిన చెత్తపని పట్ల కోపంతో ఊగిపోయిన కాలీన్ భయ్యా, తన కొడుకును కాదని, మాఫియా సామ్రాజ్యం పనులను రమాకాంత్ పిల్లలకు అప్పగిస్తారు. మున్నా కోపంతో ఊగిపోతాడు. పైగా డింపీ ఫ్రెండ్ స్వీటీని గుడ్డూ లవ్ చేస్తాడు. స్వీటీని ఎలాగైనా పొందాలని మున్నా ప్రయత్నిస్తాడు.అంతేకాదు, గుడ్డూను చంపేయాలనుకుంటాడు. ఓ పెళ్లికి వెళ్లిన గుడ్డు, గోలు(శ్వేతా త్రిపాఠి), స్వీటీ, బబ్లూ, డింపీపై మున్నా గ్యాంగ్ అటాక్ చేస్తుంది. ఈ గొడవలో స్వీటీతో పాటు బబ్లూ చనిపోతారు. గుడ్డును చంపాలని ప్రయత్నించినా గోలుతో కలిసి ఎస్కేప్ అవుతాడు. అటు జనాల్లో తన పట్ల భయం పెరగాలని కాలీన్‌ భయ్యా ఓ పోలీస్ ఆఫీసర్ ను చంపేస్తాడు. దీంతో సీజన్ 1 అయిపోతుంది.


ఇక రెండో సీజన్ లో మున్నా దాడిలో గాయపడ్డ గుడ్డు, గోలు ఓ డాక్టర్ ను అపహరించి అతడితో వైద్యం చేయించుకుంటారు. మున్నాపై రివర్స్ అటాక్ చేయాలని ప్లాన్ చేస్తారు. మరోవైపు గోలు గన్ ఫైరింగ్ నేర్చుకుంటుంది. అటు తన తండ్రి కాలీన్ భయ్యాను మోసం చేసేందుకు శరద్ శుక్లాతో చేతులు కలుపుతాడు మున్నా. అదే సమయంలో  యూపీ సీఎం బిడ్డ మాధురి(ఇషా తల్వార్‌)ని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. మీర్జాపూర్‌ సింహాసనాన్ని ఎక్కేందుకు తండ్రి కాలీన్‌ ను చంపాలని మున్నా ప్లాన్ చేస్తాడు. మరోవైపు మున్నాపై గుడ్డు దాడి చేసి చంపేస్తాడు. తన తమ్ముడు బబ్లూ, ప్రియురాలు స్వీటీ చావులకు రివేంజ్ తీర్చుకుంటాడు. మీర్జాపూర్ సింహాసనంపై కూర్చుంటాడు.


మూడో సీజన్ లో మరింత రక్తపాతం


ఇక మూడో సీజన్‌లో పూర్వాంచల్‌ లో చీమ చిటుక్కుమన్నా తనకు తెలియాలని భావిస్తాడు గుడ్డు. తన సామ్రాజ్యంలో కాలీన్‌ భయ్యా గుర్తులు లేకుండా చేయాలనుకుంటాడు. మరోవైపు మున్నా చావుతో ఆయన భార్య మాధురి రాజకీయాల్లో అడుగు పెడుతుంది. కాలీన్‌ భయ్యాపై సానుభూతి పెంచి ప్రజలకు దగ్గర కావాలి అనుకుంటుంది. అటు కాలీన్ భయ్యా మళ్లీ మీర్జాపూర్ మీద తన పెత్తనాన్ని చెలాయించేదుకు ప్రయత్నిస్తాడు. “మీర్జాపూర్ సింహాసనాన్ని నేను, నా తండ్రి కలిసి నిర్మించాం. ఇప్పటి వరకూ పూర్వాంచల్‌లో జరగనిది చేయాల్సిన సమయం వచ్చింది” అంటూ కాలీన్ భయ్యా చెప్పే డైలాగ్ వచ్చే సీజన్ పై భారీగా అంచనాలను పెంచుతోంది. ఈ సిరీస్‌ను గుర్మీత్‌సింగ్‌, మిహిర్ దేశాయ్ తెరకెక్కించారు. ఎక్సెల్ ఎంటర్‌టైన్‍మెంట్ బ్యానర్ ఈ సిరీస్‌ను నిర్మించింది. జులై 5న పలు భాషల్లో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.



Read Also: ‘మీర్జాపూర్‌’ సీజన్‌ 3 ట్రైలర్‌: గుడ్డూను టార్గెట్ చేసిన ఖాలీన్ భయ్యా - ఇక సింహాసనం కోసం పోరు!