సేమ్ జానర్, ఒకే తరహా కథలకు పరిమితం కాకుండా వెర్సటైల్ ఫిల్మ్ మేకర్ అని పేరు తెచ్చుకున్న దర్శక నిర్మాత మహి వి రాఘవ్ (Mahi V Raghav). 'పాఠశాల', 'ఆనందో బ్రహ్మ', 'యాత్ర', 'యాత్ర 2' సినిమాలతో ఆయన వెండితెరపై సక్సెస్ అందుకున్నారు. డిజిటల్ తెరపై (ఓటీటీలో) అంతకు మించి భారీ విజయాలు అందిస్తున్నారు. మహి వి రాఘవ్ రూపొందించిన లేటెస్ట్ వెబ్ సిరీస్ 'సేవ్ ది టైగర్స్ 2' బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. ప్రస్తుతం ఈ వెబ్ షో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.


టాప్ 1లో ట్రెండ్ అవుతున్న 'సేవ్ ది టైగర్స్ 2'
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీ యాప్ ఓపెన్ చేశారా? ఈ రోజు ఇండియా వైడ్ ట్రెండ్ అవుతున్న టాప్ 10 తెలుగు షోస్ / సినిమాల లిస్ట్ చూడండి. అందులో 'సేవ్ ది టైగర్స్ 2' సీజన్ 2 ఫస్ట్ ప్లేసులో ఉంటుంది. తొలి వారంలోనే వ్యూయర్ షిప్ పరంగా ఈ సిరీస్ రికార్డ్స్ క్రియేట్ చేసింది. దీంతో మహి వి రాఘవ్ ఓటీటీలో హ్యాట్రిక్ అందుకున్నారు.


'సేవ్ ది టైగర్స్' వెబ్ సిరీస్ (Save The Tigers Web Series)తో ఓటీటీలో మహి వి రాఘవ్ ప్రయాణం ప్రారంభమైంది. అది బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఓటీటీకి అడల్ట్ కంటెంట్ అవసరం అని, ఆ తరహా సీన్లు ఉంటేనే జనాలు చూస్తారనే అపోహను చెరిపేసిన వెబ్ సిరీస్ అది. 'సేవ్ ది టైగర్స్' తర్వాత మరో వెబ్ సిరీస్ 'సైతాన్'తోనూ మహి వి రాఘవ్ హిట్ అందుకున్నారు. ఇప్పుడు 'సేవ్ ది టైగర్స్ 2'తో మరో భారీ విజయం సాధించారు. తెలుగు ఓటీటీలో హ్యాట్రిక్ హిట్స్ అందుకున్న తొలి దర్శకుడు, జాతీయ వీక్షకులను సైతం ఆకట్టుకున్న ఫిల్మ్ మేకర్ అంటే మహి వి రాఘవ్ అని చెప్పాలి. ఒక వైపు సినిమాలకు దర్శకత్వం వహిస్తూ... త్రీ ఆటమ్ లీవ్స్ పతాకంపై దర్శక నిర్మాతగా సినిమాలు తీస్తూ, మరో వైపు షో రన్నర్‌గా సూపర్ హిట్ వెబ్ సిరీస్‌లను అందించారు.


'సేవ్ ది టైగర్స్' విజయానికి కారణం అదే - మహి వి రాఘవ్!
'సేవ్ ది టైగర్స్ 2' (Save The Tiger 2) బ్లాక్ బస్టర్ సాధించిన నేపథ్యంలో మహి వి రాఘవ్ మాట్లాడుతూ... ''ఇంత మంచి విజయాలు అందించిన ప్రేక్షకులకు నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెబుతున్నాను. ప్రతి రోజూ మనతో పాటు చుట్టుపక్కల జనాల మధ్య జరిగే సరదా సన్నివేశాలు, జంటల మధ్య సంభాషణలతో పాటు బలమైన భావోద్వేగాలను తెరపై ప్రధానంగా ఆవిష్కరించే ప్రయత్నం చేశాం. మా ప్రయత్నానికి నటీనటుల నుంచి మంచి సహకారం లభించింది. అందరూ అద్భుతంగా నటించారు. ఎంటర్టైన్మెంట్ మేం అనుకున్నట్లుగా వచ్చింది. నేను ఎప్పుడూ మన మూలాలకు సంబంధించిన కథలు చెప్పడానికి ప్రయత్నిస్తా. అలా చేశాను కాబట్టే ఈ వెబ్ సిరీస్‌కు ప్రేక్షకుల నుంచి ఇంత మంచి రెస్పాన్స్ వచ్చింది'' అని అన్నారు.


Also Read: ఒమీ భాయ్ - పవన్ కళ్యాణ్ సినిమాలో విలన్‌గా బాలీవుడ్ హీరో లుక్ వచ్చేసింది


'సేవ్ ది టైగర్స్ 1', 'సేవ్ ది టైగర్స్ 2'... రెండు సీజన్స్ మధ్య డిఫరెన్స్ గురించి మహి వి రాఘవ్ మాట్లాడుతూ... ''సీజన్ 1లో ఫ్రస్టేషన్‌తో భాధపడుతున్న భర్తలు ఎలా ప్రవర్తిస్తారనే దాన్ని తెరకెక్కిస్తే... సీజన్ 2లో ఆ భర్తల బాధ్యతలు, మానసిక పరిపకత్వలను ఆవిష్కరించే ప్రయత్నం చేశాం. సేవ్ ది టైగర్స్ పెద్ద హిట్ కావడంతో సీజన్ 2 తీసే సమయంలో కాస్త ఒత్తిడిగా అనిపించింది. డిఫరెంట్ కంటెంట్‌ బేస్డ్ కథలు చేయాలనుకున్నప్పుడు రచనలో చమత్కారం అవసరం.  అది బాగా కుదిరింది. మా త్రీ ఆటమ్ లీవ్స్ సంస్థలో కొత్త దర్శక రచయితలను ప్రోత్సహిస్తున్నాం. మా సంస్థకు ఇండస్ట్రీలో ఓ గుర్తింపు రావటం చాలా సంతోషంగా ఉంది. త్వరలో మరిన్ని వెబ్ షోలను రూపొందించటానికి సిద్ధంగా ఉన్నాం'' అని చెప్పారు.


Also Readవెంకటేష్, అనిల్ రావిపూడి లేటెస్ట్ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్... ఆయన ఎవరంటే?