Kothapallilo Okappudu OTT Streaming: 'ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య', 'కేరాఫ్ కంచరపాలెం' వంటి హిట్ మూవీస్ నిర్మించిన ప్రవీణ పరుచూరి దర్శకురాలిగా ఎంట్రీ ఇచ్చిన ఫస్ట్ మూవీ 'కొత్తపల్లిలో ఒకప్పుడు'. రూరల్ విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సోషల్ డ్రామా జులై 18న ప్రేక్షకుల ముందుకు వచ్చి మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. దాదాపు నెల రోజుల తర్వాత ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
ఈ ఓటీటీలో చూసెయ్యండి
ఈ మూవీ ప్రముఖ ఓటీటీ 'ఆహా'లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే, చిన్న ట్విస్ట్ ఏంటంటే ప్రస్తుతం గోల్డ్ సబ్‌స్క్రిప్షన్ తీసుకున్న వారికి మాత్రమే మూవీ అందుబాటులో ఉంది. శుక్రవారం నుంచి పూర్తి స్తాయిలో 'ఆహా' సబ్‌స్క్రైబర్స్ అందరికీ అందుబాటులో ఉంటుంది. ఈ మూవీతోనే మనోజ్ చంద్ర హీరోగా పరిచయం కాగా... మౌనిక హీరోయిన్‌గా నటించారు. వీరితో పాటే రవీంద్ర విజయ్, ఉషా, అభిరామ్ మహంకాళి, షైనింగ్ ఫణి, ప్రేమ్ సాగర్, బెనర్జీ కీలక పాత్రలు పోషించారు. దగ్గుబాటి రానా సమర్పించారు.
స్టోరీ ఏంటంటే?
కొత్తపల్లి గ్రామంలో అప్పన్న (రవీంద్ర విజయ్) ఊరంతటికీ అప్పులిస్తూ వడ్డీల మీద వడ్డీలు కట్టించుకుంటుంటాడు. ఊరందరికీ వేరే దారి లేక ఇతని వద్దే అప్పులు చేస్తూ ఇబ్బంది పడుతుంటారు. అప్పన్న దగ్గరే రామకృష్ణ (మనోజ్ చంద్ర) పని చేస్తుంటాడు. ఇక ఇదే ఊరి జమీందారు రెడ్డి (బెనర్జీ) మనవరాలు సావిత్రిని (మోనికా) చిన్నప్పటి నుంచి ప్రేమిస్తాడు రామకృష్ణ. అప్పన్న దగ్గర పని చేయడమే కాకుండా అప్పుడప్పుడు రికార్డింగ్ డ్యాన్సులు కూడా చేయిస్తుంటాడు. ఓసారి సావిత్రితో పక్క ఊరిలో డ్యాన్స్ చేయించాలనుకుని నేరుగా ఆమెను అడగాలంటే ధైర్యం చాలదు.
దీంతో సావిత్రి ఇంట్లో పని చేసే అందం అలియాస్ ఆదిలక్ష్మి (ఉషా) సాయం కోరతాడు. అయితే, అనుకోని ఘటనలతో ఆదిలక్ష్మిని రామకృష్ణ పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. సరిగ్గా ముహూర్తానికి కొద్ది నిమిషాల ముందే అప్పన్న వల్ల వీరి పెళ్లి ఆగుతుంది. అసలు అతను ఏం చేశాడు? అప్పన్న, రెడ్డికి మధ్య శత్రుత్వం ఎలా, ఎందుకు వచ్చింది? తన మనవరాలిని రామకృష్ణ ప్రేమించాడని తెలుసుకున్న రెడ్డి ఏం చేశాడు? సావిత్రి రామకృష్ణను ప్రేమిస్తుందా? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.