CSpace OTT App By Kerala Government: ప్రస్తుతం ఎంటర్‌టైన్మెంట్ లవర్స్ కోసం ఎన్నో ఓటీటీ యాప్స్ రెడీగా ఉన్నాయి. ఎంటర్‌టైన్మెంట్ ఇండస్ట్రీ థియేటర్ల కంటే ఓటీటీపైనే ఎక్కువగా ఆధారపడుతోంది. అందుకే కేరళ ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది. సొంతంగా ఒక ఓటీటీ యాప్‌ను తయారు చేయడానికి సిద్ధమయ్యింది. మార్చి 7న ఈ యాప్‌ను లాంచ్ చేస్తున్నట్టు కేరళ ప్రభుత్వం ప్రకటించింది.
ఎంటర్‌టైన్మెంట్‌తో పాటు ఇన్ఫర్మేషన్..
కేవలం కంటెంట్ ఉన్న కథలను అతి తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కించి ప్రతీ ఇండియన్ భాషకు సంబంధించిన ఇండస్ట్రీకి పోటీనిస్తోంది మాలీవుడ్. మలయాళం నుంచి తెలుగులోకి డబ్ అయిన చిత్రాలు.. ఇప్పటికే ప్రేక్షకాధరణతో దూసుకెళ్తున్నాయి. అంతేకాదు.. కొందరైతే ఏకంగా సబ్ టైటిల్స్‌తో మలయాళం సినిమాలు చూసేస్తున్నారు. అలా ఎంటర్‌టైన్మెంట్ ఇండస్ట్రీలో దూసుకుపోతోంది కేరళ. అందుకే డిజిటల్ ఎంటర్‌టైన్మెంట్‌లో కూడా సెన్సేషన్ క్రియేట్ చేయడానికి కేరళ సిద్ధమయ్యింది. ‘సీస్పేస్’ అనే ఓటీటీ యాప్‌ను స్వయంగా రాష్ట్ర ప్రభుత్వమే క్రియేట్ చేసి ఎంటర్‌టైన్మెంట్ లవర్స్ ముందుకు తీసుకురానుంది. ఈ యాప్‌లో ఎంటర్‌టైన్మెంట్‌తో పాటు ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుందని సమాచారం.
60 మందితో ప్యానెల్ ఏర్పాటు..
మార్చి 7 ఉదయం 9.30 గంటలకు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ చేతుల మీదుగా ‘సీస్పేస్’ యాప్ లాంచ్ అవ్వనుంది. కైరళి థియేటర్‌లో జరగనున్న ఈ లాంచ్ కార్యక్రమానికి మంత్రి సజీ చెరియన్ కూడా హాజరు కానున్నారు. ఓటీటీ సెక్టార్ విషయంలో ఎదురవుతున్న సమస్యలకు సీస్పెస్ అనేది ఒక పరిష్కారాన్ని ఇస్తుందని కేరళ స్టేట్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (కేఎస్ఎఫ్డీసీ) చైర్మన్, డైరెక్టర్ షాజీ ఎన్ కరుణ్ నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. కేరళ ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న కేఎస్ఎఫ్డీసీ.. ఈ ‘సీస్పేస్’ యాప్‌ను రన్ చేయనుంది. ఇప్పటికే ఈ యాప్‌లో పనిచేయడం కోసం కల్చరల్స్‌పై అవగాహన ఉన్న 60 మందిని సెలక్ట్ చేసింది కేఎస్ఎఫ్డీసీ.
ఆ ముగ్గురు సమ్మతిస్తేనే..
బెన్యమిన్, ఓవీ ఉషా, సంతోష్ శివన్, శ్యామప్రసాద్, సన్నీ జోసెఫ్, జియో బేబీ వంటి సీనియర్లతో ఒక ప్యానెల్‌ను ఏర్పాటు చేసింది కేఎస్ఎఫ్డీసీ. వీరంతా కలిసి ‘సీస్పేస్’ యాప్ కార్యకలాపాలను చూసుకోనున్నారు. ఈ యాప్‌లో ఎలాంటి సమాచారం స్ట్రీమ్ అవ్వాలి అనేది పూర్తిగా ముగ్గురు వ్యక్తుల చేతుల్లో ఉంటుంది. ఇప్పటికే సీస్పేస్ లాంచ్ కోసం మొదటి ఫేజ్‌లో భాగంగా 35 సినిమాలు, 6 డాక్యుమెంటరీలు, ఒక షార్ట్ ఫిల్మ్ సెలక్ట్ చేశామని, లాంచ్ అవ్వగానే అవి స్ట్రీమింగ్‌కు అందుబాటులో ఉంటాయని కరుణ్ తెలిపారు. ఈ యాప్‌లో సినిమాలు చూడాలనుకుంటే రూ.75 చెల్లించాలని తెలుస్తోంది. అలా ‘పే పర్ వ్యూ’ స్కీమ్‌తో ‘సీస్పేస్’ రన్ అవ్వనుంది. ప్రస్తుతానికి ఈ యాప్‌లో ఎక్స్‌క్లూజివ్‌గా సినిమాలు ఏమీ అందుబాటులోకి రావడం లేదని, త్వరలోనే అలాంటి ప్రయత్నాలు కూడా జరుగుతాయని కరుణ్ అన్నారు.