Bhaje Vaayu Vegam OTT Release Date: ఈరోజుల్లో చాలావరకు సినిమాలు థియేటర్లలో విడుదలయిన నెలరోజులకే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. ఒకవేళ థియేటర్లలో బ్లాక్‌బస్టర్ టాక్ అందుకున్న సినిమా అయితే అది ఒకటిన్నర నెల నుండి 2 నెలల మధ్యలోనే ఓటీటీలో స్ట్రీమింగ్ ప్రారంభించుకుంటోంది. ఇప్పుడు యంగ్ కార్తికేయ హీరోగా నటించిన ‘భజే వాయు వేగం’ కూడా ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌లో అడుగుపెట్టడానికి సిద్ధమవుతోంది. ‘భజే వాయు వేగం’ సినిమాకు మూవీ టీమ్ అంతా కలిసి ఒక రేంజ్‌లో ప్రమోషన్స్ చేసినా కూడా థియేటర్లలో ఇది యావరేజ్ టాక్‌నే సంపాదించుకుంది. దీంతో నెలరోజుల లోపే ఓటీటీలోకి వచ్చేస్తోంది.
నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్..
ప్రశాంత్ రెడ్డి దర్శకత్వంలో కార్తికేయ నటించిన ‘భజే వాయు వేగం’.. మే 31న థియేటర్లలో విడుదలయ్యింది. అప్పటికే మూవీ టీమ్ చేసిన ప్రమోషన్స్ వల్ల సినిమాకు ఓపెనింగ్స్ బాగానే వచ్చాయి. కానీ హిట్ టాక్ మాత్రం అందుకోలేకపోయింది. థియేటర్లలో ‘భజే వాయు వేగం’ యావరేజ్ హిట్‌గా నిలిచింది. ఈ మూవీ దర్శకుడిగా ప్రశాంత్ రెడ్డికి మొదటి సినిమానే అయినా యాక్షన్ సీన్స్ బాగానే హ్యాండిల్ చేశాడని, అన్ని కోణాల్లో మూవీ బాగుందని తనకు మంచి మార్కులే పడ్డాయి. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలో ప్రేక్షకులను అలరించడానికి వచ్చేస్తోంది. నెట్‌ఫ్లిక్స్‌లో ‘భజే వాయు వేగం’ స్ట్రీమ్ కానున్నట్టు ప్రకటించింది.
వెంకట్ వేగం..
నెట్‌ఫ్లిక్స్‌లో జూన్ 28 నుండి ‘భజే వాయు వేగం’ స్ట్రీమ్ కానున్నట్టుగా మేకర్స్ ప్రకటించారు. ఈ విషయంపై సోషల్ మీడియాలో నెట్‌ఫ్లిక్స్.. ఒక పోస్ట్ కూడా షేర్ చేసింది. ‘రహస్యాలు, ఛేజ్‌లు, గ్యాంబ్లింగ్, ఇంకా మాఫియా.. ఇవేవి వెంకట్ వేగానికి సరిపోవు’ అంటూ మూవీ గురించి చెప్తూ ఓటీటీ అప్డేట్ ఇచ్చింది నెట్‌ఫ్లిక్స్. దాంతో పాటు ఒక కొత్త పోస్టర్ కూడా విడుదల చేసింది. ‘భజే వాయు వేగం’లో కార్తికేయ ఒక క్రికెటర్‌గా కనిపించాడు. అంతే కాకుండా సినిమాలో కార్ ఛేజింగ్ సీన్స్, ఫైట్స్ హైలెట్‌గా నిలుస్తాయి. అందుకే ప్రతీ పోస్టర్ ఈ మూడు అంశాలు కచ్చితంగా ఉండేలా చూసుకున్నారు మేకర్స్.
సర్‌ప్రైజ్ ఇచ్చిన రాహుల్..
‘భజే వాయు వేగం’లో కార్తికేయ సరసన హీరోయిన్‌గా ఐశ్వర్య మీనన్ మెరిసింది. తనికెళ్ల భరణి, రవిశంకర్, శరత్ లోహితస్వ వంటి నటీనటులు ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించారు. అంతే కాకుండా ‘హ్యాపీ డేస్’ ఫేమ్ రాహుల్ టైసన్ కూడా ఈ సినిమాలో కార్తికేయ అన్న పాత్రలో కనిపించి అలరించాడు. టీజర్, ట్రైలర్‌లో రాహుల్ పాత్ర గురించి ఎక్కడా రివీల్ చేయలేదు. కానీ మూవీలో మాత్రం కార్తికేయకు సమానంగా ప్రాధాన్యత ఉండే పాత్రలో రాహుల్ కనిపించి ప్రేక్షకులను సర్‌ప్రైజ్ చేశాడు. యూవీ క్రియేషన్స్.. ‘భజే వాయు వేగం’ మూవీని నిర్మించింది. రధన్ సంగీతాన్ని అందించాడు.
Also Read: ‘హ్యాపీ డేస్’ తర్వాత తప్పు నిర్ణయాలు తీసుకున్నాను, అలా చేయడం కరెక్ట్ కాదు - రాహుల్ టైసన్