Netflix Marks Record Views In India: ప్రపంచ వ్యాప్తంగా సత్తా చాటుతున్న ఓటీటీ ఫ్లారమ్ లలో నెట్‌ఫ్లిక్స్ ఒకటి. గత కొంత కాలంగా చక్కటి కంటెంట్ తో ప్రేక్షకులను, చందాదారులను పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. ఇండియాలోనూ నెట్‌ఫ్లిక్స్ వినియోగదారులు రోజు రోజుకు  పెరుగుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇండియన్ మూవీస్ తో పాటు వెబ్ సీరిస్‌లు, షోలకు నెట్‌ఫ్లిక్స్ ప్రాధాన్యత ఇస్తోంది. ఈ నేపథ్యంలో భారతీయ కంటెంట్ కు ఏకంగా వందకోట్ల వ్యూస్ రావడం విశేషం. అదీ ఏడాది కాలంలోనే బిలియన్ మార్క్ అందుకుంది.

  


నెట్‌ఫ్లిక్స్ తాజా నివేదికలో కీలక విషయాలు వెల్లడి


నెట్‌ఫ్లిక్స్ సంస్థ తాజాగా తన నివేదికను విడుదల చేసింది. ఇందులో ఇండియన్ సినిమాలు, వెబ్ సిరీస్ సాధించిన వ్యూస్ వివరాలను వెల్లడించింది. ‘వాట్ వి వాచ్డ్: ఎ నెట్‌ఫ్లిక్స్ ఎంగేజ్‌మెంట్ రిపోర్టు’ పేరుతో ఈ నివేదికను రిలీజ్ చేసింది. గత ఏడాది(2023) జులై నుంచి డిసెంబర్ మధ్యకాలంలో ఆయా సినిమాలు, వెబ్ సీరిస్‌లు ఎన్ని వ్యూస్ సాధించాయి అనేది వివరించింది. గత ఏడాది సెకెండ్ హాఫ్ లో వరల్డ్ వైడ్ గా 9 వేల గంటల వ్యూస్ అందుకున్నట్లు తెలిపింది.


ఎక్కువ వ్యూస్ సాధించిన సినిమాలు, వెబ్ సీరిస్‌లు ఇవే!


భారత్ కు సంబంధించి ఎక్కువ వ్యూస్ సాధించిన సినిమాగా ‘జానె జాన్’ నిలిచింది. ఈ సినిమా 2.2 కోట్ల వ్యూస్ సాధించింది. ఆ తర్వాత షారుఖ్ ఖాన్ నటించిన ‘జవాన్’ మూవీ నిలిచింది. ఈ సినిమాకు 1.62 కోట్ల వ్యూస్ వచ్చాయి. విశాల్ భరద్వాజ్ నటించిన ‘ఖుషియా’ మూవీ మూడో స్థానంలో నిలిచింది. ఈ మూవీ 1.21 కోట్ల వ్యూస్ సాధించింది. అటు ఓఎంజీ 2’, ‘లస్ట్ స్టోరీస్ 2’, ‘డ్రీమ్ గర్ల్ 2’, ‘కర్రీ అండ్ సయనైడ్’ లాంటి సినిమాలు, వెబ్ సీరిస్‌లు కూడా మంచి వ్యూస్ సాధించాయి. ‘ది రైల్వే మెన్’ వెబ్ సిరీస్ అత్యధిక వ్యూస్ సాధించింది. 1984 భోపాల్ గ్యాస్ లీక్ ఘటన నేపథ్యంలో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ 1.06 కోట్ల వ్యూస్ అందుకుంది. ‘కోహ్రీ’, ‘గన్స్ అండ్ గులాబ్స్’, ‘కాలా పానీ’ ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.


అత్యధిక వ్యూస్ అందుకున్న ‘లీవ్ ద వరల్డ్ బిహైండ్’


అటు కొరియన్, స్పానిష్, జపనీస్ సినిమాలు, వెబ్ సీరిస్‌లు కూడా పెద్ద మొత్తంలో వ్యూస్ సాధిస్తున్నాయి. భారత్‌కు చెందిన హిందీ, తెలుగు, తమిళం, మలయాళంకు సంబంధించిన కంటెంట్ కూడా మంచి ఆదరణ దక్కించుకుంటోంది. 2023లో ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక వ్యూస్ అందుకున్న చిత్రంగా ‘లీవ్ ద వరల్డ్ బిహైండ్’ నిలిచింది. ఈ మూవీ ఏకంగా 12.1 కోట్ల వ్యూస్ అందుకుంది. ఆ తర్వాత స్థానంలో యానిమేటెడ్ మూవీ ‘లియో’ నిలిచింది. ఈ సినిమా 7.2 కోట్ల వ్యూస్ సాధించింది.


Read Also: 'విశ్వంభర' మూవీలో మరో యంగ్‌ హీరోయిన్‌ - ఇద్దరు హీరోయిన్లతో మెగాస్టార్‌ రొమాన్స్‌