'Heeramandi' Actress Sanjeeda Shaikh: కొన్నిరోజుల క్రితం నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలయిన ‘హీరామండి’ వెబ్ సిరీస్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ఈ సిరీస్.. కొన్నాళ్ల పాటు ప్రేక్షకుల్లో హాట్ టాపిక్‌గా మారింది. అందులో వహీదా అనే పాత్రలో కనిపించి ఆడియన్స్‌ను మెప్పించింది సంజీదా షేక్. అయితే యాక్టర్‌గా ఉండడం ఎంత కష్టమో, దాని వల్ల ఎన్ని సమస్యలు ఎదురవుతాయో తాజాగా బయటపెట్టింది సంజీదా. మామూలుగా సినీ సెలబ్రిటీలు ఫ్రీగా బయట తిరగలేరు. ఒకవేళ అలా వెళ్లినా కూడా తమ చుట్టూ ఫ్యాన్స్ చేరుతారు. అలా తనకు జరిగిన ఒక చేదు అనుభవాన్ని గుర్తుచేసుకుంది సంజీదా.


మగవాళ్లే అలా చేస్తారనుకున్నా..


కొందరు సినీ సెలబ్రిటీలు.. తమకు ఎదురయ్యే చేదు అనుభవాలను చాలాకాలం వరకు మర్చిపోలేరు. అలా తన జీవితంలో మర్చిపోలేని ఒక చేదు అనుభవం గురించి తాజాగా పాల్గొన్న ఇంటర్వ్యూలో బయటపెట్టింది ‘హీరామండి’ నటి సంజీదా షేక్. ‘‘నాకు ఒక సందర్భంగా అంత సరిగా గుర్తులేదు కానీ అది ఒక అమ్మాయి వల్ల జరిగింది. నేను ఒక నైట్ క్లబ్‌లో ఉన్నాను. ఒక అమ్మాయి నా ముందు నుంచి వెళ్తూ నా ఛెస్ట్‌ను టచ్ చేసి వెళ్లిపోయింది. నేను ఒక్కసారిగా ఆగిపోయాను. అసలు ఇప్పుడు ఏం జరిగింది అనుకున్నాను. మామూలుగా మగవాళ్లు.. ఆడవాళ్లను అసభ్యకరంగా టచ్ చేస్తారు అని వింటుంటాం. కానీ ఆడవాళ్లు కూడా అలాగే ఉన్నారు’’ అని బయటపెట్టింది సంజీదా.


ఎవరు చేసినా తప్పే..


‘‘అమ్మాయి, అబ్బాయి అనేది సంబంధం లేదు. ఎవరు చేసినా తప్పు తప్పే. తప్పుడు మార్గాలు అనేవి అందరికీ ఒకేలా ఉంటాయి. ఒక అమ్మాయి మీతో తప్పుగా ప్రవర్తిస్తే చెప్పాలి. ఎందుకంటే ప్రతీసారి బాధితురాలిగా మిగిలిపోవడం అంత మంచి విషయం ఏమీ కాదు’’ అంటూ తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చింది సంజీదా షేక్. ఈ నటికి అమీర్ అలీ అనే యాక్టర్‌తో వివాహం జరిగింది. కానీ వీరిద్దరికీ 2020లో విడాకులు కూడా అయ్యింది. దానిపై కూడా సంజీదా స్పందించింది. ‘‘ఆ సమయంలో నేను చాలా దురదృష్టవంతురాలిని అనుకుంటూ డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాను. ఆ తర్వాత మెల్లగా నన్ను నేను ప్రేమించడం మొదలుపెట్టాను. ఇప్పుడు నాతో నేను సంతోషంగా ఉన్నాను’’ అని తెలిపింది.


దర్శకుడిపై విమర్శలు..


‘హీరామండి’లో సంజీదా షేక్‌తో పాటు మనీషా కొయిరాల, అదితి రావు హైదరీ, షర్మిన్ సెగల్, రిచా చడ్డా, శృతి శర్మ, సోనాక్షి సిన్హా కూడా ఇతర కీలక పాత్రల్లో కనిపించారు. స్వాతంత్ర్యం సమయంలో లాహోర్‌లోని హీరామండి అనే వేశ్యగృహాలపై ఈ వెబ్ సిరీస్ తెరకెక్కింది. సంజయ్ లీలా భన్సాలీ రిచ్ టేకింగ్‌కు చాలామంది ప్రేక్షకులు ఫిదా అయినా కూడా దీనిని తెరకెక్కించిన తీరును పలువురు విమర్శించారు కూడా. వేశ్యగృహాలను అందంగా చూపించడం సంజయ్ లీలా భన్సాలీకి అలవాటే అంటూ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి తనపై ఫైర్ అయ్యారు. అయినా కూడా ఆ విమర్శలు ఏవీ ‘హీరామండి’ సక్సెస్‌ను ఆపలేకపోయాయి.


Also Read: రవీనా టాండన్‌పై జరిగిన దాడిపై స్పందించిన కంగనా