Best Actions Movies On OTT: సోషల్ మెసేజ్ డ్రామాను ఎమోషనల్‌గా చూపించడంలో కోలీవుడ్ ఎప్పుడూ ముందుంటుంది. పైగా అలాంటి కథలకు మంచి యాక్టింగ్ కూడా యాడ్ అయితే ఆ మూవీని ప్రేక్షకులు కచ్చితంగా హిట్ చేస్తారు. అలాంటి తమిళ సినిమాల్లో ఒకటి ‘గరుడన్’ (Garudan). అప్పటివరకు ఒక కామెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా అలరించిన సూరి.. ‘గరుడన్’లో ఒక్కసారిగా తన లుక్ అంతా మార్చేసి మాస్ హీరోగా మారిపోయాడు. తన లుక్సే ఈ మూవీకి హైప్ క్రియేట్ చేసినా.. ఇందులో ఎమోషన్స్, యాక్షన్ కూడా ప్రేక్షకులకు ఈ చిత్రాన్ని దగ్గర చేశాయి.


కథ..


‘గరుడన్’ కథ విషయానికొస్తే.. తమిళనాడులోని కొంబై అనే ఊరిలో ఉండే మంత్రి తంగపాండి (ఉదయకుమార్).. అస్సలు మంచివాడు కాదు. తను ప్రభుత్వం ఆస్తులను కబ్జా చేస్తూ తన ఆస్తులను పెంచుకుంటూ ఉంటాడు. అదే క్రమంలో దేవాలయం కోసం కేటాయించిన ఒక ల్యాండ్‌పై తంగపాండి కన్నుపడుతుంది. ఆ ల్యాండ్ డాక్యుమెంట్లు బ్యాంక్ లాకర్‌లో ఉన్నాయని తెలిసి ఎలాగైనా వాటిని దొంగలించాలి అనుకుంటాడు. దానికోసం ఆ ఏరియాకు కొత్తగా వచ్చిన ఇన్‌స్పెక్టర్ ముత్తువేల్ (సముద్రఖని) సాయం అడుగుతాడు. ముత్తువేల్‌కు ఇష్టం లేకపోయినా ఈ విషయంలో సైలెంట్‌గా ఉండిపోతాడు. కట్ చేస్తే.. సొక్కాన్ (సూరి), కర్ణ (ఉన్ని ముకుందన్), ఆది (శశికుమార్) చిన్నప్పటి నుండి స్నేహితులు. ఊరిలోని దేవాలయం బాధ్యతలను కర్ణ బామ్మ దగ్గరుండి చూసుకుంటూ ఉంటారు.


కర్ణ బామ్మను చంపేస్తే గుడి కోసం ఉన్న భూమిని ఈజీగా ఆక్రమించుకోవచ్చని తంగపాడి ప్లాన్ చేస్తాడు. దానికోసం తన బావమరిది నాగరాజ్ (మైమ్ గోపీ) సాయం తీసుకుంటాడు. అకస్మాత్తుగా ఒకరోజు కర్ణ బామ్మ చనిపోయి ఉంటుంది. దీంతో తన తర్వాత కర్ణకు దేవాలయ బాధ్యతలు అప్పగించాలని ఊరి పెద్దలు భావిస్తారు. కానీ నాగరాజ్ మాత్రం తానే గుడికి నిర్వహకుడిగా ఉంటానని పట్టుబడతాడు. దీంతో అతడికి వ్యతిరేకంగా గుడి నిర్వహకుడి పోస్ట్ కోసం నాగరాజ్‌కు పోటీగా సొక్కాన్ నిలబడతాడు. ఎన్నికల్లో సొక్కాన్ గెలిచి గుడి నిర్వహకుడిగా బాధ్యతలు స్వీకరిస్తాడు. ఈ విషయం కర్ణ భార్యకు అస్సలు నచ్చదు. ఆర్థిక పరిస్థితి దెబ్బతినడంతో కర్ణ కుటుంబం కష్టాలు పడుతుంది.


గుడి నిర్వహకుడిగా సొక్కాన్.. బాధ్యతలు స్వీకరించిన తర్వాత గుడిలోని నగలు బంగారం కాదని తెలుస్తుంది. తన ఆర్థిక పరిస్థితి బాగాలేకపోవడంతో తానే నగలు తీసుకున్నానని కర్ణ ఒప్పుకుంటాడు. దీంతో కర్ణను జైలుకు పంపిస్తాడు ఆది. జైలుకు వెళ్లిన కర్ణకు బెయిల్ ఇప్పించి బయటికి తీసుకొస్తాడు నాగరాజ్. దీంతో నాగరాజ్ చేసే నేరాల్లో భాగమవ్వడానికి కర్ణ సిద్ధమవుతాడు. గుడిలో ఉత్సవాలు జరుగుతున్న సమయంలో భూమికి సంబంధించిన డాక్యుమెంట్లు దొంగలించాలని నాగరాజ్ ప్లాన్ చేస్తాడు. దానికి కర్ణ బావమరిది కూడా సాయం చేస్తాడు. అదే ఉత్సవాల్లో అతడి చేయి నరికేసి జైలుకు వెళ్తాడు సొక్కాన్. దీంతో సొక్కాన్, ఆదిపై పంగ పెంచుకుంటాడు కర్ణ. ఆ తర్వాత కర్ణ ఏం చేస్తాడు? ఎలా పగతీర్చుకుంటాడు? అనేది తెరపై చూడాల్సిన కథ.



ఇంటర్వెల్ ఫైట్..


‘గరుడన్’ సినిమాలో సూరి మేక్ ఓవర్ చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. దాని వల్లే ఈ సినిమా గురించి చాలారోజులు కోలీవుడ్ సర్కిల్లో హాట్ టాపిక్‌గా మారింది. పైగా ఈ మూవీలో ఆడియన్స్‌ను ఎమోషనల్ చేసే విషయాలు కూడా చాలానే ఉన్నాయి. కొన్ని సీన్స్ ఆడియన్స్‌ను కంటతడి పెట్టిస్తాయి. ఇంటర్వెల్‌లో వచ్చే ఫైట్, అందులో సూరి యాక్షన్.. యాక్షన్ లవర్స్‌ను ఆకట్టుకుంటుంది. సూరి, ఉన్నికృష్ణన్, శశికుమార్ లాంటి టాలెంటెడ్ యాక్టర్లను తీసుకొని ముగ్గురి పాత్రలకు సమానమైన ప్రాధాన్యత ఇస్తూ కథను బాగా నడిపించాడు ఆర్ఎస్ దురాయ్ సెంథిల్‌కుమార్. ఒక కామెడియన్ నుండి యాక్షన్ హీరోగా మారిన సూరి ‘గరుడన్’ను చూడాలంటే అమెజాన్ ప్రైమ్‌లో చూసేయొచ్చు.


Also Read: ఒక ఫ్రెండ్‌తో పెళ్లి, మరో ఫ్రెండ్‌తో ప్రేమ - ముగ్గురి మధ్య సాగే వింత ప్రేమ కథ.. ఈ మూవీలో ట్విస్టులు భలే ఉంటాయ్