Sukumar's Daughter Sukriti Veni Gandhi Tatha Chettu OTT Streaming On ETV Win: స్టార్ డైరెక్టర్ సుకుమార్ కుమార్తె సుకృతి వేణి (Sukriti Veni) ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ 'గాంధీ తాత చెట్టు' (Gandhi Tatha Chettu). ఫస్ట్ మూవీలోనే తనదైన నటనతో మెప్పించారు సుకృతి వేణి. ఇప్పటికే ఈ మూవీ 'అమెజాన్ ప్రైమ్ వీడియో' ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
మరో ఓటీటీలోనూ స్ట్రీమింగ్..
తాజాగా.. మరో ఓటీటీ ప్లాట్ ఫాం 'ఈటీవీ విన్'లోనూ (ETV Win) 'గాంధీ తాత చెట్టు' అందుబాటులోకి వచ్చింది. ఆదివారం నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతున్నట్లు సదరు ఓటీటీ సంస్థ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. పద్మావతి మల్లాది దర్శకత్వం వహించిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్‌తో కలిసి సుకుమార్ భార్య తబితానే నిర్మించారు.
ఓటీటీలో ట్రెండింగ్..
జనవరి 24న థియేటర్లలోకి వచ్చిన బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్ తెచ్చుకోగా.. సడన్‌గా ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. 'అమెజాన్ ప్రైమ్ వీడియో'లో స్ట్రీమింగ్ అవుతుండగా.. ట్రెండింగ్ మూవీస్‌లో ఒకటిగా కొనసాగుతోంది. ఈ సినిమా అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో పలు అవార్డులు అందుకోగా.. తొలి సినిమాకు ఉత్తమ బాలనటిగా సుకృతికి పురస్కారాలు వచ్చాయి. అలాగే.. 'దుబాయ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్', 'దాదాసాహెబ్ ఫిల్మ్ ఫెస్టివల్' తదితర అవార్డులు సైతం దక్కాయి.
అసలు కథేంటంటే..?
గాంధీజీ సిద్ధాంతాల్ని అనుసరించే ఓ అమ్మాయి.. తన ఊరిని కాపాడుకునేందుకు ఏం చేసిందనేదే ప్రధానాంశంగా.. 'గాంధీ తాత చెట్టు' మూవీ తెరకెక్కింది. ఇక స్టోరీ విషయానికొస్తే.. నిజామాబాద్ జిల్లాలోని అడ్లూరులో రామచంద్రయ్య (ఆనంద చక్రపాణి) తన మనవరాలితో (సుకృతివేణి) కలిసి ఉంటాడు. ఆయన గాంధేయవాది. గాంధీపై అభిమానంతో తన మనవరాలికి గాంధీ అని పేరు పెడతారు. నలుగురిని నవ్వుతూ పలకరించడం, తనకున్న 15 ఎకరాల భూమిలో వేప చెట్టు కింద కూర్చుని పుస్తకాలు చదవడం రామచంద్రయ్య వ్యాపకం. నలుగురి మంచి కోరుకునే తాత లక్షణమే మనవరాలు కూడా వస్తుంది. గాంధీ సిద్ధాంతాల్ని బోధిస్తూ పెంచుతాడు రామచంద్రయ్య.
అడ్లూరులో రైతులంతా చెరకు సాగు చేస్తుండగా.. ఫ్యాక్టరీ మూతపడడంతో నష్టాలపాలవుతారు. అదే టైంలో ఊరిలో కెమికల్ ఫ్యాక్టరీ పెట్టి అందరికీ ఉపాధి కల్పిస్తామంటాడు వ్యాపారవేత్త సతీష్ (రాగ్ మయూర్). డబ్బుకు ఆశ పడిన గ్రామస్తులు తమ పొలాలు అమ్మేస్తారు. అయితే తన 15 ఎకరాల భూమిని అమ్మడానికి రామచంద్రయ్య నిరాకరిస్తాడు. దాంతో కొడుకు ఆయనపై కోప్పడతాడు. ఇదే సమయంలో తన తాత ప్రాణంగా భావించే చెట్టును కాపాడేందుకు గాంధీ ఏం చేసింది.? ఆమె చర్యలతో ఊరిలో మారిన పరిణామాలేంటి.?, శాంతియుతంగా చేసిన పోరాటం ఎలాంటి ఫలితాన్ని ఇచ్చింది..? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.