Best Horror Movies On OTT: హారర్ సినిమాల కథలు చెప్తే ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయో.. చూస్తే అంతకంటే ఎక్కువే ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది. అలాంటి భయంకరమైన హారర్ సినిమాల్లో ఒకటి ‘ఫ్రెండ్ రిక్వెస్ట్’ (Friend Request). హాలీవుడ్‌లో తెరకెక్కిన అతి భయంకరమైన హారర్ చిత్రాల్లో ‘ఫ్రెండ్ రిక్వెస్ట్’ ఒకటి. 2016లో ఈ మూవీ విడుదలయ్యే సమయానికి చాలామంది ఫేస్‌బుక్‌ను ఉపయోగిస్తూ ఉన్నారు. ఆ ఫేస్‌బుక్ వ్యసనాన్నే థీమ్‌గా తీసుకొని ‘ఫ్రెండ్ రిక్వెస్ట్’ను తెరకెక్కించాడు దర్శకుడు సైమన్ వెర్హోవన్.


కథ..


ఒక కాలేజ్‌లో ‘ఫ్రెండ్ రిక్వెస్ట్’ సినిమా ఓపెన్ అవుతుంది. ఒక క్లాస్‌లోకి ప్రొఫెసర్ వచ్చి మరినా మిల్స్ (లీస్ల్ అహ్లెర్స్) చనిపోయిందని చెప్తాడు. తన సూసైడ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యిందని, దానిని ఎవరు షేర్ చేసినా సస్పెండ్ అవుతారని హెచ్చరిస్తాడు. అప్పుడే కథ మూడు వారాల ముందుకు వెళ్తుంది. లారా (అలీసియా డెబ్నమ్)కు ఫేస్‌బుక్ అడిక్షన్ ఉంటుంది. అలా ఒకరోజు తన క్లాస్‌లోని మరినా నుంచి తనకు ఫ్రెండ్ రిక్వెస్ట్ వస్తుంది. లారా కూడా ఎక్కువగా ఆలోచించకుండా ఆ రిక్వెస్ట్‌ను యాక్సెప్ట్ చేస్తుంది. అప్పటినుంచి మరినా ఆమెకు దగ్గరవ్వాలని చూస్తుంది. అంతే కాకుండా తన బర్త్‌డేకు పార్టీ ఎక్కడా అంటూ ప్రశ్నలతో విసిగిస్తుంది. అప్పుడే మరీనా ఫేస్‌బుక్ పేజ్‌ను ఓపెన్ చేసి చూస్తుంది లారా. అందులో అన్నీ దెయ్యాలకు సంబంధించిన భయంకరమైన ఫోటోలు ఉంటాయి.


లారా పుట్టినరోజున ఉదయాన్నే ఫేస్‌బుక్‌లో వీడియో కాల్ చేసి విష్ చేస్తుంది మరీనా. పార్టీ అడగగా తాను ఫ్రెండ్స్‌తో పార్టీ చేసుకోవడం లేదని, బాయ్‌ఫ్రెండ్‌తో బయటికి వెళ్తున్నానని చెప్తుంది. కానీ లారా ఫ్రెండ్స్‌తో పార్టీ చేసుకుంటున్న విషయం మరీనాకు తెలుస్తుంది. ఆ తర్వాత రోజు క్యాంటీన్‌లో లారాతో గొడవపడుతుంది. అదే సమయంలో మరీనాకు బట్టతల ఉన్న విషయం బయటపడడంతో అక్కడ ఉన్న స్టూడెంట్స్ అంతా నవ్వుతారు. ఇదంతా చూసిన తర్వాత మరీనాను అన్‌ఫ్రెండ్ చేసేస్తుంది లారా. ఆ మరుసటి రోజే మరీనా ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని ప్రొఫెసర్ వచ్చి అందరికీ చెప్తాడు. అదే రోజు క్యాంటీన్‌లో లారా ఫ్రెండ్ కోబ్ (కోనోర్ పాలో) వచ్చి అసలు మరీనా గురించి పోలీసుల దగ్గర కూడా ఎలాంటి సమాచారం లేదని, తనకు సంబంధించిన వివరాలను డేటాబేస్ నుంచి ఎవరో డిలీట్ చేశారని చెప్తాడు.


మరీనా చనిపోయిన రోజు రాత్రి తన ఫేస్‌బుక్ నుంచి లారాకు ఒక మెసేజ్ వస్తుంది. అది ఓపెన్ చేసి చూస్తే మరీనా భయంకరంగా ఆత్మహత్య చేసుకున్న వీడియో ఉంటుంది. అది చూసి భయపడి దానిని డిలీట్ చేయడానికి ప్రయత్నిస్తుంది లారా. కానీ అది డిలీట్ అవ్వదు. ఆ మరుసటి రోజు లారా ఫేస్‌బుక్‌లో ఆ వీడియో అప్లోడ్ అయ్యి ఉంటుంది. దీంతో మరీనా ఆత్మహత్యతో లారాకు కూడా సంబంధం ఉందని పోలీసులు అనుమానిస్తుంటారు. అదే సమయంలో లారా ఫ్రెండ్స్‌ను ఒక్కొక్కరిగా చంపేస్తుంటుంది మరీనా ఆత్మ. అసలు మరీనా ఎవరు అని తెలుసుకోవడానికి కోబ్ రీసెర్చ్ మొదలుపెడతాడు. అప్పుడే తను ఒక మంత్రగత్తె అని తెలుస్తుంది. తను చనిపోయిన ప్రదేశాన్ని కనుక్కొని అక్కడ ఉన్న బ్లాక్ మిర్రర్‌ను ధ్వంసం చేస్తే సమస్యలు తీరిపోతాయని లారాతో చెప్తాడు. వారిద్దరూ కలిసి ఆ ప్రదేశానికి బయల్దేరుతారు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది తెరపై చూడాల్సిందే.



భయపెట్టే హారర్ ఎలిమెంట్స్..


తర్వాత ఏం జరుగుతుంది అనే ఆసక్తి, ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసే హారర్ ఎలిమెంట్స్.. రెండూ ‘ఫ్రెండ్ రిక్వెస్ట్’లో ఉన్నాయి. సోషల్ మీడియాకు అడిక్ట్ అయినవారికి ఈ సినిమా చూస్తే.. కొత్తవారితో మాట్లాడాలంటే భయం కూడా కలుగుతుంది. ఈ కథ గురించి వినడంకంటే చూస్తే.. ఇంకా థ్రిల్లింగ్‌గా ఉంటుంది. ఒక భయపెట్టే హారర్ మూవీని ట్రై చేయాలంటే ‘అమెజాన్ ప్రైమ్’లో ఉన్న ‘ఫ్రెండ్ రిక్వెస్ట్’ను చూసేయండి.


Also Read: సముద్రం నుంచి పొగ, వింతజీవులుగా మారుతున్న మనుషులు - ఇంతకీ ఆ బీచ్‌లో ఏముంది? మైండ్ బ్లాక్ చేసే హర్రర్ మూవీ ఇది