ETV Win Deletes Objectional Scenes In AIR Web Series: ప్రముఖ ఓటీటీ 'ఈటీవీ విన్'లో లేటెస్ట్‌గా స్ట్రీమింగ్ అవుతూ మంచి రెస్పాన్స్ అందుకుంటోన్న 'AIR' వెబ్ సిరీస్‌పై ఓ సామాజిక వర్గం నుంచి విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా... ఆ వివాదానికి సదరు ఓటీటీ సంస్థ, మేకర్స్ చెక్ పెట్టారు. 

ఆ సీన్స్ డిలీట్ 

'AIR' వెబ్ సిరీస్‌లోని అన్నీ అభ్యంతరకర సీన్స్‌ను తొలగించినట్లు 'ఈటీవీ విన్' తెలిపింది. ఇక ఎలాంటి వివాదాలకు తావు లేదని స్పష్టం చేసింది. 'మేము అందరి మనోభావాలు గౌరవిస్తాం. ఎలాంటి అభ్యంతరకర సీన్స్, విషయాలున్నా వాటికి చెక్ పెట్టేందుకు కట్టుబడి ఉన్నాం. AIR సిరీస్‌లో ఆ సీన్స్ డిలీట్ చేశాం. మీ సపోర్ట్‌కు ధన్యవాదాలు. ఈటీవీ విన్ ఎల్లప్పుడూ క్వాలిటీ, వైవిధ్యమైన కంటెంట్ అందిస్తుంది.' అని వెల్లడించింది.

Also Read: కాంట్రవర్సీలు ఫుల్... కలెక్షన్లు నిల్... లైలా to తమ్ముడు... బాయ్‌కాట్‌ ఎఫెక్ట్ ఉందా?

స్టోరీ ఏంటి... కాంట్రవర్శీ ఎందుకు?

'AIR' (ఆల్ ఇండియా ర్యాంకర్స్) వెబ్ సిరీస్ ఈ నెల 3 నుంచి 'ఈటీవీ విన్'లో స్ట్రీమింగ్ అవుతోంది. వేర్వేరు కుటుంబాల నుంచి వచ్చిన ముగ్గురు విద్యార్థులు ఇంటర్ కోసం విజయవాడలోని ఓ హాస్టల్‌లో జాయిన్ అవుతారు. అప్పటివరకూ ఇంట్లో ఉండి చదువుకున్న వారు హాస్టల్‌కు వచ్చాక ఎలాంటి పరిణామాలు ఎదుర్కొన్నారు? ర్యాంకుల కోసం ఎలాంటి ఒత్తిడికి గురయ్యారు? ఫైనల్‌గా ఏం చేశారు? అనేదే స్టోరీ.

ఈ సిరీస్‌లో 'కోర్టు' మూవీ ఫేం హర్ష్ రోషన్, భాను ప్రకాష్, జయతీర్థ కీలక పాత్రలు పోషించారు. వారితో పాటు సునీల్, 'కలర్ ఫోటో' డైరెక్టర్ సందీప్ రాజ్, హర్ష చెముడు, రమణ భార్గవ్, చైతన్య కుమార్, జీవన్ కుమార్‌లు కీలక పాత్రల్లో నటించారు. జోసెఫ్ క్లింటన్ దర్శకత్వ వహించగా... సందీప్ రాజ్ రన్నర్‌గా వ్యవహరించారు.

ఆ సీన్స్‌పై అభ్యంతరం

ఈ సిరీస్‌లో హాస్టల్ సీన్స్ ఎంటర్‌టైనింగ్‌గా రాసుకోగా... కొన్నింటిపై ఓ సామాజిక వర్గం నుంచి అభ్యంతరం వ్యక్తమైంది. ఓ సామాజిక వర్గానికి చెందిన పిల్లలకు కులాభిమానం ఉన్నట్లు, వారు గ్రూపులు కట్టడంతో పాటు ఇతర కులాలకు చెందిన హీరోలను ద్వేషిస్తున్నట్లుగా చూపించారు. ఓ కూల్ డ్రింక్ యాడ్‌ను వేరే కులానికి చెందిన హీరో చేయడంతో అది తాగకూడదని నిర్ణయం తీసుకున్నట్లు చూపించారు. ఈ సీన్స్‌పై సోషల్ మీడియా వేదికగా విమర్శలు వచ్చాయి. దీంతో వాటిని తొలగించారు. 

ఆ సీన్స్ తొలగించాం

ఓ మూవీ డైరెక్టర్, నిర్మాతగా... 'ప్రేక్షకులు ఎప్పుడూ సరైనవారు' అనే నినాదాన్ని నేను నమ్ముతానని సిరీస్ రన్నర్ సందీప్ రాజ్ తెలిపారు. 'సిరీస్‌లో ఆ కంటెంట్ మిమ్మల్ని బాధిస్తే అందులో భాగమైనందుకు చాలా చింతిస్తున్నా. ఆ సీన్స్ డిలీట్ చేశాం. ప్రతి ఒక్కరూ తమ కెరీర్ ప్రారంభ దశల్లో తప్పులు చేస్తారు. మేము అదే చేసాం. దాన్ని వెంటనే సరిదిద్దుకున్నాం. మళ్లీ చేసే ఉద్ధేశం అయితే అస్సలు లేదు. AIR అనేది చాలా మంది యువ ప్రతిభావంతులను వారి కెరీర్‌లపై ఆధారపడిన అభిరుచి నుంచి రూపొందించాం. ఎవరైన బాధ పడి ఉంటే మన్నించండి. ఈసారి మరో అందమైన కంటెంట్‌తో మీ ముందుకొస్తాం.' అని ట్వీట్ చేశారు.