‘RRR’ సినిమాలో మెయిన్ విలన్ పాత్రలో నటించి మెప్పించారు హాలీవుడ్ నటుడు రే స్టీవెన్సన్. 58  ఏండ్ల వయసులో మే 22న ఆయన మరణించారు. తన 59వ పుట్టిన రోజుకు నాలుగు రోజుల ముందు కన్నుమూశారు. గుండె సంబంధ సమస్యతో ఆయన మృతి చెందారు. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘RRR’లో స్కాట్ దొరగా రే స్టీవెన్సన్ అద్భుత విలనిజం పండించారు.


రే స్టీవెన్సన్ కు డిస్నీ+ ఘన నివాళి


రే స్టీవెన్సన్ హాలీవుడ్‌లో మంచి పేరున్న నటుడు. 1998లో వచ్చిన ‘ది థియరీ ఆఫ్ ఫ్లైట్’ ద్వారా ఆయన సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. కింగ్ ఆర్థర్, థోర్ మూడు భాగాలు, స్టార్ వార్స్, వైకింగ్స్, ట్రాన్స్‌ పోర్టర్ లాంటి టాప్ హాలీవుడ్ సినిమాల్లో కూడా రే స్టీవెన్సన్ నటించారు.  స్టార్ వార్స్ సిరీస్ ‘అహ్‌శోక’లో బైలాన్ స్కోల్ పాత్రలో రే నటించారు. తొలి ఎపిసోడ్ లో ఆయన అద్భుత నటనలో ఆకట్టుకున్నాడు. అయితే, డిస్నీ+ తాజాగా ‘అహ్‌శోక’ తొలి ఎపిసోడ్ ను టెలీకాస్ట్ చేసింది. ఈ ఎపిసోడ్ ప్రారంభానికి ముందు రే స్టీవెన్‌సన్‌కు ఘన నివాళి అర్పించింది. "మా స్నేహితుడు, రే కోసం" అంటూ తొలి ఎపిసోడ్ ముగించింది.


‘అహ్‌శోక’ తొలి ఎపిసోడ్ లో బేలాన్ స్కోల్‌గా కనిపించిన రే


ఆగష్టు 23న ఈ సిరీస్ స్ట్రీమింగ్ కు వచ్చింది. రే స్టీవెన్‌సన్‌ ఈ సిరీస్ లో చివరి సారిగా కనిపించారు. బేలాన్ స్కోల్‌గా తొలి ఎపిసోడ్ లో అద్భుత నటనతో ఆకట్టుకున్నారు.  ఈ సిరీస్ లో  రోసారియో డాసన్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.  ‘ది మాండలోరియన్ సీజన్ 2’లో నైట్ పాత్రను పోషించాడు. నటాషా లియు బోర్డిజో, మేరీ ఎలిజబెత్ విన్‌స్టెడ్, ఎమాన్ ఎస్ఫాండి,  లార్స్ మిక్కెల్‌ సెన్, రెబెల్స్,  సబిన్ వ్రెన్ ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. హేరా సిండుల్లా, ఎజ్రా బ్రిడ్జర్,  గ్రాండ్ అడ్మిరల్ త్రోన్. మిక్కెల్‌సెన్ యానిమేటెడ్ సిరీస్‌లో విలన్‌కి వాయిస్‌ ఓవర్ ఆర్టిస్టులుగా కూడా పని చేశాడు. తొలి ఎపిసోడ్ కు ప్రజల నుంచి మంచి ఆదరణ లభించింది. ముఖ్యంగా రే నటించిన చివరి పాత్ర కావడంతో ఆయన అభిమానులు ఈ సిరీస్ తొలి ఎపిసోడ్ పెద్ద సంఖ్యలో చూశారు. తొలి ఎపిసోడ్ కు ఊహించిన దానికంటే ఎక్కువ ప్రేక్షకాదరణ రావడంతో మేకర్స్ సంతోషం వ్యక్తం చేశారు.  


రే స్టీవెన్సన్ వ్యక్తిగత జీవితం గురించి..


ఇక రే స్టీవెన్సన్ వ్యక్తిగత జీవితాన్ని పరిశీలిస్తే,1997లోనే రూత్ గెమ్మెల్ అనే హాలీవుడ్ నటిని పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరూ 2005లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత నుంచి ఆంత్రోపాలజిస్టు ఎలిసబెట్టా కరాకియాతో రే సహజీవనం చేస్తున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు  ఉన్నారు.


Read Also: మత్స్యకారులతో కీర్తి సురేష్ - వారం రోజులు వారితోనే ఉంటుందట!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial