Deep Water Movie Explained In Telugu: తమను ప్రేమగా చూసుకునే భర్త ఉంటే చాలు అని ఎంతో మంది భార్యలు అనుకుంటారు. కానీ, కొంత మంది మహిళల వ్యవహార శైలి కాస్త వెరైటీగా ఉంటుంది. ప్రాణంగా చూసుకునే భర్త ఉన్నా, తనను కాదని పరాయి మగాళ్లతో సన్నిహితంగా ఉండేందుకు ప్రయత్నిస్తారు. వారి కారణంగా ఎంతో మంది తమ జీవితాలను కోల్పోతారు. అలాంటి కథాంశంతో తెరకెక్కిన సినిమా ‘డీప్ వాటర్’. ఈ చిత్రానికి అడ్రియన్ లైన్ దర్శకత్వం వహించారు. జాక్ హెల్మ్, సామ్ లెవిన్సన్ స్క్రీన్ ప్లే అందించారు. ఎరోటిక్ సైకలాజికల్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రం మార్చి 18, 2022లో విడుదలై మంచి సక్సెస్ అందుకుంది. ఇందులో బెన్ అఫ్లెక్, అనా డి అర్మాస్ ప్రధాన పాత్రలు పోషించారు. ట్రేసీ లెట్స్, లిల్ రెల్ హౌరీ, డాష్ మిహోక్, ఫిన్ విట్రాక్, క్రిస్టెన్ కొన్నోలీ, జాకబ్ ఎలోర్డి ఇతర పాత్రలో కనిపించారు.  


ఇంతకీ ‘డీప్ వాటర్’ కథ ఏంటంటే?


మెలిండా(అనా డి అర్మాస్), విక్ వాన్ అలెన్(బెన్ అఫ్లెక్) లూసియానాలోని లిటిల్ వెస్లీలో కుమార్తె ట్రిక్సీతో కలిసి నివసిస్తారు. వీరిద్దరు ప్రేమగా జీవించలేకపోతారు. అలాగని విడాకులు తీసుకోరు. కూతురు కోసం కలిసి ఉండాలని నిర్ణయించుకుంటారు. ఇంటిని విడిచి వెళ్లొద్దని భార్యకు చెప్తాడు. అంతేకాదు, తనకు నచ్చిన వ్యక్తిని ఇంటికి తెచ్చుకోవచ్చు అని చెప్తాడు. దీంతో అదే పట్టణానికి చెందిన పలువురు యువకులతో ఆమె ప్రేమగా ఉంటుంది. 


భార్య అంటే అతడికి ఎంతో ఇష్టం. అందుకే, అతడి భార్య పరాయి మగాళ్లతో సన్నిహితంగా ఉండటాన్ని చూసి తట్టుకోలేడు. మెలిండా తన తాజా బాయ్ ఫ్రెండ్ జోయెల్‌( బ్రెండన్ సి. మిల్లర్)ను పక్కింట్లో జరిగే పార్టీలో కలుస్తుంది. జోయెల్‌ ఆమెతో క్లోజ్ గా ఉండటాన్ని గమనిస్తాడు. అతడిని పక్కకు పిలిచి రీసెంట్ గా కనిపించకుండా పోయినా మెలిండా మాజీ బాయ్ ఫ్రెండ్ మార్టిన్‌ ని తానే హత్య చేశానని విక్ చెప్తాడు. వెంటనే జోయెల్ అక్కడి నుంచి పారిపోతాడు. ఈ విషయం చుట్టుపక్కల వారికి తెలుస్తుంది. పక్కింట్లో ఉండే డాన్ విల్సన్(ట్రేసీ లెట్స్)కు కూడా ఈ విషయం తెలుస్తుంది. అయితే, కేవలం జోయెల్ ను భయపెట్టడానికే అలా చెప్పానని విక్ వివరిస్తాడు.  


అటు మెలిండా తాజాగా పియానో టీచర్ చార్లీ(జాకబ్ ఎలోర్డి)తో ప్రేమాయణం నడుపుతుంది. ఆమె తన బాయ్ ఫ్రెండ్ ను స్నేహితుడి ఇంట్లో జరిగే ఓ పూల్ పార్టీకి పిలుస్తుంది. అక్కడ పూల్ లో మెలిండా, చార్లీ సరదాగా గడుపుతారు. వర్షం రావడంతో అందరూ లోపలికి వెళ్తారు. విక్ కూడా లోపలికి వెళ్తాడు. కానీ, కొద్ది సేపటికి పూల్ లో చార్లీ రక్తం మడుగులో పడి చనిపోయి ఉంటాడు. చార్లీని విక్ చంపేశాడని మెలిండా భావిస్తుంది. కానీ, బయటకు చెప్పదు.


కానీ, పక్కింటి డాన్ భార్య కెల్లీ(క్రిస్టెన్ కొన్నోలీ), మెలిండా కలిసి విక్ మీద డిటెక్టివ్ తో పరిశోధన చేయిస్తారు. తనతో క్లోజ్ గా ఉన్న వారిని తన భర్తే చంపేస్తున్నాడనే అనుమానాన్ని క్లియర్ చేసుకునేందుకు ఆమె డిటెక్టివ్ సాయం తీసుకుంటుంది. ఈ విషయం విక్‌కు తెలుస్తుంది. అదే సమయంలో మెలిండా తన పాత బాయ్‌ఫ్రెండ్ టోనీ(ఫిన్ విట్రాక్)తో మళ్లీ కనెక్ట్ అవుతుంది. అంతేకాదు, టోనీని డిన్నర్ కు ఆహ్వానిస్తుంది.


డిన్నర్ తర్వాత బెడ్ రూమ్ లో సన్నిహితంగా గడుపుతారు. అది చూసి విక్ కు చాలా కోపం వస్తుంది. వెంటనే విక్ టోనీని కారులో ఎక్కించుకుని అడవిలోకి తీసుకెళ్లి తల మీద బండరాయి వేసి చంపేస్తాడు. అదే బండను అతడి నడుముకు కట్టి నీళ్లలో విసిరేస్తాడు. మరుసటి రోజు విక్ తన భార్య, కూతురుతో కలిసి అక్కడికే పిక్నిక్‌కు వెళ్తారు. ఆ సమయంలో వాళ్ల కూతురు.. టోనీని నీళ్లలో పడేసిన ప్రాంతంలో ఆడుకుంటుంది. అదే సమయంలో టోనీ డెడ్ బాడీ నీటిపై తేలుతుంది. వెంటనే అది గమనించి.. తన కూతురు, భార్యను తీసుకుని అక్కడి నుంచి ఇంటికి విక్ వెళ్తాడు.


ఇంటికెళ్లాక తన భార్య అక్కడ స్కార్ఫ్ ను మర్చిపోయినట్లు చెప్తుంది. తాను వెళ్లి తీసుకొస్తానంటూ సైకిల్ మీద వెళ్తాడు. సరస్సు దగ్గరికి వెళ్లి డెడ్ బాడీని మళ్లీ నీళ్లలో ముంచే ప్రయత్నం చేస్తాడు. కానీ, ఈ విషయాన్ని పక్కింటి డాన్ చూస్తాడు. వెంటనే డాన్ అక్కడి నుంచి కారులో పారిపోయేందుకు ప్రయత్నిస్తాడు. కానీ, తనను విక్ వెంబడించడంతో కారుతో సహా లోయలో పడి చనిపోతాడు. కానీ, తనకు ఏం తెలియనట్టు విక్ ఇంటికి వెళ్తాడు. అటు విక్ రూమ్ లోకి వెళ్లిన మెలిండా అక్కడ టోనీ వాలెట్ ను చూస్తుంది. దీంతో టోనీని తన భర్తే చంపేశాడని భావిస్తుంది. భర్తకు తన పట్ల ఉన్న ప్రేమను గుర్తించి అతడితో హాయిగా జీవితాన్ని గడపాలని భావిస్తుంది. దీంతో సినిమా అయిపోతుంది.   


అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్


ప్రస్తుతం ‘డీప్ వాటర్‘ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో అందుబాటులో ఉంది.


Read Also: ఔను, అలా చేశా - లైఫ్‌లో అన్నీ ఎక్స్‌పీరియెన్స్ చెయ్యాలి: నాగ చైతన్య బోల్డ్ కామెంట్స్ వైరల్