Best Action Movies On OTT: కొన్ని జోనర్లలో సినిమాలు తెరకెక్కించడంలో హాలీవుడే బెస్ట్ అని ఇప్పటికే ప్రూవ్ అయ్యింది. అలాంటి జోనర్లలో యాక్షన్ కూడా ఒకటి. ఇప్పటికే ఎన్నో ఇంగ్లీష్ సినిమాలు యాక్షన్ మూవీ లవర్స్‌ను ఆకట్టుకోగా తాజాగా అందులో మరొక మూవీ యాడ్ అయ్యింది. అదే ‘సివిల్ వార్’ (Civil War). ఇప్పటికే ఈ టైటిల్‌తో ఇతర ఇంగ్లీష్ సినిమాలు వచ్చినా.. కథపరంగా ఈ మూవీకి ఇదే టైటిల్ కరెక్ట్ అని ఫిక్స్ చేశాడు దర్శకుడు అలెక్స్ గార్లాండ్. ఫ్యూచర్‌లో జరిగే సంఘటనలు ఊహించి సినిమాలు తెరకెక్కించడంలో హాలీవుడ్ ముందుండగా.. ‘సివిల్ వార్’ కూడా అలాంటి ఒక సినిమానే.


కథ..


‘సివిల్ వార్’ కథ విషయానికొస్తే.. అమెరికాలో ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య యుద్ధం జరుగుతుంది. తాము నమ్మే సిద్ధాంతల ప్రకారం ప్రజలంతా విడిపోయి సివిల్ వార్ చేస్తుంటారు. దాన్ని ప్రభుత్వం కూడా అడ్డుకోలేకపోతుంది. ఆఖరికి ప్రెసిడెంట్‌పై కూడా దాడి చేయడానికి ప్రజలు సిద్దమయిపోతారు. దీంతో ప్రెసిడెంట్ వెళ్లి దాక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. దీంతో కనిపించకుండా పోయిన ప్రెసిడెంట్ ఎక్కడ ఉన్నాడో కనిపెట్టి తన ఇంటర్వ్యూ చేయాలని అనుకుంటారు వార్ ఫోటోగ్రాఫర్ లీ స్మిత్ (కిర్స్‌టెన్ డంస్ట్), వార్ జర్నలిస్ట్ జోయెల్ (వాగ్నెర్ మౌరా). దానికోసం తమ గురువు సామీ (స్టీఫెన్ మెక్ కిన్లే)ను సాయం అడుగుతారు. వారి టీమ్‌లో మరో ఫోటో జర్నలిస్ట్ అయిన జెస్సీ (కెయిలీ స్పెనీ) కూడా జాయిన్ అవుతుంది.


ఈ వార్ జర్నలిస్టుల టీమ్ అంతా కలిసి కొన్ని వార్ సన్నివేశాలను కవర్ చేయగలుగుతారు. కానీ మధ్యలో వారికి ఎన్నో ఇబ్బందులు కూడా ఎదురవుతాయి. ముందుగా జెస్సీ.. తమ టీమ్‌లో జాయిన్ అవ్వడం లీకు నచ్చదు. మెల్లగా జెస్సీ టాలెంట్‌ను గుర్తించి తనకు సాయం చేస్తుంది లీ. వార్ జరుగుతున్నా కూడా కొన్ని ప్రాంతాల్లో ప్రజలు మాత్రం దానిని పట్టించుకోకుండా జీవిస్తూ ఉంటారు. అది వార్ జర్నలిస్టులను ఆశ్చర్యపరుస్తుంది. దారిలో వారికి టోనీ, బోహాయ్ అనే మరో ఇద్దరు వార్ జర్నలిస్టులు కనిపిస్తారు. వారిద్దరూ వేరే దేశం నుంచి వచ్చుంటారు. దీంతో వారిని అమెరికన్ మిలిటరీ టార్గెట్ చేస్తుంది. వారిని చంపడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడే సామీ వచ్చి ఇద్దరినీ కాపాడతాడు. చివరికి ఏం జరిగింది? వీరంతా కలిసి ప్రెసిడెంట్ ఇంటర్వ్యూ తీసుకోగలిగారా లేదా? అన్నది తెరపై చూడాల్సిన కథ.



అందులో సక్సెస్..


సివిల్ వార్ అనే కాన్సెప్ట్‌తో ఇప్పటికే ఎన్నో హాలీవుడ్ సినిమాలు వచ్చాయి. అందులో ఈ మూవీ కాస్త డిఫరెంట్‌గా ఉంటుంది. ఒక సర్వైవల్ థ్రిల్లర్ కథను తీసుకొని, వార్ సమయంలో జర్నలిస్టుల పరిస్థితి ఏంటని క్లియర్‌గా చూపించాలని అనుకున్నాడు దర్శకుడు అలెక్స్ గార్లాండ్. ఆ విషయంలో తను చాలావరకు సక్సెస్ అయ్యాడు కూడా. సర్వైవల్ డ్రామా కాబట్టి అక్కడక్కడా ప్రేక్షకులకు బోర్ కూడా కొట్టవచ్చు. ‘సివిల్ వార్’ సినిమాలో అడల్ట్ కంటెంట్ ఏం లేకపోయినా.. వైలెన్స్ మాత్రం ఒక రేంజ్‌లో ఉంటుంది. హత్యలు, రక్తపాతం, ఫైరింగ్ ఇవన్నీ కొన్ని సన్నివేశాల్లో ప్రేక్షకులకు ఇబ్బంది కలిగిస్తాయి. మొత్తానికి వార్ ఫోటోగ్రాఫర్‌గా కిర్స్‌టెన్ డంస్ట్ నటన మూవీలో హైలెట్‌గా నిలిచింది. ఒక యాక్షన్ ప్యాక్డ్ మూవీ చూడాలంటే ‘అమెజాన్ ప్రైమ్’లో స్ట్రీమ్ అవుతున్న ‘సివిల్ వార్’పై ఓ లుక్కేయండి.


Also Read: రెస్టారెంట్‌కు వెళ్లి చిక్కుల్లో పడే ఫ్యామిలీ - క్రిమినల్స్ అంతుచూసే డాక్టర్.. యాక్షన్, సస్పెన్స్‌తో పిచ్చెక్కించే మూవీ