ట్యాలెంటెడ్ ఆర్టిస్టులకు ఒక్కోసారి బ్రేక్ రావడం ఆలస్యం కావచ్చు ఏమో కానీ రావడం మాత్రం పక్కా! 'మయసభ' వెబ్ సిరీస్, 'ఘాటి' ట్రైలర్ విడుదల తర్వాత చైతన్య రావు (Chaitanya Rao Madadi) నటనకు, నటనలో చూపించిన వైవిధ్యానికి వస్తున్న ప్రశంసలు చూస్తుంటే అది నిజమని అనిపిస్తుంది. కొన్ని గంటల వ్యవధిలో 'మయసభ', 'ఘాటి' ట్రైలర్ వచ్చాయి. రెండిటిలో ఆయన చూపించిన వేరియేషన్, మేనరిజమ్స్ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి.
'మయసభ'లో వైఎస్ రాజశేఖర్ రెడ్డిగా...
Chaitanya Rao role in Mayasabha: 'మయసభ' సిరీస్‌లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి రోల్ చేశారు చైతన్య రావు. ఆ మాట అంటే దర్శకుడు దేవా కట్టా ఒప్పుకోరు. ఎంఎస్ రామి రెడ్డి క్యారెక్టర్ అంటారు. అది పక్కన పెడితే... సిరీస్‌లో నటించిన అందరిలో కంటే ఆడియన్స్‌ను ఎక్కువ సర్‌ప్రైజ్ చేసింది చైతన్య రావు.
ఆది పినిశెట్టి ట్యాలెంట్ గురించి ప్రేక్షకులు తెలుసు. హీరోగా నటిస్తూ అల్లు అర్జున్ 'సరైనోడు', పవన్ కళ్యాణ్ 'అజ్ఞాతవాసి' సినిమాల్లో విలన్ రోల్స్ చేశారు. చంద్రబాబు నాయుడు పాత్రలో ఆది పినిశెట్టి నటన ముందు చైతన్య రావు కనిపిస్తాడా? అతను ఏం చేయగలడు? అని కొందరిలో సందేహాలు ఉన్న మాట వాస్తవం. 'మయసభ' సిరీస్ స్ట్రీమింగ్ అవుతున్నప్పటి నుంచి సందేహాలను పటాపంచలు చేస్తున్నారు చైతన్య రావు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ఇమిటేట్ చేయలేదు చైతన్య. ఆయన స్టైల్, మేనరిజం పట్టుకున్నారు. ఈతరం ప్రేక్షకులకు వైయస్సార్ అంటే ముందుగా గుర్తుకు వచ్చేది ఆయన స్పీచ్ స్టైల్. ఒక చేత్తో మైక్ పట్టుకుని మరో చేతిని మాటలకు అనుగుణంగా కదుపుతూ మాట్లాడేవారు. 'మయసభ'లో పొలిటికల్ క్యాంపెయిన్ సన్నివేశంలో చైతన్య రావు నటన, ఆ మేనరిజం చూస్తే వైయస్సారే గుర్తొచ్చారు.
వారేవ్వా... 'ఘాటి'లో చైతన్య విలనిజం!
సోనీలివ్ ఓటీటీలో 'మయసభ' స్ట్రీమింగ్ మొదలైన కొన్ని గంటలకు యూట్యూబ్‌లో 'ఘాటి' ట్రైలర్ వచ్చింది. అందులో 360 డిగ్రీస్ యూటర్న్ తీసుకున్నారు చైతన్య రావు. కరుడుగట్టిన విలన్ రోల్ చేశారని కొన్ని విజువల్స్ చూస్తే ఎవరికైనా అర్థం అవుతుంది.
ప్రత్యర్థుల మీద దాడి చేశాక, కొట్టిన తర్వాత ముఖం మీద, చేతుల నిండా రక్తం కారుతుంటే చైతన్య రావు తినే సన్నివేశం అయితే గగుర్పాటుకు గురి చేస్తుంది. వైయస్సార్ పాత్రలో జీవించిన చైతన్య... అందుకు భిన్నమైన, క్రూరమైన విలన్ పాత్రలోనూ పరకాయ ప్రవేశం చేశారు. నటుడిగా తన ప్రతిభ చాటారు.
చైతన్య రావుకు '30 వెడ్స్ 21' వెబ్ సిరీస్ పాపులారిటీ తెచ్చింది. అంతకు ముందు రెండు మూడు సినిమాల్లో క్యారెక్టర్లు చేశారు. ఆ సిరీస్ తర్వాత హీరోగా వరుస అవకాశాలు వచ్చాయి. అయితే ఆయన ఖాతాలో సరైన హిట్టు పడలేదు. ఇప్పుడు ఒక్కసారి టాక్ ఆఫ్ ద టౌన్ అయ్యారు. తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించిన 'కీడా కోలా'లో చైతన్య రావు క్యారెక్టర్, ఆయన నటన బావున్నాయ్. కానీ, ఆ సినిమాకు సరైన విజయం దక్కలేదు. అతనికి ఆశించిన బ్రేక్ రాలేదు. ఇప్పుడు బ్రేక్ కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. చైతన్య రావు రూపంలో తెలుగు తెరకు మరొక ట్యాలెంటెడ్ ఆర్టిస్ట్ దొరికినట్టే. ఆయనను దృష్టిలో పెట్టుకుని క్యారెక్టర్లు రాయొచ్చు.