The Indrani Mukerjea Story: The Buried Truth: కేవలం ఇండియాలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఎన్నో సెన్సేషనల్ క్రైమ్స్‌ను డాక్యుమెంటరీల రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తుంది నెట్‌ఫ్లిక్స్. ఈ ఓటీటీలో వచ్చే డాక్యుమెంటరీలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇక తాజాగా ఇంద్రాణి ముఖర్జీ అనే మహిళపై ఒక డాక్యుమెంటరీని విడుదల చేయనున్నట్టు నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది. మామూలుగా జరిగిపోయిన క్రైమ్స్ గురించి ఉన్నది ఉన్నట్టుగా చూపించే డాక్యుమెంటరీలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలంటే చాలా లీగల్ ఇబ్బందులు ఉంటాయి. తాజాగా ‘ది ఇంద్రాణి ముఖర్జీ స్టోరీ : ది బరీడ్ ట్రూథ్’కు కూడా అలాంటి ఇబ్బందులే ఎదురవుతున్నాయి.
కోర్టుకెక్కిన సీబీఐ..
షీనా బోరా మర్డర్ కేసులో ప్రధాన నిందితురాలు అయిన ఇంద్రాణి ముఖర్జీపై ఒక డాక్యుమెంటరీ సిరీస్‌ను తెరకెక్కించింది నెట్‌ఫ్లిక్స్. అయితే ఈ సిరీస్‌ను స్ట్రీమ్ అవ్వకుండా ఆపాలని ముంబాయ్ కోర్టును ఆశ్రయించింది సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ). ఇటీవల ముంబాయ్‌లోని స్పెషల్ కోర్టులో అప్లికేషన్ కూడా దాఖలు చేసింది. ఫిబ్రవరీ 23న ఈ సిరీస్ స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతోంది. తాజాగా ‘ది ఇంద్రాణి ముఖర్జీ స్టోరీ : ది బరీడ్ ట్రూథ్’ ట్రైలర్‌ను కూడా విడుదల చేసింది నెట్‌ఫ్లిక్స్. ఇదే సమయంలో ఈ సిరీస్‌కు లీగల్ కష్టాలు మొదలయ్యాయి. 2012లో షీనా బోరా మర్డర్ జరిగింది. 2015లో అది వెలుగులోకి వచ్చింది. ఇప్పటికీ ఈ కేసుపై విచారణ జరుగుతుండగా.. ఇలాంటి డాక్యుమెంటరీలు ప్రేక్షకుల ముందుకు రావడం కరెక్ట్ కాదని అప్లికేషన్‌లో పేర్కొంది సీబీఐ.
కోర్టులో హియరింగ్..
నెట్‌ఫ్లిక్స్ ఎంటర్‌టైన్మెంట్ సర్వీసెస్ ఇండియాతో పాటు ఈ డాక్యుమెంటరీ సిరీస్‌లో భాగమయిన అందరూ ఈ అప్లికేషన్‌పై స్పందించాలని సీబీఐ స్పెషల్ జడ్జి ఎస్పీ నాయక్ కోరారు. ఫిబ్రవరీ 20న ముంబాయ్ కోర్టులో ఈ కేసుపై హియరింగ్ జరగనుంది. 2012 ఏప్రిల్‌లో షీనా బోరాను కారులోనే ఇంద్రాణి ముఖర్జీ గొంతునులిమి చంపేసిందని, తనకు డ్రైవర్ శ్యాంవర్ రాయ్, మాజీ భర్త సంజయ్ ఖన్నా కూడా సాయం చేశారని పోలీసుల విచారణలో తేలింది. ఆ తర్వాత షీనానే ఇంద్రాణి సొంత కూతురు అనే విషయం బయటపడింది. దీంతో ఈ కేసు ఎన్నో మలుపులు తిరిగింది. అలా ఇండియాలోని ఎన్నో సెన్సేషనల్ క్రైమ్ కేసుల్లో ఇది కూడా ఒకటిగా మారింది.
బెయిల్‌తో బయటికి..
2015లో డ్రైవర్ శ్యాంవర్ రాయ్‌ను వేరే క్రైమ్ కారణంగా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అదే సమయంలో షీనా బోరా హత్య గురించి కూడా అతడు బయటపెట్టాడు. శ్యాంవర్ స్టేట్‌మెంట్ ఆధారంగా 2015 ఆగస్ట్‌లో ఇంద్రాణిని పోలీసులు అరెస్ట్ చేశారు. 2022 మేలో ఇంద్రాణికి బెయిల్ దొరికి జైలు నుండి బయటికి వచ్చింది. ప్రస్తుతం షీనా బోరా మర్డర్ కేసులో నిందితులుగా నిలిచిన శ్యాంవర్ రాయ్, ఇంద్రాణి ముఖర్జీ, పీటర్ ముఖర్జీ, సంజీవ్ ఖన్నా.. అందరూ బెయిల్‌పై బయటే ఉన్నారు. ఈ కేసు ఇంకా క్లోజ్ అవ్వలేదు. అలా క్లోజ్ అవ్వని క్రైమ్ కేసు గురించి డాక్యుమెంటరీ తీసి ప్రేక్షకులకు చూపించడం కరెక్ట్ కాదని కోర్టులో హియరింగ్ వినిపించడానికి సీబీఐ సిద్ధమయ్యింది.
Also Read: మృణాల్‌ను కాదని రుక్మిణి వసంత్‌కు ఛాన్స్ - దర్శకుడు మురుగదాస్ ఎందుకలా చేశారు?