''హీరోలు ఎవరైనా సరే జీవితాంతం గుర్తు పెట్టుకునే సినిమాలు చేయాలంటే ఇద్దరు దర్శకులతో పని చేయాలి. ఒకరు... రాజమౌళి. మరొకరు... మెహర్ రమేష్!'' - 'భోళా శంకర్' విడుదలైన తర్వాత సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా చక్కర్లు కొట్టిన పోస్ట్! ఈ ఒక్కటి చాలు రిజల్ట్ ఏంటో చెప్పడానికి! ఇప్పుడీ సినిమా ఓటీటీలో విడుదలకు రెడీ అయ్యింది. 


ఓటీటీలో 'భోళా శంకర్' విడుదల ఎప్పుడంటే?
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కథానాయకుడిగా మెహర్ రమేష్ దర్శకత్వంలో వచ్చిన సినిమా 'భోళా శంకర్'. ప్రముఖ నిర్మాత అనిల్ సుంకరకు చెందిన ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మించారు. ఆగస్టు 11న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పుడు ఓటీటీలో వీక్షకుల ముందుకు రానుంది. 


'భోళా శంకర్' డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ (Netflix OTT) వేదిక సొంతం చేసుకుంది. ఈ నెల 15 (శుక్రవారం) నుంచి సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు ఆ సంస్థ తెలిపింది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో వీక్షకులకు 'భోళా శంకర్' అందుబాటులో ఉంటుంది.  


ఓటీటీలో 'భోళా శంకర్' చూసే జనాలు ఎక్కువే!
థియేటర్లలో 'భోళా శంకర్' సినిమాకు ఆశించిన ఫలితం రాలేదు. భారీ డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది. అందుకని, ఓటీటీలో ఈ సినిమా కోసం ఎదురు చూసే జనాలు ఎక్కువ మంది ఉన్నారని చెప్పవచ్చు. తమిళంలో అజిత్ హీరోగా నటించిన 'వేదాళం' చిత్రానికి 'భోళా శంకర్' రీమేక్. సుమారు ఎనిమిది ఏళ్ళ క్రితం వచ్చిన సినిమా కావడం, ఆల్రెడీ తెలుగులో ఆ తరహా సినిమాలు రావడంతో కథ ప్రేక్షకులను ఎగ్జైట్ చేయలేదు. దానికి తోడు మెహర్ రమేష్ దర్శకత్వం సైతం ఆకట్టుకునేలా లేకపోవడంతో సినిమా ఫెయిల్ అయ్యింది.


Also Read : 'సున్నా' సెంటిమెంట్ రిపీట్ - గోపీచంద్, శ్రీను వైట్ల సినిమా టైటిల్ అదేనా?


అన్నా చెలెళ్ల సెంటిమెంట్ నేపథ్యంలో 'భోళా శంకర్' రూపొందింది. ఈ సినిమాలో చిరంజీవి చెల్లెలి పాత్రలో మహానటి కీర్తీ సురేష్ నటించారు. ఆమెకు జోడీగా కింగ్ అక్కినేని నాగార్జున మేనల్లుడు, యువ కథానాయకుడు సుశాంత్ కనిపించారు. చిరు, కీర్తీ సురేష్ మధ్య సన్నివేశాలకు స్పందన బావుంది. అయితే... రెగ్యులర్ & రొటీన్ ఫార్ములా తరహా సీన్లు అని పేరు వచ్చింది. 


Also Read తెలుగులో పవన్... తమిళంలో విజయ్... స్టార్ హీరోలతో ఛాన్స్ కొట్టేసిన యంగ్ హీరోయిన్!



'భోళా శంకర్'లో చిరంజీవికి జోడీగా మిల్కీ బ్యూటీ తమన్నా నటించారు. ఈ జోడీ ఇంతకు ముందు 'సైరా నరసింహా రెడ్డి'లో కూడా సందడి చేసింది. అయితే, ఆ సినిమాలో చిరు, తమన్నా భాటియా మధ్య పాటలు లేవు. ఈ సినిమాలో అయితే ఏకంగా మిల్కీ బ్యూటీ అంటూ ఓ పాట రూపొందించారు. అయితే... చిరు, తమన్నా జోడీ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది. ఇక... చిరంజీవి, యాంకర్ కమ్ యాక్ట్రెస్ శ్రీముఖి మీద తెరకెక్కించిన 'ఖుషి' నడుము సీన్ విమర్శల పాలైంది. సినిమా రిజల్ట్ మెగా అభిమానులను డిజప్పాయింట్ చేసింది. విడుదల తర్వాత మెహర్ రమేష్ దర్శకత్వం మీద పలు విమర్శలు వచ్చాయి. 





ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial