Best Thriller Movies On OTT: ప్రేమ మనతో ఎంత పని అయినా చేయిస్తుంది. ఈ విషయం ఎన్నో సినిమాల్లో ఎంతో అందంగా చూపించారు దర్శకులు. హీరోయిన్ కోసం హీరో తన బ్యాక్‌గ్రౌండ్‌ను వదులుకోవడం, తనకోసం అన్నీ వదిలేసి రావడం లేదా తనకోసమే సక్సెస్ సాధించడం లాంటివి మనం చూసే ఉంటాం. కానీ ‘ఆమీస్’ అన్నింటికంటే డిఫరెంట్. ఒక పెళ్లయిన అమ్మాయి ప్రేమలో పడి.. ఆ అబ్బాయి ఏం చేశాడు? తన ప్రేమను దక్కించుకోవడానికి ఎంత దూరం వెళ్లాడు? అనేది ‘ఆమీస్’. ఇలాంటి కాన్సెప్ట్‌తో కూడా పలు సినిమాలు వచ్చాయి కదా.. ఇందులో డిఫరెంట్ ఏముంది అని అనుకోవచ్చు. ఇది ఏ రేంజ్‌లో డిఫరెంట్ అని పూర్తిగా కథ వింటేనే అర్థమవుతుంది.


కథ..


సుమన్ (అర్ఘదీప్ బరువా) ఒక పీహెచ్‌డీ స్టూడెంట్. తన స్నేహితులతో కలిసి అడవిలోకి వేటకు వెళ్లడం, వేర్వేరు జీవుల మాంసాన్ని అక్కడే వండుకొని తినడం తనకు ఇష్టం. అలా ఒకరోజు మాంసం తినడం వల్ల తన స్నేహితుడి ఆరోగ్యం దెబ్బతింటుంది. తన స్నేహితుడి కోసం డాక్టర్‌ను వెతకడానికి వెళ్తాడు. దగ్గర్లో ఒక క్లినిక్ కనిపిస్తుంది. అదే డాక్టర్ నిర్మాలి (లిమా దాస్) క్లినిక్. ఆరోజు సెలవు అని, తాను పేషెంట్స్‌ను చూడలేనని చెప్పినా.. సుమన్ ఆమెను రిక్వెస్ట్ చేసి తన స్నేహితుడి దగ్గరకు తీసుకెళ్తాడు. అతడికి ట్రీట్మెంట్ అందించిన తర్వాత ఇద్దరు కలిసి వెనక్కి వస్తుండగా.. సుమన్ తనకు జంతువుల మాంసం తినే అలవాటు గురించి నిర్మాలికి చెప్తాడు. తనకు కూడా మాంసం అంటే ఇష్టమని నిర్మాలి చెప్తుంది. దీంతో మరుసటి రోజు తనకు కుందేలు మాంసాన్ని తానే స్వయంగా వండి తీసుకొస్తాడు సుమన్.


అప్పటికే నిర్మాలికి పెళ్లయ్యి, ఒక బాబు ఉంటాడు. తన భర్త డాక్టర్ అయినా కూడా ఎక్కువగా క్యాంప్‌లకు వెళ్తుండడంతో వారిద్దరి మధ్య దూరం పెరుగుతుంది. మరోవైపు నిర్మాలికి దూరంగా ఉండాలని.. సుమన్ స్నేహితుడు ఇలియాస్ (సాగర్ సౌరభ్) తనకు చెప్తాడు. అయినా మాంసం మీద ఇష్టం సుమన్, నిర్మాలిని దగ్గర చేస్తుంది. వాళ్లిద్దరూ వేర్వేరు ప్రాంతాలకు వెళ్తూ వేర్వేరు జంతువుల మాంసాలను ట్రై చేస్తుంటారు. నిర్మాలి మీద విపరీతమైన ఇష్టం పెంచుకున్న సుమన్.. తన స్నేహితుడు ఇలియాస్ సాయంతో తన తొడలోని చిన్న భాగాన్ని కట్ చేసి, దానిని వండి నిర్మాలికి తినిపిస్తాడు. అది తనకు విపరీతంగా నచ్చుతుంది. మెల్లగా మనిషి మాంసానికి అలవాటు పడుతుంది. అలా అలవాటు పడిన నిర్మాలి ఏం చేసింది? తనకోసం సుమన్ ఏం చేశాడు? అనేది తెరపై చూడాల్సిన కథ.



అలాంటివి లేవు..


మనుషుల మాంసం తినే కథలతో ఇప్పటివరకు ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ ‘ఆమీస్’ వాటికి చాలా భిన్నం. ఆ సినిమాల్లో రక్తాన్ని, మాంసాన్ని భయంకరంగా చూపిస్తూ ప్రేక్షకులను భయపెడతారు మేకర్స్. ‘ఆమీస్’లో అలాంటిది ఏమీ ఉండదు. ప్రేమించిన అమ్మాయి ఇష్టం కోసం హీరో ఎంత దూరం వెళ్లాడు అనేది చాలా బాగా చూపించాడు దర్శకుడు భాస్కర్ హజారికా. 2019లో విడుదలయిన ‘ఆమీస్’. ఇండియన్ సినిమాల్లో మోస్ట్ డిస్టర్బింగ్ మూవీ కేటగిరిలో ఒకటిగా నిలిచిపోయింది. ముఖ్యంగా ఈ సినిమా కథ మొత్తం లీమా దాస్, అర్ఘదీప్ చుట్టూనే తిరుగుతుంది. వీరిద్దరి నటన చాలా నేచురల్‌గా అనిపిస్తుంది. సోనీ లివ్‌లో అస్సామీస్ భాషతో పాటు హిందీ డబ్బింగ్ వెర్షన్‌లో కూడా ‘ఆమీస్’ అందుబాటులో ఉంది.



Also Read: ఓర్నీ, చిన్న కారణానికే హత్య? ట్విస్టులతో పిచ్చెక్కిస్తున్న భావన లేటెస్ట్ థ్రిల్లర్