Best War TV Shows | ‘యుద్ధం’ విపత్తు కంటే ప్రమాదకరం. ఒక్కసారి మొదలైందంటే సంవత్సరాలపాటు సాగుతూనే ఉంటుంది. యుద్ధంలో గెలుపు, ఓటములు తర్వాతి విషయం. యుద్ధం వస్తే జనజీవనం అస్తవ్యస్తం అవుతుంది. ధన, ప్రాణ నష్టమే కాదు.. ఆ ప్రభావం కొన్నేళ్లపాటు వెంటాడుతుంది. మానసికంగా కుంగదీస్తుంది. ఇప్పుడు ఉక్రేయిన్ ఎదుర్కొంటున్న దుర్భర పరిస్థితిని చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది. అందుకే యుద్ధం రాకూడదని కోరుకోవాలి. యుద్ధ సమయంలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయనేది కొన్ని వెబ్‌సీరిస్‌లు, సినిమాల్లో ఇప్పటికే చూపించారు. మీరు వాటిని ఇంకా చూడనట్లయితే వీటిపై ఓ లుక్కేయండి. యుద్ధ సమయంలో సైనికులు ఎదుర్కొనే భావోద్వేగాలు, సంఘర్షణ, రాజనీతి, గూడచారులు పడే కష్టాలు, రణరంగంలో ఎదురయ్యే సవాళ్లు, శరీరాలను చిధ్రం చేసే బాంబుల మధ్య జవాన్ల పోరాటం.. ఇలా ఎన్నో తెలుసుకోవచ్చు. ఓటీటీల్లో ఇప్పటికే ఎన్నో సినిమా, వెబ్‌సీరిస్‌లు అందుబాటులో ఉన్నాయి. యుద్ధం గురించి స్పష్టంగా తెలుసుకోవాలంటే వెబ్ సీరిస్‌లను చూడటమే బెటర్. కాబట్టి.. ఇక్కడ మీకు కొన్ని బెస్ట్ వార్ వెబ్‌సీరిస్‌ల జాబితాను అందిస్తున్నాం. వాటిలో మీకు నచ్చిన వెబ్‌సీరిస్ చూడండి. తప్పకుండా ఈ ఇవి మిమ్మల్ని ఆకట్టుకుంటాయి. 


1. Jack Ryan (జాక్ ర్యాన్): జాక్ ర్యాన్ అనే CIA ఏజెంట్ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ప్రతి ఎపిసోడ్ చాలా ఉత్కంఠభరితంగా ఉంటుంది. తీవ్రవాదుల చర్యలను అడ్డుకోడానికి జాక్ ర్యాన్ ఏం చేస్తాడనేది ఈ సీరిస్‌లో చూపించారు. ఈ వెబ్‌సీరిస్‌ను రెండు సీజన్స్‌గా విడుదల చేశారు. మీరు దీన్ని మిస్ అయినట్లయితే తప్పకుండా చూడండి. అమేజాన్ ప్రైమ్ వీడియోలో ఇది స్ట్రీమ్ అవుతోంది. (OTT: Amazon Prime Video)



2. The Last Ship (ది లాస్ట్ షిప్): ఇది బెస్ట్ మిలటరీ వెబ్ సీరిస్. అమేజాన్ ప్రైమ్‌లో మొత్తం 6 సీజన్లు అందుబాటులో ఉన్నాయి. ఓ వైరస్ వల్ల ప్రపంచంలో కోట్లాది మంది ప్రజలు చనిపోతారు. ఆ వైరస్‌కు మూలం కనుగోవడం కోసం అమెరికా నావికాదళం సాయంతో పరిశోధనలు జరుగుతాయి. ఈ క్రమంలో వారికి ఏం తెలుస్తుంది? అది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందనేది ఈ టీవీ షోలో ఆసక్తికరంగా చూపించారు. (OTT: Amazon Prime Video)



3. The Pacific (ది పసిఫిక్): ప్రపంచ యుద్ధం సమయంలో అమెరికా సైన్యం ఎదుర్కొన్న సవాళ్లతో ఉత్కంఠభరితంగా ఈ వెబ్‌సీరిస్‌ను తెరకెక్కించారు. ‘ది పసిఫిక్’ వెబ్‌సీరిస్ ‘డిస్నీ ప్లస్ హాట్‌స్టార్’లో అందుబాటులో ఉంది. (OTT: Disney + Hotstar)



4. Wolf (వోల్ఫ్): ఈ వెబ్‌సీరిస్ మొదటి నుంచి చివరికి వరకు సీట్ ఎడ్జ్‌ను కూర్చోబెడుతుంది. ఇది టర్కిష్ వెబ్‌సీరిస్. మీరు దీన్ని ఇంగ్లీష్‌లో చూడవచ్చు. భయానకమైన తీవ్రవాద దాడి నేపథ్యంలో సైన్యం గందరగోళ పరిస్థితులు ఎదురవ్వుతాయి. అవన్నీ ఎదుర్కొంటూ స్పెషల్ టాస్క్‌ఫోర్స్ ఏ విధంగా శత్రువులను ఎదుర్కొందనేది కథ. ఇది ‘నెట్‌ఫ్లిక్స్’లో అందుబాటులో ఉంది. (OTT: Netflix)



5. The Man In The High Castle (ది మ్యాన్ ఇన్ ది హై కాసిల్): మంచి రివ్యూలను పొందిన వెబ్‌సీరిస్ ఇది. ఈ సీరిస్ మిమ్మల్ని కట్టిపడేస్తుందనడంలో సందేహం లేదు. ప్రపంచ యుద్ధం తర్వాతి పరిస్థితులు మిమ్మల్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్, జర్మనీ దేశాలు గెలిచి, అమెరికాను పాలిస్తే ఎలా ఉంటుందనే ఊహాతీత కథనంతో దీన్ని తెరకెక్కించారు. ఇది చాలా కొత్తగా ఆసక్తికరంగా సాగుతుంది. ఇది బెస్ట్ సైన్స్ ఫిక్షన్ సిరీస్‌ కూడా. కాబట్టి, మీరు దీన్ని ఎలాంటి సందేహం లేకుండా చూసేయొచ్చు. (OTT: Amazon Prime Video)



6. The Forgotten Army (ది ఫర్గాటెన్ ఆర్మీ): ఇది మన భారతీయ చిత్రమని సగర్వంగా చెప్పుకోవాలి. అయితే, దీన్ని ఏ మాత్రం తక్కువ చేయొద్దు. ఇది వాస్తవ ఘటనల ఆధారంగా, దేశం గుర్తించని వీర జవాన్లు, స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను మన కళ్ల ముందు ఉంచే మంచి వెబ్‌సీరిస్. దీన్ని మీరు చూడలేదంటే, గొప్ప ఫీల్‌ను దూరం చేసుకున్నట్లే. దేశాన్ని బ్రిటీష్ పాలకుల చెర నుంచి విడిపించేందుకు 1942లో భారత స్వాతంత్ర్య సమరయోధులు, జపాన్ బలగాలు కలిసి ‘ఆజాద్ హింద్ ఫౌజ్’ ఏర్పాటు చేశారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆధ్వర్యంలో సింగపూర్‌ నుంచి 3,884 కిమీలు ప్రయాణించి ఢిల్లీకి ప్రయాణమవుతారు. ఈ సందర్భంగా వారు ఎదుర్కొన్న పరిస్థితులు ఏమిటనేది ఈ వెబ్‌సీరిస్‌లో కళ్లకు కట్టినట్లు చూపించారు. చివర్లో భావోద్వేగ సన్నివేశాలు గుండె బరువెక్కిస్తాయి. (OTT: Amazon Prime Video)



7. 1962 The War In The Hills (1962 ది వార్ ఇన్ ది హిల్స్): ఇది కూడా భారతీయ వెబ్‌సీరిస్. 1962 చైనా-భారత యుద్ధం స్ఫూర్తితో ఈ వెబ్‌సీరిస్‌ను తెరకెక్కించారు.  ఇందులో అభయ్ డియోల్, సుమీత్ వ్యాస్, రోహన్ గండోత్రా, మహి గిల్, ఆకాష్ థోసర్ ప్రధాన పాత్రలు పోషించారు.  గాల్వాన్ వ్యాలీ, రెజాంగ్ లాలో జరిగిన వాస్తావిక అంశాలకు కాల్పనిక కథనాన్ని జోడించి చిత్రీకరించారు. (OTT: Disney + Hotstar)



Also Read: రొమాన్సే కాదు, అంతకు మించి - ఈ వెబ్‌ సీరిస్‌లు పెద్దలకు మాత్రమే, పిల్లలతో చూడొద్దు!


8.  Avrodh (అవ్రోద్): అమిత్ సాద్ ప్రధాన పాత్రలో నటించిన ‘అవ్రోద్’ వెబ్‌సీరిస్‌ను.. 2016 ఉరి(Uri) సర్జికల్ స్ట్రైక్ ఆధారంగా తెరకెక్కించారు. ఈ మిలిటరీ డ్రామా మొత్తం 9 ఎపిసోడ్స్ ఉంటుంది. ఉరి ఘటనపై ఇప్పటికే సినిమా విడుదలైన సంగతి తెలిసిందే. అయితే, సర్జికల్ స్ట్రైక్ గురించి మరింత లోతుగా తెలుసుకోవాలంటే.. ఈ సీరిస్‌ను చూడాల్సిందే. (OTT: Sony Liv)



Also Read: బాక్స్ నిండా మనుషుల తలలు, నగలనుకుని ఎత్తుకెళ్లిన దొంగలు - ఇంతకీ అవి ఎవరి తలలు?