సత్తిగాని రెండెకరాలు వెబ్ ఫిల్మ్, అంతకు ముందు 'న్యూసెన్స్' వెబ్ సిరీస్... గత నెలలో బ్యాక్ టు బ్యాక్ రెండు ఎంటర్టైనర్స్ వీక్షకులకు అందించింది 'ఆహా' ఓటీటీ. 'తెలుగు ఇండియన్ ఐడల్' అయితే డిజిటల్ స్క్రీన్లకు వీక్షకులకు అతుక్కుపోయి మరీ చూసేలా చేసింది. ఎప్పటికప్పుడు సరికొత్త వినోదాన్ని వీక్షకులకు అందించే 'ఆహా' ఓటీటీ... ఇప్పుడు ఓ కార్పొరేట్ కంపెనీ, అందులో ఉద్యోగుల నేపథ్యంలో కొత్త వెబ్ సిరీస్ తీసుకొస్తోంది.  


అర్థమైందా అరుణ్ కుమార్?
హ‌ర్షిత్ రెడ్డి (Harshith Reddy), అనన్య శ‌ర్మ‌, తేజ‌స్వి మాదివాడ (Tejaswi Madivada) ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన ఆహా ఒరిజినల్ వెబ్ సిరీస్ 'అర్థమైందా అరుణ్ కుమార్'. దీనికి జోనాథన్ ఎడ్వర్డ్స్ దర్శకత్వం వహించారు. ఈ సిరీస్ కంటే ముందు ఆయన ఓ సినిమా తీశారు. అదే 'అమరం అఖిలం ప్రేమ'. ఆ సినిమా కూడా ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. 


ఆరె స్టూడియోస్‌, లాఫింగ్ కౌ ప్రొడ‌క్ష‌న్స్ సంస్థలు 'అర్థమైందా అరుణ్ కుమార్' వెబ్ సిరీస్‌ రూపొందించాయి. ఇందులో హర్షిత్ రెడ్డి ఫస్ట్ లుక్ విడుదల చేశారు. అది చూస్తే... అందులో లాప్ టాప్ మీద 'ఒక కార్పొరేట్ స్లేవ్ (బానిస) కథ' అని ఉంటుంది. ఆఫీసులో హర్షిత్ రెడ్డి తన ఫ్రస్ట్రేషన్ చూపిస్తున్నట్లు అర్థం అవుతోంది. 


అరుణ్ కుమార్ కథ ఏమిటి?
'అర్థమైందా అరుణ్ కుమార్' వెబ్ సిరీస్ (Arthamainda Arun Kumar Web Series) లో అరుణ్ కుమార్ మందా అనే యువకుడిగా హర్షిత్ రెడ్డి నటిస్తున్నారు. అతని జీవితంలో ఏం జరిగింది? అనేది సిరీస్. అనన్య శర్మ, తేజస్వి మాదివాడ పాత్రలు ఏమిటన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. కథలోకి వెళితే...    


ఏపీలోని అమ‌లాపురం అరుణ్ కుమార్ స్వస్థలం. తమ ఊరిలో, చిన్న పట్టణంలో అతని జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. జీవితంలో ఏదైనా సాధించాల‌నే కోరిక‌తో సిటీకి వస్తాడు. ఇంట‌ర్న్‌షిఫ్ ఉద్యోగిగా కార్పొరేట్ ప్ర‌పంచంలోకి అడుగు పెడ‌తాడు. అయితే అక్కడ ఇంగ్లీష్ భాష‌లో చేసే సంభాష‌ణ‌లు, ఆఫీసులోని రాజ‌కీయాలు, కొంత మంది బెదిరింపుల‌కు పాల్ప‌డ‌టం, ఓ ప‌ద్ధ‌తి లేకుండా ప్ర‌ప‌వ‌ర్తించ‌టం... ఇవ‌న్నీ అరుణ్ కుమార్ ఎదుర్కొంటాడు. తోటి ఉద్యోగులే అతడిని చులకన చేస్తారు. అటువంటి ఒకానొక సంద‌ర్భంలో 'నా విలువ ఏంటి?' అని అరుణ్ కుమార్ తనను తాను ప్ర‌శ్నించుకుంటాడు. ఆ తర్వాత త‌న చుట్టూ ఉన్న ప‌రిస్థితుల‌పై అవ‌గాహ‌న రావ‌ట‌మే కాకుండా త‌న‌ లాంటి వ్య‌క్తికి అక్క‌డ విలువ‌లేద‌ని గ్ర‌హిస్తాడు. అయితే, త‌ను చేయాల్సిన లక్ష్యాన్ని గుర్తు చేసుకుని త‌న‌లోని నిరాశ‌ను దూరం పెడ‌తాడు. ప‌ట్టుద‌ల‌తో త‌ను సాధించాల్సిన విజయంపై మ‌న‌సు ల‌గ్నం పెడ‌తాడు. అంతిమంగా ఎలా విజ‌యం సాధించాడు? అనేది వెబ్ సిరీస్ కథాంశం.


Also Read తిరుమలలో కృతికి ఆ ముద్దులేంటి? కౌగిలించుకోవడం ఏమిటి? వివాదాస్పదంగా మారిన 'ఆదిపురుష్' దర్శకుడి ప్రవర్తన    


''కార్పొరేట్ ఉద్యోగుల జీవితాలు, వారి ప్ర‌యాణంలో ఎదురయ్యే సాధక బాధకాలు, క‌ల‌ల‌ను సాకారం చేసుకునే క్ర‌మంలో ఎదుర‌య్యే ఇబ్బందులు, సాధించే విజ‌యాలు వంటి వాటిని ఈ సిరీస్‌లో మ‌నం చూడొచ్చు'' అని 'ఆహా' వర్గాలు తెలిపారు. త్వరలో సిరీస్ స్ట్రీమింగ్ తేదీని వెల్లడిస్తామని పేర్కొన్నారు.


Also Read టాలీవుడ్ చరిత్రలోనే తొలిసారి - బాలకృష్ణ సినిమా టైటిల్ ఆవిష్కరణకు భారీ ప్లాన్