తిరుమల శ్రీవారి (Tirumala Venkateswara Temple)ని ఈ రోజు (జూన్ 7వ తేదీ) ఉదయం 'ఆదిపురుష్' చిత్ర బృందం దర్శించుకుంది. చిత్ర దర్శకుడు ఓం రౌత్ (Om Raut), సీతా దేవి పాత్రలో నటించిన కథానాయిక కృతి సనన్ (Kriti Sanon) ఏడు కొండల వెంకటేశ్వర స్వామి వారి అర్చన సేవలో పాల్గొన్నారు. స్వామి వారి పాదాల చెంత మంగళవారం సాయంత్రం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిన విషయం తెలిసిందే. నేడు ఉదయమే స్వామి వారి ఆశీస్సుల కోసం దర్శకుడు, హీరోయిన్ ఇతరులు వచ్చారు. 


దేవాలయ ఆవరణలో కౌగిలింత... 
కృతి చెంపపై ఆ ముద్దు ఏమిటి?
స్వామి వారి దర్శనం అనంతరం ఆలయం బయటకు వచ్చిన తర్వాత దర్శకుడు ఓం రౌత్ ప్రవర్తించిన తీరు వివాదస్పదంగా మారింది. దర్శనం పూర్తి చేసుకుని కారులో వెళ్లబోతున్న కృతి సనన్ వెళ్ళడానికి సిద్ధమైన సమయంలో... ఆమె దగ్గరకు ఓం రౌత్ మళ్ళీ వచ్చారు. టాటా చెప్పారు. అక్కడి వరకు ఒకే. అయితే... కృతిని హగ్ చేసుకున్న ఓం రౌత్, ఆమె చెంపపై ముద్దు (పెక్) పెట్టారు. 'గాడ్ బ్లెస్ యూ' (దేవుడు నిన్ను చల్లగా చూడాలి) అంటూ ఓ ఫ్లయింగ్ కిస్ ఇచ్చారు. స్వామి వారి భక్తులకు ఆది కోపాన్ని తెప్పిస్తోంది. 


చిత్రసీమలో పెక్, ఫ్లయింగ్ కిస్ ఇస్తూ టాటా బైబై చెప్పడం చాలా కామన్. సినిమా ఇండస్ట్రీ కల్చర్ అది. ఈ సంస్కృతి పాశ్చాత్య దేశాల్లో సర్వ సాధారణం. కానీ, తిరుమల లాంటి పవిత్ర పుణ్య క్షేత్రంలో స్వామి వారి దర్శనం చేసుకున్న తర్వాత ఆలయం బయట ఇలా ముద్దు పెట్టుకోవటాలు, ఆలింగనాలు లాంటివి సరైన పద్ధతి కాదంటూ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 


రామాయణం ఆధారంగా 'ఆదిపురుష్' తీసిన ఓం రౌత్ ఉద్దేశపూర్వకంగా  ఆ పని చేసి ఉండకపోవచ్చు. ఆయనకు భక్తి శ్రద్ధలు ఎక్కువే. అయితే, తిరుమల క్షేత్రంలో ఆ విధంగా చేయడం భక్తుల ఆగ్రహానికి గురి అవుతోంది. దీనిపై ఆయన స్పందించాలని కొందరు కోరుతున్నారు.


Also Read : యుద్ధమే చేశాడు - ఓం రౌత్‌ను వెనకేసుకొచ్చిన ప్రభాస్


ఇక, 'ఆదిపురుష్' సినిమా విషయానికి వస్తే... 'తానాజీ' వంటి హిట్ తర్వాత ఓం రౌత్ దర్శకత్వం వహించిన చిత్రమిది. శ్రీరామ చంద్ర మూర్తి పాత్రలో పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ నటించడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఇందులో లక్ష్మణుడిగా సన్నీ సింగ్, హనుమంతునిగా దేవదత్తా నాగే, రావణ బ్రహ్మ లంకేశుడి పాత్రలో సైఫ్ అలీ ఖాన్ నటించారు. జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా త్రీడీలో ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా. 


ఆంధ్రప్రదేశ్, తెలంగాణ... రెండు రాష్ట్రాల 'ఆదిపురుష్' థియేట్రికల్ హక్కులను రూ. 170 కోట్లకు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ తీసుకుందని తెలిసింది. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రూపొందుతున్న సినిమాను ఆ సంస్థ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. 'అర్జున్ రెడ్డి' ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించనున్న 'స్పిరిట్' తెలుగు రాష్ట్రాల హక్కులను సైతం పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీకి ఇచ్చేలా ఒప్పందం జరిగిందట.


Also Read : ప్రభాస్ తనలో రాముడిని బయటకు తెచ్చారు, నేటితరానికి ఈ మూవీ అవసరం: చిన్న జీయర్ స్వామి