‘ఆదిపురుష్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ మంగళవారం తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర యూనివర్శిటీ మైదానంలో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ కోసం భారీ సెట్, తెరలను ఏర్పాటు చేయడమే కాదు.. లైవ్ షోలు కూడా ఏర్పాటు చేశారు. మొదట్లో వర్షం నిర్వాహకులను కలవరపెట్టింది. అయితే, కార్యక్రమం మొదలైనసరికి వాతావరణం కూడా సహకరించింది. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ కార్యక్రమానికి చిన్న జీయర్ స్వామి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం ‘ఆదిపురుష్’ మూవీ గురించి మాట్లాడుతూ.. చిత్రయూనిట్‌పై ప్రశంసల వర్షం కురిపించారు.
ప్రతి మనిషిలో రాముడు ఉంటాడు, ప్రభాస్ తనలోని రాముడిని బయటకు తెచ్చాడు: చిన్న జీయర్
ఈ సందర్భంగా చిన్న జీయర్ స్వామి మాట్లాడుతూ.. ‘‘ప్రతి వ్యక్తిలో రాముడు ఉన్నాడు. ప్రతి ఒక్కరి గుండెల్లో రాముడు ఉన్నాడు. ఆ గుండెల్లో ఉన్న రాముడిని అందరి నుంచి బయటకు తీసుకురావడానికి.. ప్రభాస్ తనలో నుంచి రాముడిని బయటకు తీసుకొస్తున్నారు. మానవ జాతికి మార్గం చూపించాల్సినవాడు శ్రీరాముడే. రాముడు ఈ మట్టి మీద నడిచి పావనం చేసినటువంటి మహాపురుషుడు. మానవ జాతికి ఆదర్శవంతమైన పురుషుడు. రాముడిని దేవుడిగా కొలిచేవారు ఉన్నారు. కానీ, రామాయణంలో దేవతలంతా వచ్చి ‘రామా నువ్వు సాక్షాత్తు నారాయణుడివి. సీతా దేవి లక్ష్మీ’ అని చెబితే. ‘నేను మానవుడిని.. నన్ను మనిషిగానే చూడాలి’ అని అనుకుంటున్నా అని రాముడు చెప్పారు. ఎందుకంటే రాముడు దేవుడు అనగానే. ‘దేవుడికేం లేండి ఏమైనా చేస్తాడు. అని మానవులు తప్పించుకొనే ప్రమాదం ఉంది. ఒక మనిషి ఒక మార్గాన్ని నడిచి ఆదర్శాన్ని స్థాపించాడంటే.. ఏ మనిషైనా దాన్ని పాటిస్తాడని నిరూపించేందుకు రాముడు మానవుడు అయ్యాడు. రామాయణంలో రామ చంద్రుడు మంచి మనిషి. ఆయన పుట్టక ముందు విష్ణువు, అవతారం చాలించిన తర్వాత విష్ణువు. కానీ, జీవన సమయంలో తాను మనిషిగా ప్రవర్తించాడు. ఎందుకంటే మనిషి మనిషిలా ఉంటే దేవతలు కూడా అతని వెంట నడుస్తారు. దేవతలు మంచి మనిషి వెనుక నడుస్తారు. ఆ మంచి మనిషికి సమాజం ఆలయాలు కట్టి ఆదర్శం చేసుకుంటుంది. ఇది రామాయణం జాతికి నిరూపించింది. మంచి మనిషి ఎలా ఉంటాడు? అనేది దేవతలు, మనుషులు చెప్పలేదు. రాక్షసుడి వంటి మారీచుడు చెప్పాడు. మానవుడంటే మనిషి మంచికి నిలువెత్తు రూపం. మనిషి మనిషిలా ఉంటే అతనికి శత్రువులే ఉండరు. రాముడిని జంతువులు, మనుషులు, దేవతులు, రాక్షసులు, ముక్కు చెవులు కోసిన సుర్పణక కూడా.. రాముడిని కీర్తించింది. ఇదీ మంచి మనిషంటే. తనలో ఉన్నటువంటి రాముడిని పైకి తెస్తున్నాడు ప్రభాస్. రామాయణంలో ప్రధాన కథను చరిత్రగా లోకానికి అందించాలనే ఆశతో చేస్తున్నామని చెప్పారు. ఇంతకంటే మహోపకారం మరొకటి ఉండదు. అలాంటి మంచి పనులు చేసే వ్యక్తులను మరిన్ని మంచి పనులు చేసేందుకు.. ఏడు కొండల స్వామి అనుగ్రహం ఆయనకు ఉండాలని, శక్తి ఇవ్వాలని, ఓం రౌత్‌కు ఈ ఉత్సాహం కలిగించినందుకు వారికి ఆశీస్సులు అందిస్తున్నా. ఇప్పటి తరానికి రాముడు కావాలి. ఈ తరానికి టెక్నాలజీతో రాముడు కావాలి. అది ఈ సినిమా ద్వారా అందిస్తున్నారు’’ అని పేర్కొన్నారు. ఈ తరానికి, ఈ దేశానికి, ప్రపంచానికి శ్రీరాముడి గురించి తెలిపేందుకు ఈ మూవీ చాలా అవసరం అని తెలిపారు.
Also Read: ‘ఆదిపురుష్’ ఫైనల్ ట్రైలర్ - బీకర యుద్ధంలో కదంతొక్కిన రామసేన!