'ఆదిపురుష్' (Adipurush Movie) విషయంలో ప్రభాస్ అభిమానులకు (Prabhas Fans) కంప్లైంట్స్ ఏవైనా ఉన్నాయంటే... అవి చిత్ర దర్శకుడు ఓం రౌత్ (Om Raut) మీద మాత్రమే! ఫస్ట్ టీజర్ విడుదల తర్వాత వచ్చిన ట్రోల్స్ అన్నీ ఇన్నీ కావు. దానికి తోడు అయోధ్యలో 'ఓం... యు ఆర్ కమింగ్ టు మై రూమ్' (ఓం... నువ్వు నా రూమ్ కు వస్తున్నావ్) అని ప్రభాస్ కాస్త కోపంగా పిలిచిన వీడియో వైరల్ అయ్యింది. అప్పటి వరకు ప్రభాస్ టీజర్ చూడలేదని, ఓం రౌత్ మీద నమ్మకం పెట్టుకుంటే డిజప్పాయింట్ చేశాడని సోషల్ మీడియాలో ఫ్యాన్స్ విరుచుకుని పడ్డారు. 


'ఆదిపురుష్' టీజర్ విషయంలో తప్పంతా దర్శకుడు ఓంది మాత్రమే అన్నట్టు చాలా పోస్టులు కనిపించాయి. కట్ చేస్తే... ఫస్ట్ ట్రైలర్ తర్వాత విమర్శలు కాస్త తగ్గాయి. పాటలు విడుదలైన తర్వాత మెల్లగా అంచనాలు పెరిగాయి. థియేట్రికల్ ట్రైలర్ చూస్తే మరింత బావుందని అభిమానులే చెబుతున్నారు. దీని క్రెడిట్ అంతా దర్శకుడికి ఇచ్చారు ప్రభాస్. 


'ఆదిపురుష్' ప్రీ రిలీజ్ వేడుకలో దర్శకుడిని ప్రభాస్ వెనకేసుకొచ్చారు. ఫస్ట్ ట్రైలర్ అభిమానులకు చూపిస్తానని ఓం రౌత్ చెప్పాడని, వాళ్ళకే ముందు చూపిస్తానని ఓం హైదరాబాద్ వచ్చి మరీ ట్రైలర్ స్పెషల్ స్క్రీనింగ్ వేశారని పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ తెలిపారు. అభిమానులు ఇచ్చిన ప్రోత్సాహంతో ఎనిమిది నెలలు దర్శకుడు ఓం రౌత్, అతని బృందం యుద్ధం చేశారని ప్రభాస్ చెప్పుకొచ్చారు. 


20 ఏళ్ళల్లో ఇటువంటి దర్శకుడిని చూడలేదు!
తన 20 ఏళ్ళ కెరీర్ లో ఓం రౌత్ లాంటి దర్శకుడు ఎవడినీ చూడలేదని ప్రభాస్ వ్యాఖ్యానించడం విశేషం. గత ఏడెనిమిది నెలలుగా ప్రతిరోజూ నిద్ర లేకుండా పని చేశారని ఆయన చెప్పారు. రోజుకు రెండు మూడు గంటలు మాత్రమే నిద్ర పోయారని, కుటుంబాలకు టైమ్ లేకుండా ఒక్కొక్కరూ పది రేట్లు పని చేశారని ఆయన చెప్పారు. గడిచిన ఎనిమిది నెలలు ఓం రౌత్ అండ్ టీమ్ ఒక యుద్ధం చేశారని, ఒక్కసారి వాళ్ళ ముఖాలు చూడమని ప్రభాస్ వ్యాఖ్యానించారు. ఓం రౌత్ రాక్ స్టార్ అని కాంప్లిమెంట్ ఇచ్చారు. ఇకనైనా ఫ్యాన్స్ ఓం రౌత్ మీద విమర్శలు చేయడం ఆపేయాలి మరి!


Also Read : ‘ఆదిపురుష్’ ఫైనల్ ట్రైలర్ - భీకర యుద్ధంలో కదంతొక్కిన రామసేన!


ఆదిపురుష్'లో సీతా దేవిగా కృతి సనన్ నటించారు. లక్ష్మణుడి పాత్రను సన్నీ సింగ్, హనుమంతుని పాత్రను దేవదత్తా నాగే పోషించారు. లంకేశుడి పాత్రలో సైఫ్ అలీ ఖాన్ నటించారు. జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా త్రీడీలో ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా. తొలి రోజు వసూళ్ల రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 


ఆంధ్రప్రదేశ్, తెలంగాణ... రెండు రాష్ట్రాల 'ఆదిపురుష్' థియేట్రికల్ హక్కులను రూ. 170 కోట్లకు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ తీసుకుందని తెలిసింది. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రూపొందుతున్న సినిమాను ఆ సంస్థ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. 'అర్జున్ రెడ్డి' ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించనున్న 'స్పిరిట్' తెలుగు రాష్ట్రాల హక్కులను సైతం పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీకి ఇచ్చేలా ఒప్పందం జరిగిందట. 


Also Read : ప్రభాస్ తనలో రాముడిని బయటకు తెచ్చారు, నేటితరానికి ఈ మూవీ అవసరం: చిన్న జీయర్ స్వామి