టాలీవుడ్ యంగ్ హీరో నవదీప్ నటించింది తక్కువ సినిమాలే అయినా తన నటనతో తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరయ్యారు. నవదీప్ ఈ మధ్య సినిమాలు కంటే వెబ్ సిరీస్ లలోనే ఎక్కువగా కనిపిస్తున్నారు. తాజాగా ఆయన నటించిన కొత్త వెబ్ సిరీస్ ‘న్యూసెన్స్’ టీజర్ విడుదల అయింది. ఈ సిరీస్ ఆహా ఓటీటీ వేదికపై స్ట్రీమింగ్ కానుంది. గతంలో ఈ వెబ్ సిరీస్ కు సంబంధించిన ఫస్ట్ లుక్ ను ఆయన పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసింది ఆహా టీమ్. 


తాజాగా విడుదల అయిన టీజర్ కు మంచి స్పందన వస్తోంది. ఈ టీజర్ లో నవదీప్ డిఫరెంట్ మ్యానరిజంలో కనిపిస్తున్నారు. పీరియాడిక్ డ్రామా గా తెరకెక్కుతోన్న ఈ సిరీస్ టీజర్ ఆకట్టుకుంటోంది. మదనపల్లిలో 2003 ఆ ప్రాంతంలో జరిగిన ఓ కథను ఇందులో చూపించనున్నట్లు తెలుస్తోంది. టీజర్ లో ఓ రాజకీయ పార్టీ మీటింగ్ జరుగుతున్న సమయంలో నవదీప్ క్యారెక్టర్ ఎంట్రీ చూపించారు. ఆ మీటింగ్ లో రాజకీయ నాయకుడు మాట్లాడుతుండగా నవదీప్ వెనక్కి తిరిగి సైగ చేస్తాడు. ఇంతలో ఓ వ్యక్తి ఆ నాయకుడిపై చెప్పువిసురుతాడు. అప్పుడు సభ అంతా గందరగోళంగా మారుతుంది. ఆ సమయంలో హీరోయిన్ బిందు మాధవి కూడా అక్కడే ఉండి నవదీప్ ను చూస్తుంది. దీంతో టీజర్ ముగుస్తుంది. నవదీప్ ఆ నాయకుడి పై చెప్పు విసిరేలా ఎందుకు చేశారు. ఇందులో ఆయన క్యారెక్టర్ ఎలాంటింది. అసలు అతను నిజమైన జర్నలిస్టేనా వంటి అంశాలన్నీ తెలియాలంటే సిరీస్ వచ్చే వరకూ వేచి చూడాల్సిందే. టీజర్ చూస్తే కాస్త ఇంట్రస్టింగ్ గానే అనిపిస్తుంది. మరి ఈ వెబ్ సిరీస్ తో నవదీప్ ఎలాంటి సక్సెస్ అందుకుంటారో చూడాలి.
 
ఇక యంగ్ హీరో నవదీప్ 2004 లో ‘జై’ సినిమాతో ఇండస్ట్రీకి హీరోగా పరిచయం అయ్యారు. ఈ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తర్వాత వరుసగా సినిమా అవకాశాలు వచ్చాయి. తెలుగుతో పాటు ఎక్కువగా తమిళ సినిమాలకు కూడా పని చేశారు నవదీప్. ‘ఆర్య 2’ తర్వాత నవదీప్ కు చెప్పుకోదగ్గ సినిమా ఏమీ రాలేదు. అయితే సినిమా అవకాశాలు మాత్రం వస్తూనే ఉన్నాయి. హీరోగానే కాకుండా కథకు బలం ఉన్న సహాయక పాత్రలను కూడా చేస్తున్నారు నవదీప్. అంతేకాకుండా వరుసగా వెబ్ సిరీస్ లలో నటిస్తున్నారు. ఆయన నటించిన పలు వెబ్ సిరీస్ లు మంచి గుర్తింపు తెచ్చుకున్నాయి కూడా. 


ఇక ఈ ‘న్యూసెన్స్’ వెబ్ సిరీస్ కు శ్రీప్రవీణ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరి నిర్మిస్తోంది. గతంలో ఈ నిర్మాణ సంస్థ ఆహా తో కలసి ‘కుడి ఎడమైతే’ అనే వెబ్ సిరీస్ ను రూపొందించింది. తాజాగా ‘న్యూసెన్స్’ వెబ్ సిరీస్ కోసం ఈ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, ఆహా ఓటీటీ కలసి పనిచేస్తున్నాయి. గతంలో నవదీప్ ఆహా తో కలసి ‘మస్తీ’ అనే వెబ్ సిరీస్ లో కూడా నటించారు. తర్వాత మళ్లీ ఈ కొత్త వెబ్ సిరీస్ కోసం పనిచేస్తున్నారు. త్వరలో ఆహా ఫ్లాట్ ఫార్మ్ పై ‘న్యూసెన్స్’ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. రిలీజ్ డేట్ ఇంకా ప్రకటించాల్సి ఉంది.


Read Also: ‘సలార్’కు శృతిహాసన్ గుడ్ బై - ఆధ్య ఎమోషనల్ పోస్టు