100 శాతం తెలుగు కంటెంట్ తో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించడానికి డిజిటల్ వరల్డ్ లో అడుగుపెట్టిన ప్రాంతీయ ఓటీటీ 'ఆహా'. ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్ ను అందిస్తూ, అనతి కాలంలోనే విశేష ఆదరణ దక్కించుకుంది. బ్లాక్ బస్టర్ చిత్రాలు, ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీసులు, డబ్బింగ్ చిత్రాలతో పాటుగా స్పెషల్ షోలను స్ట్రీమింగ్ చేస్తూ వ్యూయర్ షిప్ పెంచుకుంటూ వెళ్తోంది. దిగ్గజ ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్స్ కు ధీటుగా దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో ‘సర్వం శక్తిమయం’ అనే వెబ్ సిరీస్‌ ను స్ట్రీమింగ్ చేయడానికి రెడీ అవుతోంది. 


ప్రియమణి, సంజయ్ సూరి ప్రధాన పాత్రల్లో రూపొందిన వెబ్ సిరీస్‌ ‘సర్వం శక్తిమయం’. 'భక్తితో ముక్తి' అనేది దీనికి ఉపశీర్షిక. 'అన్ స్టాపబుల్ విత్ NBK' టాక్ షోకు క్రియేటివ్ ప్రొడ్యూసర్ అయిన దర్శక రచయిత బివిఎస్ రవి ఈ సిరీస్ కు కథ అందించడంతో పాటు క్రియేటర్ గా వ్యవహరించారు. '47 డేస్' ఫేమ్ ప్రదీప్ మద్దాలి దర్శకత్వం వహించగా.. 'నిశబ్దం' ఫేమ్ హేమంత్ మధుకర్ క్రియేటివ్ కన్సల్టెంట్ గా వర్క్ చేసారు. అంకిత్, విజయ్ చాడ, కౌముది కే నేమాని ఈ ప్రాజెక్ట్‌ని సంయుక్తంగా నిర్మించారు. తాజాగా ఈ వెబ్ సిరీస్‌కు సంబంధించిన రిలీజ్ డేట్‌ ను మేకర్స్ ప్రకటించారు.


దసరా కానుకగా అక్టోబర్ 20వ తేదీ నుంచి ఆహా ఓటీటీలో ‘సర్వం శక్తిమయం’ వెబ్ సిరీస్  స్ట్రీమింగ్ కాబోతోందని అధికారికంగా వెల్లడించారు. ''పరాశక్తి పర్వదినాలు ప్రవేశిస్తున్న వేళ.. ఆహా అందిస్తోంది అష్ఠాదశ పీఠాల దివ్యదర్శన మేళా! ఒక పవిత్రమైన భక్తి కథ చెప్పబోతున్నాం'' అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రిలీజ్ డేట్‌అనౌన్స్ మెంట్ పోస్టర్ ను లాంచ్ చేసారు. ప్రియమణితో పాటుగా మిగతా ప్రధాన పాత్రధారులందరూ కనిపిస్తున్న ఈ పోస్టర్ దైవత్వాన్ని ప్రతిభింభించేలా డిజైన్ చేయబడింది. 


Also Read: బాలయ్య కొత్త పేరు బయటపెట్టిన 'భగవంత్ కేసరి' భామ!






‘సర్వం శక్తిమయం’ వెబ్ సిరీస్ కథంతా అష్టాదశ శక్తి పీఠాల చుట్టూ తిరుగుతుందని యూనిట్ చెబుతోంది. ఒక వ్యక్తి  తన సమస్యల పరిష్కారం కోసం కుటుంబంతో కలిసి అన్ని  శక్తి పీఠాలు దర్శించుకునే క్రమంలో ఏర్పడిన పరిస్థితులు, దేవుడి మీద కలిగిన నమ్మకం, అతనిలో వచ్చిన మార్పుల చుట్టూ కథనం నడుస్తుంది. మరోవైపు ఒక నాస్తికుడు ఆస్తికుడైయ్యే ప్రయాణంగా సనాతన ధర్మం గురించి చర్చగా కూడా కథ సాగుతుంది. మొత్తం పది ఎసిసోడ్‌లుగా ఈ వెబ్ సిరీస్‌ అందుబాటులోకి రానుంది. ఈ ప్రాజెక్టులో ప్రియమణి, సంజయ్ సూరిలతో పాటుగా.. సమీర్ సోని, సుబ్బరాజు, అభయ్ సింహా, అశ్లేష ఠాకూర్, కుషితా కల్లాపు తదితరులు ఇతర ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.


దసరా శరన్నవరాత్రుల ఉత్సవాల్లో అమ్మవారి దర్శనం జరుగుతుందని, అదే సమయంలో ఓటీటీలో అష్టాదశక్తి పీఠాల మహత్యం చెప్పే ‘సర్వం శక్తిమయం’ వెబ్ సిరీస్ ప్రసారం అవుతుందని మేకర్స్ పేర్కొన్నారు. ఈ సిరీస్ ద్వారా మొత్తం భారతదేశంలోని 17 శక్తి పీఠాలతో పాటు శ్రీలంకలోని శక్తి పీఠాన్ని కూడా దర్శనం చేసుకోవచ్చని చెబుతున్నారు. విజయ దశమికి ఈ వెబ్ సిరీస్‌ ఓటీటీలోనూ పండుగ వాతావరణాన్ని తీసుకొస్తుందని అంటున్నారు. ఆహా ఓటీటీ వేదికగా రాబోతున్న ఈ సిరీస్ ఎలాంటి ఆదరణ దక్కించుకుంటుందో చూడాలి.


Also Read: 'బలగం' వేణు బాటలో మరో కమెడియన్, దిల్ రాజు మరో ప్రయోగం?


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial