కామెడీతో వెండి తెర మీద నవ్వులు పూయించిన ఎంతో మంది హాస్యనటులు.. హీరోలుగా మారి ఆడియన్స్ ను అలరించారు. వారిలో మెగా ఫోన్ పట్టుకొని డైరెక్టర్లుగా మారిన కమెడియన్స్ కూడా ఉన్నారు. వెన్నెల కిషోర్ నుంచి వేణు ఎల్దండి వరకు పలువురు యాక్టర్స్.. కథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం అంటూ తమలోని మరో కోణాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేసారు. కాకపోతే వారిలో సక్సెస్ అయిన వాళ్ళు చాలా తక్కువ మందే ఉన్నారు. అయితే ఇప్పుడు కమెడియన్ ధన్ రాజ్ కూడా డైరెక్టర్ గా మారబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.


'జై' సినిమాలో చిన్న పాత్రలో నటించిన ధనరాజ్.. 'జగడం' చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్నాడు. అప్పటి నుంచి వరుసగా సినిమాలు చేస్తూ, తన మార్క్ కామెడీ టైమింగ్ తో టాలీవుడ్ లో కమెడియన్ గా స్థిరపడిపోయారు. 'జబర్దస్త్' 'అదిరింది' కామెడీ షోలలోనూ నవ్వులు పూయించాడు. తెలుగు 'బిగ్ బాస్' సీజన్ 1లో పార్టిసిఫేట్ చేసి పాపులారిటీ పెంచుకున్నాడు. ఆ తర్వాత హీరోగా మారిన ధనరాజ్.. 'బుజ్జీ ఇలారా' సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. అలానే ప్రొడ్యూసర్ గా మారి రెండు మూడు సినిమాలు నిర్మించాడు. ఈ క్రమంలో ఇప్పుడు డైరెక్టర్ అవతారమెత్తబోతున్నట్లు తెలుస్తోంది. 


కమెడియన్ వేణును దర్శకుడిగా పరిచయం చేసిన అగ్ర నిర్మాత దిల్ రాజు, ధనరాజ్ ను డైరెక్టర్ గా లాంచ్ చేయబోతున్నారట. ధనరాజ్ చెప్పిన కథ నచ్చడంతో తన హోమ్ బ్యానర్ లో డైరెక్షన్ ఛాన్స్ ఇవ్వడానికి రెడీ అయ్యారట. అంతేకాదు ఈ ప్రాజెక్ట్ కోసం ఏకంగా సముద్రఖని లాంటి నేషనల్ అవార్డు విన్నింగ్ యాక్టర్ ను ఒప్పించారట. దసరా పండుగ సందర్భంగా ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించడమే కాదు, అక్టోబర్ 22న పూజా కార్యక్రమాలతో ప్రారంభిస్తున్నట్లుగా సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. 


Also Read: ‘టైగర్‌ నాగేశ్వరరావు’కి రవితేజ ఫస్ట్ ఛాయిస్ కాదా?.. 'స్టూవర్ట్ పురం దొంగ' ఏమైపోయాడు?


ఎన్నో ఏళ్లుగా కమెడియన్ గా సినిమాలు చేస్తున్న వేణుని 'బలగం' మూవీతో డైరెక్టర్ గా పరిచయం చేసారు దిల్ రాజు. తెలంగాణ పల్లె నేపథ్యంలో తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. కలెక్షన్లతో పాటుగా ఎన్నో అవార్డులు రివార్డులు సొంతం చేసుకుంది. దీంతో కమెడియన్ వేణులో ఇంత మంచి దర్శకుడు ఉన్నాడా? అందరూ ఆశ్చర్యపోయారు. ఇప్పుడు వేణు బాటలోనే అతని స్నేహితుడు ధనరాజ్ కూడా దర్శకత్వ బాధ్యతలు చేపట్టడానికి రెడీ అయ్యారని తెలుస్తోంది. దిల్ రాజు, సముద్రఖని లాంటి ప్రముఖులను ఒప్పించారంటే, కచ్చితంగా మంచి కంటెంట్ తోనే వస్తున్నారని భావించవచ్చనే అభిప్రాయాలు ఫిలిం సర్కిల్స్ లో వ్యక్తం అవుతున్నాయి. 


స్టార్ కమెడియన్ వెన్నెల కిషోర్ కూడా గతంలో డైరెక్టర్ గా మారి సినిమాలు తెరకెక్కించారు. మొదటి ప్రయత్నంగా ‘వెన్నెల 1 1/2’ సినిమా తీసి ప్లాప్ అందుకున్నాడు. ఆ తర్వాత కామెడీ కింగ్ బ్రహ్మానందంతో 'జఫ్ఫా' అనే మూవీ రూపొందించి మరోసారి నిరాశ పరిచాడు. ఇటీవల యువ నటుడు అభయ్ బేతిగంటి (నవీన్ కుమార్ బేతిగంటి) కూడా 'రామన్న యూత్' అనే సినిమాతో డైరెక్టర్ గా నిరూపించుకునేందుకు ప్రయత్నించాడు. అలానే వేణు స్పూర్తితో జబర్దస్త్ కమెడియన్ శాంతి కుమార్ 'నాతో నేను' చిత్రంతో మెగా ఫోన్ పట్టుకున్నాడు. కానీ వీరెవరూ కూడా వేణు మాదిరిగా సక్సెస్ కాలేకపోయారు. మరి ఇప్పుడు ధనరాజ్ డైరెక్టర్ గా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో వేచి చూడాలి.


Also Read: బాలయ్య కొత్త పేరు బయటపెట్టిన 'భగవంత్ కేసరి' భామ!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial