బాలీవుడ్ అగ్ర హీరో షారుక్ ఖాన్​కి గత కొద్ది రోజుల నుంచి హత్య బెదిరింపులు ఎక్కువయ్యాయి. ఆయన్ని చంపేస్తామంటూ ముంబైలోని ఆయన నివాసానికి కొన్ని లేఖలు కూడా రావడం జరిగింది. దీంతో షారుక్ ముంబై పోలీసులను ఆశ్రయించగా ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకొని షారుక్ ఖాన్​కి Y+ భద్రతను కేటాయించింది. ఈ ఏడాది షారుఖ్ ఖాన్ నటించిన 'పఠాన్', 'జవాన్' వంటి సినిమాలు రూ.1000 కోట్ల కలెక్షన్స్​తో బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించాయి. ఈ రెండు సినిమాలతో షారుక్ ఖాన్ పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోయింది. అయితే ఈ రెండు సినిమాల సక్సెస్ తర్వాత షారుక్​కి బెదిరింపులు కూడా ఎక్కువైపోయాయి.


ఆయన్ని చంపేస్తామని ముంబైలో ఆయన నివాసం మన్నథ్ రెసిడెన్సీకి పలు లేఖలు వచ్చాయి. దీంతో షారుఖ్ ఖాన్ ముంబై పోలీసులను ఆశ్రయించారు. తనకు వస్తున్న బెదిరింపు కాల్స్ దృష్ట్యా మరింత భద్రత కల్పించాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం ముందుస్తు జాగ్రత్త చర్యలను తీసుకుంది. షారుక్ కల్పించిన భద్రతను మరింత పెంచింది. ఆ భద్రతను Y+ కేటగిరీగా మారుస్తూ ప్రకటన చేసింది. ఈ మేరకు మహారాష్ట్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేస్తూ ఆరుగురు వ్యక్తిగత భద్రత సిబ్బందిని నియమించింది. వాళ్లు మూడు షిఫ్ట్స్​లో ఆయనకు భద్రత కల్పించబోతున్నారు.


ఈ భద్రతకు సంబంధించిన ఖర్చును షారుక్ ఖాన్ చెల్లించబోతున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ Y+ ప్లస్ భద్రతలో ఆరుగురు పోలీసు కమాండోలు, MP-5 మిషన్ గన్లు AK- 47 అసాల్ట్ రైఫిల్స్, గ్లాక్ పిస్టల్స్ వంటి ఆయుధాలతో పోలీసులు షారుక్ ఖాన్​కి అంగరక్షకులుగా ఉంటారు. Y+ భద్రతలో మొత్తం 11 మంది రక్షణగా ఉంటారు. ఇందులో ముగ్గురు లేదా నలుగురు కమాండోలు ఉంటారు. వీరు 24 గంటల పాటు రక్షణ కల్పించి పోయే వ్యక్తికి కాపలాగా ఉంటారు. మూడు షిఫ్టుల్లో పని చేస్తారు. దీనికోసం నెలకు 15 లక్షల రూపాయల వరకు ఖర్చవుతుంది. ఇక నుంచి షారుక్ ఖాన్ ఎక్కడికి వెళ్లినా ఈ వై ప్లస్ సెక్యూరిటీతోనే వెళ్తారు. వీళ్లతో పాటు లోకల్ పోలీసులు కూడా షారుఖ్​కి భద్రత ఏర్పాట్లు చేస్తారు.


షారుక్ ఖాన్ నటించిన 'జవాన్' చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.1100 కోట్ల వసూళ్లను అందుకొని వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్​ని షేక్ చేసింది. అట్లీ డైరెక్ట్ చేసిన ఈ మూవీ నార్త్, సౌత్ అని తేడా లేకుండా అన్నిచోట్ల బ్లాక్ బస్టర్ టాక్​ని సొంతం చేసుకుంది. దాదాపు రూ.300 కోట్ల భారీ బడ్జెట్​తో రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్​పై షారుక్ భార్య గౌరీ ఖాన్ నిర్మించిన ఈ చిత్రం బాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్స్​లో ఒకటిగా నిలిచింది. దీనికంటే ముందు షారుక్ నటించిన 'పఠాన్' కూడా బాక్సాఫీస్ వద్ద సుమారు రూ.1000 కోట్లకు పైగా కలెక్షన్స్​ని అందుకోవడం విశేషం. చాలా ఏళ్లుగా హిట్టు లేక సతమతమవుతున్న షారుక్​కి 'పఠాన్', 'జవాన్' వంటి సినిమాలు భారీ కం బ్యాక్ ఇవ్వడంతో ఇప్పుడు అదే జోష్​తో రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో 'డంకీ' సినిమా చేస్తున్నారు. డిసెంబర్ 22న ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్ ముందుకు రాబోతోంది.


Also Read : చైతూ, సమంత ప్యాచ్ అప్ అయ్యారా? ఇన్​స్టాలో పోస్ట్​కి అర్థం అదేనా?


Join Us on Telegram: https://t.me/abpdesamofficial