Naveen Chandra's 28 Degrees Celsius OTT Streaming On ETV Win And Amazon Prime Video: మూవీ లవర్స్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించే హారర్, కామెడీ, థ్రిల్లర్, రొమాంటిక్ మూవీస్, సిరీస్‌లనే ప్రస్తుతం ప్రముఖ ఓటీటీలన్నీ అందుబాటులోకి తెస్తున్నాయి. ఇటీవల రిలీజ్ అయిన రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ '28 డిగ్రీస్ సెల్సియస్' (28 Degrees Celsius) మరో ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది.


రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్


యంగ్ హీరో నవీన్ చంద్ర (Naveen Chandra) హీరోగా నటించిన '28 డిగ్రీస్ సెల్సియస్' ఏప్రిల్ 4న ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండానే నెల లోపే సడెన్‌గా ప్రముఖ ఓటీటీ 'అమెజాన్ ప్రైమ్ వీడియో'లో (Amazon Prime Video) అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు తాజాగా మరో తెలుగు ఓటీటీ 'ఈటీవీ విన్'లోనూ (ETV Win) స్ట్రీమింగ్ అవుతోంది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో అధికారికంగా వెల్లడించింది.






Also Read: 'పెళ్లిచూపులు' హీరోయిన్ తెలుగు రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్ - ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా?


ఈ మూవీకి 'పొలిమేర' సిరీస్ చిత్రాల ఫేం డాక్టర్ అనిల్ విశ్వనాథ్ తెరకెక్కించగా.. నవీన్ చంద్ర సరసన హీరోయిన్ షాలిని నటించారు. వీరితో పాటే ప్రియదర్శి, వైవా హర్ష, రాజా రవీంద్ర, జయప్రకాశ్ కీలకపాత్రలు పోషించారు. సాయి అభిషేక్ నిర్మాతగా వ్యవహరించగా.. శ్రవణ్ భరద్వాజ్, శ్రీచరణ్ పాకాల మ్యూజిక్ అందించారు.


స్టోరీ ఏంటంటే?


కార్తీక్ (నవీన్ చంద్ర) మెడిసిన్ చదువుతున్న సమయంలోనే అంజలి (షాలిని)తో పరిచయం ఏర్పడి ప్రేమగా మారుతుంది. ఇద్దరూ పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవాలని అనుకోగా.. కార్తీక్ అనాథ కావడంతో అంజలి పేరెంట్స్ అంగీకరించరు. దీంతో పెద్దల్ని ఎదిరించి కార్తిక్‌ను పెళ్లి చేసుకుంటుంది అంజలి. అయితే, పెళ్లి తర్వాత ఆమెకు బాడీ టెంపరేచర్‌కు సంబంధించి అనారోగ్య సమస్య తలెత్తుతుంది. టెంపరేచర్ 28 డిగ్రీల సెల్సియస్ వద్ద మాత్రమే ఆమె బాగుంటుంది. అంతకంటే పెరిగినా.. తగ్గినా.. కాసేపటికే చనిపోతుంది.


దీంతో అంజలిని ట్రీట్మెంట్ కోసం జార్జియా తీసుకెళ్తాడు కార్తిక్. ఇద్దరూ ఒకే హాస్పిటల్‌లో పని చేస్తూ ఆమె చికిత్స తీసుకుంటుంది. అయితే, కార్తిక్ ఓ రోజు ఇంటికి వచ్చేసరికి అనుకోకుండా ఆమె చనిపోయి ఉంటుంది. దీంతో డిప్రెషన్‌లోకి వెళ్లిన కార్తిక్ మద్యానికి బానిసై ఆమె జ్ఞాపకాల్లో బతుకుతుంటాడు. కానీ అంజలి ఆత్మ కార్తిక్‌ను వెంటాడుతుంది అనేలా కొన్ని సంఘటనలు ఆ ఇంట్లో జరుగుతాయి. వీటిని చూసిన కార్తిక్ షాక్ అవుతాడు. అసలు అంజలి ఎలా చనిపోయింది?, ఆ తర్వాత ఆ ఇంట్లో జరిగిన పరిణామాలేంటి?, కార్తిక్ మళ్లీ మామూలు మనిషి అవుతాడా? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.