దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన సినిమా ‘ఆర్ఆర్ఆర్’. ఈ సినిమా గతేడాది మార్చి లో విడుదల అయి ప్రపంచవ్యాప్తంగా ఎంతటి విజయాన్ని సొంతం చేసుకుందో అందరికీ తెలుసిందే. దీంతో ఈ సినిమాకు ప్రశంసలతో పాటు అవార్డుల పంట కూడా పండింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ గోల్డెన్ గ్లోబ్ సహా మరెన్నో ఇంటర్నేషనల్ అవార్డులను అందుకుంది. దీంతో ఈ మూవీ ఆస్కార్ కు నామినేట్ అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ ఈ మూవీలో ‘నాటు నాటు’ పాట ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ నామినేషన్ కు ఎంపికైంది. ఈ పాటకు ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి స్వరాలందించారు. గేయ రచయిత చంద్రబోస్ లిరిక్స్ అందించారు. రాహుల్ సిప్లిగంజ్, కీరవాణి, కాల భైరవ ఆలపించారు. ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ చేశారు. ఈ నేపథ్యంలో ఆస్కార్ వేదికపై ఈ పాటను ప్రదర్శించడానికి కీరవాణి తో పాటు రచయిత చంద్రబోస్ కు కూడా ఆహ్వానం అందినట్టు తెలుస్తోంది.
ఇక ఈ ప్రతిష్టాత్మక అవార్డుల కార్యక్రమంలో కీరవాణి ఆస్కార్ వేదిక పై లైవ్ పర్ఫార్మెన్స్ ఇవ్వనున్నట్లు సమాచారం. అయితే ఇలా ఆస్కార్ వేదికలపై లైవ్ పర్ఫామెన్స్ ఇవ్వడం ఇదేమీ మొదటిసారి కాదు. గతంలో కూడా ఏ ఆర్ రెహమాన్ ‘జై హో’ పాటను ఇలాగే లైవ్ పర్ఫామెన్స్ ఇచ్చారు. అయితే ఈసారి కీరవాణి ఆస్కార్ వేదికపై లైవ్ పర్ఫామెన్స్ ఇవ్వనున్నారనే వార్తలు రావడంతో ఆసక్తి నెలకొంది. కొంతమంది మాత్రం పాట పాడిన సింగర్, డాన్స్ కంపోజర్ లకు కూడా ఇందులో భాగం ఉంది కదా వాళ్లనెందుకు ఆహ్వానించలేదు? ఎప్పుడూ కీరవాణి కుటుంబమే స్టేజి మీద కనబడుతుంది అంటూ నెట్టింట కామెంట్లు చేస్తున్నారు. గతంలో గోల్డెన్ గ్లోబ్ పురస్కార సమయంలో కూడా ఈ కామెంట్లు వచ్చాయి. మళ్లీ ఇప్పుడు ఆస్కార్ ఆహ్వాన సమయంలో ఆ వ్యాఖ్యలు తెరపైకి వస్తున్నాయి. మరి ఇందులో మున్ముందు ఎలాంటి మార్పులు వస్తాయో చూడాలి. ఇక ఈ కార్యక్రమానికి ఆర్ఆర్ఆర్ దర్శకుడు రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లు కూడా హాజరుకానున్నారని తెలుస్తోంది. వీరంతా ఓ వారం రోజుల ముందుగానే ఈ కార్యక్రమానికి వెళ్లనున్నట్లు తెలుస్తోంది.
ఈ మూవీలో బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా రామ్ చరణ్, ఎన్టీఆర్ కలసి చేసిన యాక్షన్ సీన్స్ ప్రేక్షకులను థియేటర్లకు కట్టిపడేసాయనే చెప్పాలి. చరణ్, తారక్ నటనకు వందశాతం మార్కులు పడ్డాయి. ఇక ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ చరణ్ సరసన సీత పాత్రలో ఆలియా భట్ నటించగా.. తారక్ సరసన ఒలివియా మోరిస్ నటించింది. అలాగే మూవీలో అజయ్ దేవగణ్, శ్రియ ప్రత్యేక పాత్రల్లో కనిపించారు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రానికి ఎం ఎం కీరవాణి సంగీతాన్ని అందించారు. గతేడాది మార్చి 25 న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి సినిమా యావత్ ప్రపంచవ్యాప్తంగా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా ఒకేసారి విడుదలైంది.
Read Also: ఆరంభం అదిరింది - బ్లాక్ బస్టర్లతో మొదలైన 2023, బాలీవుడ్‌కూ మంచి రోజులు!