సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ‘ఆదిపురుష్’ సినిమా జూన్ 16 థియేటర్లలోకి వచ్చింది. రామాయణ ఇతిహాసం ఆధారంగా రూపొందిన ఈ చిత్రంలో ప్రభాస్ రాఘవుడిగా నటించగా, కృతిసనన్  జానకి పాత్రలో కనిపించింది. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే అత్యధిక బడ్జెట్( రూ.500 కోట్ల)తో ఓం రౌత్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. దేశ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు మైథలాజికల్ ఫిల్మ్ 'ఆదిపురుష్'పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. అయితే, ఈ చిత్రం తొలి షో నుంచి మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. అంతేకాదు, చాలా మంది ఈ సినిమా కథపై తీవ్ర అభ్యంతంరం తెలిపారు. రామాయణాన్ని పూర్తి స్థాయిలో వక్రీకరించారనే విమర్శలు వచ్చాయి. కేవలం వీఎఫ్ఎక్స్‌ తో సినిమాను ముందుకు నడిపించే ప్రయత్నం చేశారనే టాక్ వచ్చింది.  రావణుడి వేషధారణపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. 10 తలలను అమర్చిన విధానం, కళ్లకు సుర్మా పెట్టడంపై పలువురు మండిపడ్డారు. ఈ సినిమాలో గ్రాఫిక్స్, వీఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్ అస్సలు బాగాలేవని, కొన్ని చోట్ల కేవలం కార్టూన్ సీన్లు చూసినట్లు ఉందని విమర్శించారు. సినిమాపై సర్వత్రా విమర్శలు వస్తున్న నేపథ్యంలో ‘ఆదిపురుష్’ సినిమా కథ రచయిత మనోజ్ ముంతశిర్ శుక్లా స్పందించారు. విమర్శలకు కొంత మేర సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు.


‘ఆదిపురుష్’పై రచయిత మనోజ్ ఆసక్తికర వివరణ


తాము తీసింది రామాయణం కాదని, రామయణం స్ఫూర్తిగా తీసుకుని రూపొందించామని మనోజ్ తెలిపారు. “’ఆదిపురుష్’ సినిమాను రామాయణం అని మేము చెప్పలేదు. రామాయణంగా తీయలేదు. కేవలం, మేము రామాయణాన్ని స్ఫూర్తిగా తీసుకుని రూపొందించాం. ఈ విషయాన్ని మేము సినిమా డిస్ క్లైమర్ లో కూడా వేశాం. రామాయణంలో జరిగే ఒక భాగాన్ని ఆధారంగా తీసుకుని ‘ఆదిపురుష్’ సినిమాను తెరకెక్కించాం. ఈ విషయాన్ని పలుమార్లు చెప్పాం. మరోసారి గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నాను. ప్రస్తుతం ఉన్న మార్కెట్ కు అనుగుణంగానే ఈ సినిమాను తీశాం. అంతేకానీ, మేం తీసింది సంపూర్ణ రామాయణం కాదు. ఈ విషయాన్ని ప్రేక్షకులు గుర్తుంచుకోవాలి” అని వివరించారు.


దర్శకుడు అలా, రచయిత ఇలా!


ప్రస్తుతం మనోజ్ ఇచ్చిన వివరణకు పూర్తి విరుద్ధంగా ఆ సినిమా దర్శకుడు ఓం రౌత్ గతంలో కామెంట్స్ చేశారు. రామాయణం ఇతిహాసం ఆధారంగా మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు చెప్పారు. అప్పుడు దర్శకుడు అలా చెప్పాడు, ఇప్పుడు రచయిత ఇలా చెప్తున్నాడు అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.    


'ఆదిపురుష్' సినిమాను రెట్రో ఫైల్స్ సమర్పణలో టి సిరీస్ బ్యానర్ పై భూషణ్ కుమార్ నిర్మించారు. సుమారు రూ.550 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ ప్రతిష్టాత్మక చిత్రం రూపొందింది.  తెలుగుతో పాటూ హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో రూపొందించారు. అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ సొంతం చేసుకుంది.   


Read Also: కషాయం పేరుతో విషం ప్రయోగం, జేడీ చక్రవర్తి హత్యకు కుట్ర!