SSMB28: మహేష్ బాబు హీరోయిన్ - త్రివిక్రమ్ ఆలోచన మారలేదట!
సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల 'సర్కారు వారి పాట' సినిమాతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఇప్పుడు త్రివిక్రమ్ సినిమా కోసం సిద్ధమవుతున్నారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. ఈ సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్ గా తీసుకున్నట్లు ప్రకటించారు. అయితే ఈ మధ్యాకాలంలో ఆమెకి వరుసగా ప్లాప్స్ పడుతున్నాయి. 'బీస్ట్', 'రాధేశ్యామ్', 'ఆచార్య' ఇలా బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్స్ లో నటించింది పూజ.
దీంతో దర్శకనిర్మాతలు ఆమెకి అవకాశాలు ఇవ్వడానికి భయపడుతున్నారని వార్తలొస్తున్నాయి. మహేష్ బాబు సినిమా నుంచి కూడా ఆమెని తప్పించినట్లు ప్రచారం జరుగుతోంది. ఆమెకి బదులుగా మరో స్టార్ హీరోయిన్ ను రంగంలోకి దింపుతున్నట్లు వార్తలు చక్కర్లు కొట్టాయి. కానీ అందులో నిజం లేదని తెలుస్తోంది. దర్శకుడు త్రివిక్రమ్ హీరోయిన్ విషయంలో తన ఆలోచన మార్చుకోలేదట.
నిజానికి గురూజీ సినిమాలతోనే పూజాహెగ్డేకి స్టార్ డం వచ్చింది. 'అరవింద సమేత', 'అల వైకుంఠపురములో' ఇలా ఆయన డైరెక్ట్ చేసిన సినిమాల్లో పూజానే హీరోయిన్ గా తీసుకున్నారు. ఈ సినిమా సూపర్ హిట్స్ కావడంతో పూజా రేంజ్ పెరిగిపోయింది. ఇప్పుడు ఆమెకి ప్లాప్స్ పడుతున్నాయని కాబట్టి పక్కన పెట్టాలని త్రివిక్రమ్ అనుకోవడం లేదట. దాన్ని బట్టి చూస్తుంటే ఈ సినిమాలో పూజానే హీరోయిన్ అనే విషయం స్పష్టమవుతోంది.
ఇక ఈ సినిమాకి 'అర్జునుడు' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారట. త్రివిక్రమ్ కి 'A' అనే అక్షరం చాలా సెంటిమెంట్. అందుకే ఇప్పుడు మహేష్ బాబుకి కూడా అదే లెటర్ తో మొదలయ్యే టైటిల్ పెట్టాలనుకుంటున్నట్లు సమాచారం. కథకు కూడా 'అర్జునుడు' అనే టైటిల్ యాప్ట్ అవుతుందని భావిస్తున్నారు. ఈ సినిమాకి తమన్ సంగీత దర్శకుడిగా పని చేయనున్నారు. ఈ సినిమా తరువాత మహేష్ బాబు.. రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేయనున్నారు.