Revant Reddy One Year :   తెలంగాణ పీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టి ఏడాది అయింది. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ పదవి చేపట్టక ముందు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చుక్కాని లేని నావలా ఉండేది. ఇప్పుడు పరిస్థితి మారింది. ఏడాది కాలంలో పార్టీ పరిస్థితి క్షేత్రస్థాయిలో ఊపందుకుంది. అయితే ప్రభుత్వ వ్యతిరేకతను పూర్తి స్థాయిలో అందిపుచ్చుకుంటుందా లేదా అన్నదానిపై క్లారిటీ లేదు. పార్టీ పునర్ వైభవానికి అవకాశాలున్నా.. ప్రత్యామ్నాయంగా ఎదిగే పరిస్థితులున్నా  రేవంత్ ఆ స్థాయిలో అందుకోలేకపోతున్నారన్న భావన మాత్రం ఉంది. 


రేవంత్‌తో ఇప్పటికీ కలవని సీనియర్లు !


తనకు పీసీసీ చీఫ్ పదవి ఇవ్వగానే వెంటనే బాధ్యతలు చేపట్టలేదు. ముందుగా సీనియర్లను కలుపుకుని వెళ్లే ప్రయత్నం రేవంత్ చేశారు. అందరి ఇళ్లకు వెళ్లి కలిశారు. కానీ సీనియర్ నేతలు మాత్రం నమ్మలేదు.  ఈ మధ్యలో ఈగో సమస్యలు వచ్చాయి.   సీనియర్లకు తెలియకుండా కార్యక్రమాలు నిర్వహించడంతో అంతర్గత విభేదాలు బయటకు వచ్చాయి.  ఆ తర్వాత హుజురాబాద్​ ఉపఎన్నిక కూడా రేవంత్​ వ్యతిరేకవర్గానికి కలిసి వచ్చింది. ఈ ఉప ఎన్నిక ఫలితాలు రేవంత్​ ను ఇరకాటంలో పడేశాయి. ఇలా ఏదో ఓ సందర్భంలో టీపీసీసీ చీఫ్​ పై వ్యతిరేక వెల్లడవుతూనే ఉంది. ఆఖరుకు రాహుల్​ గాంధీ రాష్ట్రానికి వచ్చినప్పుడు కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి సవాల్​ కు దిగారు. సన్నాహాక సమావేశాలు తమ జిల్లాల్లో వద్దంటూ అల్టిమేటం ఇచ్చినా.. రేవంత్​ మాత్రం నిర్వహించి తీరారు. ఏడాది గడిచినా.. రేవంత్​ పై వ్యతిరేక వర్గం పెరుగుతున్నట్లే మారింది. తాజాగా ఎర్రశేఖర్‌ను పార్టీలో చేర్చుకోవడంపై కోమటిరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. 


తీరిక లేకుండా పార్టీ కార్యక్రమాలు !
 


టీపీసీసీ చీఫ్​ గా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచే రేవంత్​ రెడ్డి దూకుడు మరింత పెంచారు. వరుస నిరసనలకు ప్రాధాన్యతనిచ్చారు. రైతు సమస్యలను అందిపుచ్చుకున్నారు. రాష్ట్రంలో పలు అంశాలపై రేవంత్​ చేపట్టిన నిరసనలు, ఇతర పార్టీల్లో ఉన్న వారితో పాటుగా పార్టీని విడిచి వెళ్లిన వారిని తీసుకురావడం కోసం చేసిన ప్రయత్నాలు కొన్ని ఫలించాయి. మరోవైపు డిజిటల్​ సభ్యత్వంలో దేశంలోనే రాష్ట్రాన్ని నెంబర్​ వన్​ గా నిలిపారు. రైతు యాత్ర, రచ్చబండ ఇలా రకరకాల కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్తూనే ఉన్నారు. 


వరుసగా చేరికలు !


రేవంత్​ నేతృత్వంలోనే కొంతమంది కీలక నేతలు పార్టీలో చేరారు.  ఇంకా చాలా మంది చేరుతారన్నప్రచారం జరుగుతోంది. ఈ కారణంగా కాంగ్రెస్‌లో రేవంత్ వర్గం అంటూ ఒకటి ప్రచారంలోకి వచ్చింది. ఇటీవల పలు సెగ్మెంట్ల నుంచి ఇతర పార్టీల నేతలను తీసుకురావడంతో పాత వర్గం ఆగ్రహంతో ఉంటోంది.  ఇప్పుడు గెలవడం కాంగ్రెస్ కు మాత్రమే కాదు రేవంత్ రెడ్డికి కూడా చాలా అవసరం. అందుకే చావో రేవో అన్నట్లుగా పోటీ పడుతున్నారు. ఈ క్రమంలో ఆయన తొలి ఏడాది హుషారుగానే నడిపించారు..  మరో ఏడాది గడిచేలోపు ఎన్నికలు కూడా పూర్తయిపోతాయి. అంటే ఇంకా ఎక్కువ సమయం లేదు.  అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్​ మాత్రం చాలా ఆశలు పెట్టుకున్నాయి. మరోవైపు రాష్ట్రాన్ని బీజేపీ జాతీయ నాయకత్వం టార్గెట్​ చేసింది. అందుకే రేవంత్ ఇప్పటి వరకూ చేసినదానికన్నా రెండింతలు చేస్తేనే కాంగ్రెస్‌కు పూర్వ వైభవం లభించే అవకాశం ఉంది.