'బింబిసార' ముందు వరకూ ఒక లెక్క... 'బింబిసార' తర్వాత మరో లెక్క! కళ్యాణ్ రామ్ మార్కెట్ పెరిగింది. ప్రేక్షకులలో ఆయన ఇమేజ్ పెరిగింది. నందమూరి అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు సైతం ఆయన సినిమా అంటే ఆసక్తి కనబరుస్తున్నారు. వాళ్ళందరికీ ఒక న్యూస్!
నందమూరి కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) కథానాయకుడిగా మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఒక సినిమా నిర్మిస్తోంది. ఆ సినిమాను ఈ ఏడాది ఆఖరి నెలలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. 'బింబిసార' సినిమాతో ఆగస్టులో మంచి విజయం అందుకున్న నందమూరి హీరో... డిసెంబర్‌లో థియేటర్లలో రానున్నారని, మరో హిట్ అందుకోవడానికి రెడీ అవుతున్నారని టాక్.
డిసెంబర్ 2న కళ్యాణ్ రామ్ సినిమా?
మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలో నందమూరి కళ్యాణ్ రామ్ తొలిసారి సినిమా చేశారు. హీరోగా ఆయనకు 19వ చిత్రమిది. అందుకని, NKR 19గా వ్యవహరిస్తున్నారు. కళ్యాణ్ రామ్ పుట్టినరోజు సందర్భంగా ప్రీ లుక్ పోస్టర్ విడుదల చేశారు. అది చూస్తే... స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్ అని అర్థం అవుతోంది. 'బింబిసార' సినిమాకు కంప్లీట్ అపోజిట్ జానర్ అండ్ థీమ్ అన్నమాట. ఈ సినిమాను డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి సన్నాహాలు చేస్తున్నారని టాక్.
Also Read : రామ్‌తో గౌతమ్ మీనన్ సినిమా - నాగ చైతన్య అడిగితే ఆ సినిమాకు సీక్వెల్
కళ్యాణ్ రామ్ 19వ చిత్రానికి చిత్రానికి రాజేంద్ర రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలో ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మిగతా వివరాలు అప్పుడు వెల్లడించనున్నారు. భారీ నిర్మాణ వ్యయంతో ఈ సినిమా రూపొందుతోందని సమాచారం. 'బింబిసార' తర్వాత కళ్యాణ్ రామ్ మరో విజయం అందుకోవడం ఖాయం అని తెలుస్తోంది.
'బింబిసార 2' పనులు మొదలు!
'బింబిసార' విడుదలకు ముందే సీక్వెల్ ఉంటుందని నందమూరి కళ్యాణ్ రామ్ ప్రకటించారు. ఇటు విమర్శకులు, అటు ప్రేక్షకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు... బాక్సాఫీస్ దగ్గర సినిమా భారీ విజయం సాధించడంతో రెట్టించిన ఉత్సాహంతో సీక్వెల్ తీయడానికి రెడీ అవుతున్నారు. 'బింబిసార 2' (Bimbisara 2) లో దేవదత్తుడు, హీరోయిన్ కేథరిన్ పోషించిన ఐరా పాత్ర మధ్య ప్రేమకథ హైలైట్ కానుందని, అలాగే భారీ యుద్ధ సన్నివేశాలు ఉంటాయని సమాచారం.
'బింబిసార' సినిమాలో కేథరిన్ ఒక కథానాయక కాగా... మరో కథానాయికగా ఎస్సై వైజయంతి పాత్రలో సంయుక్తా మీనన్ నటించారు. వాళ్ళిద్దరి పాత్రల నిడివి తక్కువే. అయితే... రెండో భాగంలో వాళ్ళకు ప్రాముఖ్యం ఉంటుందని తెలుస్తోంది. నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై హరికృష్ణ .కె చిత్రాన్ని నిర్మించారు. వశిష్ఠ దర్శకత్వం వహించారు. రెండో పార్ట్ కోసం ఆయన ముందుగా సీన్లు రాసుకోవడమే కాదు, కొన్ని సెట్స్ కూడా వేయించారట.