టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ్ కెరీర్ ప్రారంభంలో మంచి హిట్స్ అందుకున్నా.. ఆ తర్వాత వరుసగా ఫ్లాప్ లతో ఇబ్బంది పడ్డాడు. చాలా సంవత్సరాల తర్వాత ‘స్వామి రారా’ సినిమాతో మళ్లీ హిట్ ట్రాక్ లోకి అడుగు పెట్టాడు. అప్పటి నుంచి వరుసగా క్రేజీ ప్రాజెక్టులు చేస్తూ, మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. గతేడాది ‘కార్తికేయ 2’ సినిమాతో పాన్ ఇండియా రేంజిలో అదిరిపోయే హిట్ అందుకున్నాడు. ఈ సినిమాతో దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం మరో పాన్ ఇండియా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.  


స్పై’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నిఖిల్


నిఖిల్ సిద్దార్థ్ ఈసారి ‘స్పై’ థ్రిల్లర్ కథతో ఆకట్టుకోవడానికి సిద్దమవుతున్నాడు.  ఈ చిత్రం యూనివర్సల్ అప్పీల్ కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ ఎడిటర్ గ్యారీ BH ‘స్పై’ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇంతకు ముందు ‘గూఢచారి’, ‘ఎవరు’, ‘హిట్’, ‘పాగల్’, ‘హిట్ 2’ సినిమాలకు ఎడిటర్ గా పనిచేశాడు గ్యారీ. ఈడీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై కె రాజశేఖర్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిర్మాణానంతర దశలో ఉన్న ఈ చిత్రాన్ని సమ్మర్ లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు సినిమాపై అంచనాలను భారీగా పెంచుతున్నాయి. తొలుత విడుదలైన పోస్టర్ లో నిఖిల్ గన్ పట్టుకుని సీరియస్ లుక్‌లో కనిపిస్తున్నాడు. దీంతో పాటు నిఖిల్ తన ఇన్ స్టాలో ఈ సినిమా గురించి కీలక విషయాలు చెప్పుకొచ్చారు. ‘‘ఇది అఫీషియల్ లీక్. ‘కార్తికేయ 2’ సినిమా తర్వాత మరో పాన్ ఇండియా మూవీతో మీ ముందుకు వస్తున్నా. మల్టీ లాంగ్వేజ్ లో తెరకెక్కుతోన్న ఈ ‘స్పై’ థ్రిల్లర్ సినిమా ఈ వేసవిలో మీ ముందుకు రానుంది" అని వెల్లడించారు.






రూ. 40 కోట్లతో డిజిటల్, శాటిలైట్ రైట్స్ కొనుగోలు


ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో క్రేజీ అప్ డేట్ బయటకు వచ్చింది.  ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న నేపథ్యంలో ‘స్పై’ సినిమా నాన్-థియేట్రికల్ హక్కులను అమెజాన్ ప్రైమ్, స్టార్ నెట్‌ వర్క్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఏకంగా రూ. 40 కోట్లు ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. డిజిటల్, శాటిలైట్ భాగస్వాములుగా ‘స్పై’ సినిమాకు సంబంధించిన కొంత రష్‌ ఫీడ్ ను చూశారట. బాగా నచ్చడంతో ఎక్కువ మొత్తంలో డబ్బు కేటాయించి కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో ఐశ్వర్యా మీనన్ కథానాయికగా నటిస్తుండగా, ఆర్యన్ రాజేష్ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు. యాక్షన్‌తో కూడిన ఈ ‘ స్పై’ థ్రిల్లర్‌కి ప్రొడక్షన్‌తో పాటు, కె రాజశేఖర్ రెడ్డి కథను  అందించారు.


Read Also: ‘హనుమాన్‘ మూవీ నుంచి క్రేజీ అప్ డేట్, పవర్ ఫుల్ హనుమాన్ చాలీసా విడుదల