సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపు పొందింది నటి నయనతార. ఎన్నో అద్భుత సినిమాల్లో నటించి మెప్పించింది. అందం, అభినయంతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకుంది. సినిమాల ద్వారా ఎంత గుర్తింపు తెచ్చుకుందో, పలు విషయాలలో వివాదాలకు కేంద్ర బిందువు అయ్యింది.  ఇక ఈ ముద్దుగుమ్మ నవంబర్ 18, 1984లో కేరళలో జన్మించింది. ఆమెకు తల్లిదండ్రులు డయానా మరియం కురియన్ గా పేరు పెట్టారు. సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టిన తర్వాత తన పేరును నయనతారగా మార్చుకుంది. నేడు ఆమె పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ స్టోరీ..


మోడలింగ్ నుంచి సినిమా రంగంలోకి!


కాలేజీలో చదువుతున్న సమయంలోనే మోడలింగ్ లోకి అడుగు పెట్టింది నయనతార. ఒక షోలో దర్శకుడు సత్యన్ అంతిక్కడ్ ఆమెను చూశాడు. తన సినిమాల్లో అవకాశం ఇచ్చాడు. అలా మోడలింగ్ నుంచి సినిమా రంగంలోకి అడుగు పెట్టింది. ‘మనస్సినక్కరే’ అనే మలయాళ సినిమాతో 2003లో నయనతార హీరోయిన్ గా వెండి తెరకు పరిచయం అ`యింది. సుమారు రెండు దశాబ్దాల నుంచి చిత్ర పరిశ్రమలలో కొనసాగుతోంది. ఇప్పటికీ ఆమె క్రేజ్ పెరిగింది తప్ప, ఆమె ఎక్కడా తగ్గలేదు. సినీ కెరీర్ లో ఇప్పటి వరకు 75 సినిమాలు చేసింది. దక్షిణాది సినిమా పరిశ్రమలో అగ్ర హీరోయిన్లలో ఒకరుగా నయనతార ఉన్నారు. అద్భుతన నటనకు గాను సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపు పొందింది.    


గుర్తింపు తెచ్చిన సినిమా ’పుతి నియమం’ 
నయనతారకు మంచి గుర్తింపు తీసుకొచ్చిన సినిమా పుతి నియమం. ఎకె సాజన్ దర్శకత్వంతో తెరకెక్కిన ఈ సినిమాలో నయనతార, మమ్ముట్టి కీలక పాత్రల్లో నటించారు. యువతలో తగ్గుతున్న సామాజిక చైతన్యం, చుట్టుముడుతున్న సమస్యలను ఇతివృత్తంగా చేసుకుని ఈ సినిమా రూపొందించారు. ఈ సినిమాలో నయనతార నటనకు గాను ఉత్తమ నటిగా ఫిల్మ్ ఫేర్ అవార్డును నయనతార అందుకుంది.


తెలుగులోనూ మంచి ట్రాక్ రికార్డు 
తెలుగులో నయనతార ఎన్నో చక్కటి సినిమాల్లో నటించింది. అన్నింటికంతే మంచి గుర్తింపు తీసుకొచ్చిన సినిమా శ్రీరామ రాజ్యం. దిగ్గజ తెలుగు దర్శకుడు బాపు రూపొందించిన ఈ సినిమాలో బాలయ్యకు తోడుగా నటించి మెప్పించింది. సీతాదేవిగా ఆమె నటనకు తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఈ చిత్రానికి గాను నయనతార ఎన్నో అవార్డులు అందుకుంది.  నయనతార కెరీర్ లో గుర్తుండిపోయే మరో సినిమా రాజా రాణి. కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి గుర్తింపు తెచ్చింది. సున్నతమైన ప్రేమను దర్శకుడు మలిచిన తీరు, ఆ పాత్రలో నయనతార ఒదిగిపోయిన విధానం అందరికీ ఆకట్టుకుంటుంది. ఈ సినిమాను చూసి ప్రతి ప్రేక్షకుడు కంటతడి పెట్టకుండా ఉండలేడని చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో తన నటనకు గాను తమిళ సర్కారు నుంచి నంది అవార్డును దక్కించుకుంది. తాజాగా చిరంజీవి ‘గాడ్ ఫాదర్‘ సినిమాలో నటించింది. 


ఐఏఎస్ అధికారిగా ఆకట్టుకున్న నయనతార


ఇక ఈమె సినీ కెరీర్ లో మరో ఆణిముత్యం లాంటి సినిమా అరమ్. గోపీ నైనార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో లేడీ ఐఏఎస్ అధికారిగా ఆమె కనబర్చిన నటనకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. బోరు బావిలో పడిని చిన్నారని కాపాడేందుకు ఆమె చాకచక్యంగా వ్యవహరించిన తీరు ఎంతో ఆకట్టుకుంటుంది. ఈ చిత్రాలతో పాటు మరెన్నో చక్కటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.


ఎన్నో వివాదాలకు కేరాఫ్ అడ్రస్


ఇక నయనతార వ్యక్తిగత జీవితం ఎన్నో వివాదాలకు కేరాఫ్ గా నిలిచింది. ఇండస్ట్రీకి వచ్చిన తొలి రోజుల్లో తమిళ హీరోతో ప్రేమాయణం, ఆపై వీరు పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ, చివరకు తమ దారులు వేరంటూ విడిపోయారు. ఆ తర్వాత ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకుడుతో కొంతకాలం ప్రేమ తరువాత వివాహానికి సిద్ధమయ్యారు. ఆ సమయంలో ప్రభుదేవా తన భార్యకు విడాకులు ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. పెళ్లి వరకు వచ్చినా పెళ్లి పీటలు ఎక్కకుండానే వీరి వ్యవహారానికి బ్రేక్ పడింది. ఆ తర్వాత దర్శకుడు  విఘ్నేశ్ శివన్ తో పరిచయం ఆమె జీవితాన్ని మార్చేసింది. బ్రేకప్ ల తరువాత మానసికంగా కుంగిపోయిన నయన్ కు విఘ్నేశ్ శివన్ మద్దతుగా నిలిచాడు. అతడి పరిచయం ప్రేమగా మారి కొన్నేళ్ల పాటు డేటింగ్ చేశారు.  ఏడేళ్ల డేటింగ్ తరువాత ఈ సంవత్సరం జూన్ నెలలో విఘ్నేశ్ శివన్, నయనతార పెళ్లితో ఒక్కటయ్యారు.  పెళ్లైన 4 నెలలకే కవల పిల్లలకు తల్లిదండ్రులయ్యారు. నాలుగు నెలలకే పిల్లల్ని ఎలా పొందారు, సరోగసి నిబంధనలకు విరుద్దంగా నడుచుకున్నారని వీరిపై విమర్శలొచ్చాయి. ప్రభుత్వం సైతం స్పందించగా.. తమకు కొన్నేళ్ల కిందట వివాహమైందని, సరోగసికి తాము అర్హులమని పత్రాలు అధికారులకు సమర్పించడంతో వివాదం ముగిసిపోయింది.


కొంతకాలం సినిమాలకు బ్రేక్ ఇచ్చే అవకాశం!


ఇక ఇంతకాలం సినిమాలో బిజీగా ఉండటంతో పాటు రకరకాల వివాదాలతో మానసిక ప్రశాంతత కోల్పోయిన నయనతార.. ప్రస్తుతం తన భర్త విఘ్నేశ్ శివన్, కవల పిల్లలకు సమయాన్ని కేటాయిస్తోంది. అందులో భాగంగానే సినిమాలకు కొంతకాలం బ్రేక్ ఇవ్వాలని చూస్తున్నట్లు సమాచారం. నేడు బర్త్ డే సందర్భంగా సినీ ప్రముఖులతో పాటు అభిమానులు నయనతారకు బర్త్ డే విషెస్ చెబుతున్నారు.


Read Also: కంటతడి పెట్టిస్తున్న ‘ఇండియా లాక్ డౌన్‘ ట్రైలర్, మూవీ రిలీజ్ ఎప్పుడంటే?