బాలీవుడ్ దిగ్గజ దర్శకుడు మధుర్ భండార్కర్ తాజా మూవీ ‘ఇండియా లాక్‌డౌన్‘ విడుదలకు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ విడుదలైంది. దేశంలో తొలి లాక్‌డౌన్ ప్రకటించిన తర్వాత ప్రజలు ఎదుర్కొన్న కష్టాలను ఈ చిత్రంలో కళ్లకు కట్టినట్లు చూపించనున్నారు. కోవిడ్ -19 మహమ్మారి ఫస్ట్ వేవ్ సమయంలో భారత ప్రభుత్వం 21 రోజుల పాటు పూర్తి లాక్‌డౌన్ ప్రకటించింది. ఈ లాక్ డౌన్ వేళ జరిగిన విషాద సంఘటనలను ‘ఇండియా లాక్ డౌన్‘ మూవీ మరోసారి గుర్తు చేయబోతోంది. ఈ చిత్రంలో శ్వేతా బసు ప్రసాద్, ప్రతీక్ బబ్బర్, సాయి తంహంకర్, అహనా కుమార్, ప్రకాష్ బెలవాడి కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఆకట్టుకుంటున్న ‘ఇండియా లాక్‌డౌన్‘ ట్రైలర్
దేశంలో విధించిన లాక్ డౌన్ మూలంగా సమాజంలోని వివిధ వర్గాల ప్రజలు ఎలా ప్రభావితం అయ్యారో తాజా ట్రైలర్ లో చూపించే ప్రయత్నం చేశారు దర్శకుడు. పొట్ట కూటి కోసం ఇతర రాష్ట్రాలకు వలస వచ్చిన నిరుపేదలు తమ సొంత గ్రామాలకు తిరిగి కాలినడకన వెళ్లడం కంటతడి పెట్టించేలా చూపించారు. ఒక గృహిణి తన ఉద్యోగాన్ని పోగొట్టుకోవడం, సెక్స్ వర్కర్ పడిన ఇబ్బందులు, ధనవంతుల పిల్లలు ఇంట్లో ఉండలేక చేసే పనులు, నిరుపేదలు పూట గడవడం కోసం పడిన ఆవేదన తాలూకు అంశాలు అందరినీ కలిచి వేస్తున్నాయి.
డిసెంబర్ 2న ‘ఇండియా లాక్ డౌన్‘ విడుదల
ఈ సినిమాను PEN స్టూడియోస్‌కు చెందిన జయంతిలాల్ గడ, మధుర్ భండార్కర్ కు సంబంధించి భండార్కర్ ఎంటర్‌టైన్‌మెంట్, ప్రణవ్ జైన్ కు సంబంధించిన P J మోషన్స్ పిక్చర్స్ కలిసి నిర్మిస్తున్నాయి. డిసెంబర్ 2న Zee5లో ‘ఇండియా లాక్‌డౌన్‘ సినిమా విడుదల కాబోతుంది. ఈ సంవత్సరం మధుర్ భండార్కర్ తెరకెక్కించిన రెండో సినిమా OTT వేదికగా విడుదలకానుంది. ఇప్పటికే తమన్నా భాటియా ప్రధాన పాత్రలో నటించిన బాబ్లీ బౌన్సర్ సెప్టెంబర్‌లో డిస్నీ+హాట్‌స్టార్ లో విడుదల అయ్యింది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది.
Read Also: ‘తారే జమీన్ పర్’ పిల్లాడు ఇప్పుడు ఎలా ఉన్నాడో చూశారా? ‘కేపిటల్ A స్మాల్ a’ సీరిస్‌తో రీ-ఎంట్రీ